CM Revanth Reddy: జల.. భద్రం!
ABN , Publish Date - Aug 13 , 2025 | 04:21 AM
తెలంగాణవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాబోయే 72 గంటలపాటు అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
కార్యాచరణతో అప్రమత్తంగా ఉండండి
ఉద్యోగులకు సెలవులు రద్దు..
అవసరమైతే బడులకు సెలవులివ్వండి
కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాబోయే 72 గంటలపాటు అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముందస్తు కార్యాచరణపై రాష్ట్రస్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తప్పిదాలకు తావు లేకుండా.. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రానున్న మూడు రోజులు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలని నిర్దేశించారు. ఆకస్మిక వరదలు వస్తే లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించేందుకు, వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాప్టర్లను సిద్ధం చేసి పెట్టుకోవాలని చెప్పారు. హైదరాబాద్‌తోపాటు గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యవసర సమయంలో అందుబాటులో ఉండేందుకు వీలుగా టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, వరదల సమయంలో రాకపోకలు లేకుండా చూడాలని సూచించారు. ‘‘పశువులు, మేకలు, గొర్రెల కాపర్లు తరచూ వరదల్లో చిక్కుకుపోతున్నారు. వారిని అప్రమత్తం చేయాలి. పశు నష్టం జరగకుండా చూడాలి’’ అని సూచించారు. అధిక వర్షపాతం నమోదయ్యే జిల్లాలకు సీనియర్ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించాలని సీఎస్ రామకృష్ణారావుకు సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, క్షేత్రస్థాయిలో అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ‘‘రెండు రోజుల్లో ఎంత వర్షపాతం వస్తుంది.. దానిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై మనకు మాన్యువల్స్ ఉన్నాయి. కానీ, వాతావరణ మార్పులతో రెండు గంటల్లోనే రెండు నెలల వర్షపాతం కురుస్తోంది. క్లౌడ్ బర్‌స్టతో ఊహించనంత నష్టం వాటిల్లుతోంది. ఈ పరిస్థితులను ఎదుర్కొనే వ్యూహాలను సిద్ధం చేసుకోవాలి. ఊహించనంత వర్షపాతం కారణంగానే గతంలో ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ప్రాణ నష్టంతోపాటు భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. అటువంటి ఘటనలు ఎట్టి పరిస్థితుల్లో పునరావృతం కావడానికి వీల్లేదు’’ అని నిర్దేశించారు. ఒకవేళ, పిడుగుపాటుతో పశువులు, గొర్రెలు, మేకలు చనిపోతే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించి బాఽధితులకు పరిహారం అందేలా చూడాలని పశు సంవర్థక శాఖ అధికారులను ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలను హెచ్చరించాలి
ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లోకి వచ్చే వరద నీటిపై అవగాహనతో ఉండాలని, నీటి విడుదలపై పూర్తి సమాచారం లోతట్టు ప్రాంతాల ప్రజలకు తెలియజేయాలని నీటి పారుదల శాఖ అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలను సహాయ శిబిరాలకు తరలించాలని, వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. చెరువులు, కుంటల కట్టలు తెగే ప్రమాదం ఉన్నందున ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్తు శాఖ అధికారులు, సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని, అత్యవసర సమయంలో వినియోగించేందుకు వీలుగా మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్లు, జనరేటర్లు, స్తంభాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, పీహెచ్‌సీల్లో అత్యవసర మందులు సిద్ధం చేసి పెట్టుకోవాలన్నారు. గర్భిణులను తక్షణమే తరలించేలా అంబులెన్సులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.
హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి
భారీ వర్షాల నేపథ్యంలో నగరంపై కీలక శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు సమన్వయంతో పని చేయాలని సీఎం రేవంత్ సూచించారు. జీహెచ్‌ఎంసీ, హైడ్రా, పోలీసు, పురపాలక, విద్యుత్తు, విపత్తుల నిర్వహణ.. ఇలా అన్ని శాఖలూ సమన్వయంతో ముందుకు సాగాలని చెప్పారు. వర్షాల తీవ్రతపై విద్య, ఐటీ శాఖ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు సమీక్ష చేసుకుని అవసరమైతే పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని, ఐటీ కంపెనీలతో మాట్లాడి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని హైడ్రాకు సూచించారు. అత్యవసర సమాచారాన్ని ఎఫ్‌ఎం రేడియో ద్వారా కూడా ప్రజలకు చేరవేయాలని తెలిపారు. వాతావరణ హెచ్చరికలను ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియజేయాలని, అదే సమయంలో మీడియా చానళ్లు ప్రజల్లో భయానక వాతావరణం సృష్టించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీఎస్, డీజీపీ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు
Read Latest Telangana News And Telugu News