CM Revanth Reddy Land Dispute: భూ వివాదం కేసు.. సీఎం రేవంత్‌కు సుప్రీంలో ఊరట
ABN , Publish Date - Jul 30 , 2025 | 03:15 AM
భూవివాదం కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది.
విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్‌ను కొట్టేసిన సీజేఐ ధర్మాసనం
హైకోర్టు జడ్జిపై పిటిషనర్ పెద్దిరాజు వ్యాఖ్యల మీద ఫైర్
న్యాయవాది క్షమాపణనూ పరిగణనలోకి తీసుకోవడానికి నిరాకరణ
పిటిషనర్ సహా లాయర్లకు కోర్టు ధిక్కరణ నోటీసులు
న్యూఢిల్లీ, జూలై 29 (ఆంధ్రజ్యోతి): భూవివాదం కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి మీద పిటిషనర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. పిటిషనర్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీచేసింది. గోపన్‌పల్లి గ్రామం సర్వే నంబర్ 127లోని సొసైటీకి సంబంధించిన భూమిని ఆక్రమించడంతోపాటు.. నిర్మాణాలను జేసీబీతో కూల్చేశారంటూ గచ్చిబౌలి పోలీ్‌సస్టేషన్‌లో 2016లో కేసు నమోదైంది. ఈ కేసులో ఏ1గా కొండల్ రెడ్డి, ఏ2గా ఇ.లక్ష్మయ్య, ఏ3గా రేవంత్‌రెడ్డిని చేర్చారు. రంగారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టులో ఈ కేసు విచారణలో ఉండగా.. 2021లో రేవంత్‌రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సుధీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం.. రేవంత్ రెడ్డి ఘటనా స్థలంలో లేరనే విషయాన్ని ఫిర్యాదుదారు సైతం అంగీకరించారని పేర్కొంది. తాను లేను కాబట్టి తనపై కేసు కొట్టేయాలని అడుగుతున్నారని, మిగతా వారిపై కేసుకొట్టేయాలని అడగటం లేదని వ్యాఖ్యానించింది.
రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకే నిందితులు దూషించారని ఆరోపిస్తున్నా.. అందుకు ఆధారాలు లేవని తెలుపుతూ రేవంత్ రెడ్డిపై దాఖలైన కేసును కొట్టివేసింది. అయితే.. ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ఈ నెల 12వ తేదీన పిటిషనర్ పెద్దిరాజు సుప్రీంకోర్టులో ట్రాన్స్‌ఫర్ పిటిషన్(క్రిమినల్) దాఖలు చేశారు. ఈ పిటిషన్ మంగళవారం సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్‌ల ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి తరపు సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్ర, పిటిషనర్ తరఫున న్యాయవాది రితేశ్ పాటిల్ హాజరయ్యారు. అయితే, కేసు విచారణ సందర్భంగా పిటిషనర్ తీరుపై సీజేఐ తీవ్రంగా స్పందించారు. హైకోర్టు సిటింగ్ జడ్జిపై అసభ్యకరమైన ఆరోపణలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషనర్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు పంపిస్తున్నామని తెలిపారు. దీంతో ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇందుకు చీఫ్ జస్టిస్ అంగీకరించలేదు. ఇదే తీరులో దాఖలైన పిటిషన్‌పై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు మీకు తెలియవా? అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు.
మరోవైపు హైకోర్టులో ఈ కేసు విచారణ జరిగిన తీరు, అనంతరం తీర్పులోని ముఖ్య అంశాలను సిద్దార్థ్ లూథ్ర ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మరోసారి సీజేఐ పిటిషనర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఒక సిటింగ్ జడ్జిపై అభ్యంతరకరమైన ఆరోపణలు చేశారు. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు. ఇలాంటి పిటిషన్ వేసే ముందు, కనీసం సంతకం చేసేప్పుడైనా చూసుకోరా?’’ అని న్యాయవాదిని ప్రశ్నించారు. పిటిషనర్ పెద్దిరాజుతోపాటు ఆయన తరఫు న్యాయవాదులు రితేశ్ పాటిల్, ఏవోఆర్‌కు నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపారు. తదుపరి విచారణకు పెద్దిరాజు హాజరు కావాలని ఆదేశించారు. దీనిపై కోర్టు సాక్షిగా పిటిషనర్ తరపు న్యాయవాది నితిన్ మిశ్రా క్షమాపణలు కోరారు. అయితే.. ఈ క్షమాపణలను పరిగణలోకి తీసుకోబోమని ధర్మాసనం స్పష్టంచేసింది. క్షమాపణలపై రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని తేల్చిచెప్పింది ‘‘ఏదైనా పొరపాటు లేదా మిస్‌యూజ్ జరిగితే న్యాయవాదులను రక్షించే ప్రయత్నం చేస్తాం. అంతేకానీ.. జడ్జిలను ఒక పెట్టెలో బంధించేలా అసత్య, అభ్యంతరకర ఆరోపణలు చేస్తే అనుమతించేది లేదు. ఇది ముమ్మాటికీ నిర్లక్ష్యమే. గత సుప్రీంకోర్టు తీర్పులను అనుసరించి పిటిషనర్ పెద్దిరాజు, ఏవోఆర్ రితేశ్ పాటిల్, న్యాయవాది నితిన్ మిశ్రాలకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేస్తున్నాం. ముగ్గురూ దీనిపై వారంలో రాతపూర్వక సమాధానం ఇవ్వాలి. ఆగస్టు 11న కోర్టు ముందుకు హాజరు కావాలి’’ అని ఆదేశాల్లో స్పష్టంచేశారు. అలాగే, పెద్దిరాజు వేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట
హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్
Read latest Telangana News And Telugu News