రెండేళ్లలో యంగ్ ఇండియా గురుకులాల నిర్మాణం
ABN , Publish Date - Feb 15 , 2025 | 03:35 AM
రెండేళ్లలో 105 నియోజకవర్గాల్లో అన్ని రకాల మౌలిక వసతులతో యంగ్ ఇండియా గురుకుల పాఠశాలల నిర్మాణం వందశాతం పూర్తి కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

విద్యా శాఖ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం
చాకలి ఐలమ్మ వర్సిటీలో అన్ని వసతులు ఉండాలని సూచన
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): రెండేళ్లలో 105 నియోజకవర్గాల్లో అన్ని రకాల మౌలిక వసతులతో యంగ్ ఇండియా గురుకుల పాఠశాలల నిర్మాణం వందశాతం పూర్తి కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. యంగ్ ఇండియా గురుకులాలు, వీరనారి చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయం పనులపై విద్యాశాఖ అధికారులతో ముఖ్యమంత్రి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా యంగ్ ఇండియా గురుకుల పాఠశాలలకు సంబంధించిన భూసేకరణ, ఇతర వివరాలను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
నియోజకవర్గాల్లో స్థలాల కేటాయింపు పూర్తయితే.. తగిన అనుమతులు అందించి పనుల్లో వేగం పెంచాలన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటన చేసి పాఠశాలలకు ప్రతిపాదించిన స్థలాలను పరిశీలించాలని సీఎం ఆదేశించారు. స్థలాలు అనువుగా లేకపోతే ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టాలని సూచించారు. స్థలాల గుర్తింపుపై వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇక, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించాలని స్పష్టం చేశారు. అకడమిక్ బ్లాక్, ఆట స్థలం, ఇతర సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
డెస్టినేషన్ వెడ్డింగులకు తెలంగాణకు రావాలి
ఉపాధి కల్పించే విధంగా పర్యాటకం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపు
హైదరాబాద్, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి ఆదాయం సమకూర్చడమే కాకుండా ఎక్కడికక్కడ యువతకు ఉపాధి కల్పించే వనరుగా పర్యాటక శాఖ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పర్యాటకులను ఆకర్షించే వనరులు ఎన్నో ఉన్నా, ప్రచారంపైశ్రద్థ చూపక పోవడం, వినూత్న పద్థతిలో ఆలోచించక పోవడంతో ఈ రంగంలో ఆశించిన ప్రగతి కనిపించలేదని చెప్పారు. పర్యాటక శాఖపై శుక్రవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్‌లో బోట్ హౌస్ అందుబాటులో ఉంచాలని, డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు తెలంగాణను వేదికగా మార్చాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తగిన ప్రోత్సాహకాలు అందించాలని పిలుపునిచ్చారు. భువనగిరి కోట రోప్ వే పనులపై సీఎం ఆరా తీశారు. త్వరగా రోప్‌వే పనులకు టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. సాహస క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుపతి జిల్లా: నారావారిపల్లెలో విషాదం
ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా..: హరీష్‌రావు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News