CM Revanth Reddy: ప్రతీ చుక్క వరద మూసీకి చేరాలి
ABN , Publish Date - Aug 09 , 2025 | 04:57 AM
హైదరాబాద్ మహా నగరంలో భారీ వర్షాలు కురిసినా తట్టుకునేందుకు వీలుగా వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
చెరువులు, నాలాల్ని మూసీకి అనుసంధానించాలి
రాజధాని వరదకు మూసీ పునరుజ్జీవనమే పరిష్కారం
అప్పుడే నగరంలో కాలనీలన్నీ సురక్షితం
భారీ వర్షాలు పడినాతట్టుకునేలా ప్రణాళికలుండాలి
హైదరాబాద్ వర్షాలపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మహా నగరంలో భారీ వర్షాలు కురిసినా తట్టుకునేందుకు వీలుగా వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మూసీ పునరుజ్జీవనమే మనకున్న చక్కటి పరిష్కార మార్గమని చెప్పారు. వరద నీటి ప్రవాహానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగించి, భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. వర్షాలతో నగరం అతలాకుతలం కాకుండా ఉండేందుకు, జనజీవనం అస్తవ్యస్తం కాకుండా ఉండేందుకు యుద్ధ ప్రాతిపదికన శాశ్వత అభివృద్థి పనులు చేపట్టాల్సిన అవసరముందని చెప్పారు. తాగునీరు, వరద నీరు, డ్రైనేజీలు, ట్రాఫిక్ వ్యవస్థలను మరో వందేళ్ల అవసరాలను అంచనా వేసుకొని అభివృద్ధి చేయడానికి కొత్త ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీ నుంచి శుక్రవారం హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి ముందురోజు రాత్రి నగరంలో కురిసిన వర్షం, తలెత్తిన ఇబ్బందులు, వాటిని అధిగమించేందుకు అనుసరించాల్సిన విధానాలపై అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అన్ని విభాగాల అధికారుల అభిప్రాయాలను తీసుకున్నారు. హైదరాబాద్‌లో గురువారం రాత్రి ఏకంగా 15 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ట్రాఫిక్ స్తంభించింది. లోతట్టు ప్రాంతాలకు వరద ముంపు పరిస్థితి ఏర్పడింది. తక్కువ వ్యవధిలో ఎక్కువ వర్షం పడటంతో జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. మూడు నాలుగు నెలల వర్షం మొత్తం ఒకే రోజున కుమ్మరించటంతో ఇబ్బందులు వచ్చాయనే అంశం చర్చకు వచ్చింది. వాతావరణ మార్పులే అందుకు ప్రధాన కారణమని, అందుకు తగినట్లుగా నగరంలో అన్ని వ్యవస్థలను ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న రోడ్లు, డ్రైనేజీలు 5 సెంటీమీటర్ల వర్షం పడితే తట్టుకునే పరిస్థితి లేదని, ఒక్కోసారి కొన్నిచోట్ల 20 సెంటీమీటర్ల వర్షం నమోదవుతోందని ప్రస్తావించారు. హైదరాబాద్‌లో గురువారం రాత్రి కేవలం 4 గంటల వ్యవధిలోనే కొన్ని ప్రాంతాల్లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, జీహెచ్‌ఎంసీ పరిధిలో 16 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని తెలిపారు. ఎంత వర్షం పడినా నగరంలో ఎక్కడా నీరు నిలబడకుండా, వరద నీటితో ముంపునకు గురవకుండా, లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా సురక్షితంగా ఉండేలా పకడ్బందీ విధానాన్ని అమలు చేయాలన్నారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును వెంటనే చేపట్టాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో 55 కిలోమీటర్ల పొడవునా మూసీని పునరుద్థరించటం ద్వారా పరివాహక ప్రాంతంతో పాటు నగరంలో ఉన్న అన్ని ప్రాంతాలు, కాలనీలన్నీ సురక్షితంగా ఉంటాయని చెప్పారు. వరదనీటి ప్రవాహానికి అడ్డంకులు ఉన్నందునే నగరంలో ప్రస్తుత పరిస్థితి తలెత్తిందని అధికారులు అన్నారు.
వరద నీరు మూసీకి చేరేలా...
ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్‌లోని వరదనీరు అన్ని వైపుల నుంచి మూసీకి చేరేలా ప్రణాళికలు సిద్థం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హుస్సేన్ సాగర్, దుర్గం చెర్వు, మీర్ అలంతో పాటు ప్రతీ చెరువు, కుంటలను నాలాల ద్వారా మూసీకి అనుసంధానం చేయాలని సూచించారు. చెరువుల పునరుద్థరణ, నాలాలను వెడల్పు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. డ్రైనేజీల ద్వారా వచ్చే నీటిని ఎస్టీపీ (సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల) ద్వారా శుద్థి చేయాలని, మూసీలో స్వచ్ఛమైన నీరు మాత్రమే ఉండేలా చూడాలని చెప్పారు. నగరంలో ఎక్కడ వర్షం పడినా నీరు చెరువుల్లోకి, నాలాల్లోకి, అటు నుంచి మూసీలోకి చేరేలా అనుసంధానం జరగాలని స్పష్టం చేశారు. మూసీలో స్వచ్ఛమైన నీటి ప్రవాహంతో హైదరాబాద్‌లో నీటి కష్టాలు తీరతాయని చెప్పారు. శుద్థి చేసిన నీటిని పరిశ్రమలు, ఇతర అవసరాలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా వినియోగించుకునే వీలుంటుందని చెప్పారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును వరద నీటి నిర్వహణకు వీలుగా డిజైన్ చేయాలని ఆదేశించారు. వర్షాలు, వరదల సమయంలో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోందని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పారు. పాతనగరంలో పాదచారుల జోన్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టాలన్నారు. చార్మినార్, సాలార్‌జంగ్ మ్యూజియం, హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి ప్రాంతాల్లో బహుళ అంతస్తుల పార్కింగ్ జోన్‌లు ఏర్పాటు చేయాలని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అవి చూసి షాక్ అయ్యా: బండి సంజయ్
‘బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు’
For More AndhraPradesh News And Telugu News