Share News

CM Revanth Reddy: ఆ నగరాల పరిస్థితి హైదరాబాద్‌కు రావద్దు

ABN , Publish Date - Jul 30 , 2025 | 03:11 AM

హైదరాబాద్‌ నగరంలో భూగర్భ డ్రైనేజీ, కేబుల్‌ వ్యవస్థపై దృష్టిసారించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు ఆయా శాఖలు సమగ్ర డీపీఆర్‌ తయారు చేయాలని నిర్దేశించారు.

CM Revanth Reddy: ఆ నగరాల పరిస్థితి హైదరాబాద్‌కు రావద్దు

ఢిల్లీ, ముంబై, చెన్నైలలో కాలుష్యంతో ఇబ్బందులు

  • ఆ సమస్యలు మన దగ్గర తలెత్తకుండా చూడాలి

  • హైదరాబాద్‌ నగరంలో భూగర్భ డ్రైనేజీ, కేబుల్‌ వ్యవస్థ

  • ఇందుకు సమగ్ర డీపీఆర్‌ తయారు చేయండి

  • నీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థను సంస్కరించండి

  • నిర్మాణ రంగ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దు

  • కొత్వాల్‌గూడ జంక్షన్లో ఇండియా గేట్‌ వంటి నిర్మాణం

  • నిధులిచ్చినా మెట్రో విస్తరణ పనుల్లో జాప్యమేంటి!?

  • పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ సమీక్షలో సీఎం

హైదరాబాద్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ నగరంలో భూగర్భ డ్రైనేజీ, కేబుల్‌ వ్యవస్థపై దృష్టిసారించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు ఆయా శాఖలు సమగ్ర డీపీఆర్‌ తయారు చేయాలని నిర్దేశించారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధించాలని, నిర్మాణ రంగ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో మంచినీటి సరఫరా, మురుగు నీటి వ్యవస్థను సంస్కరించాలని, ప్రజలకు నాణ్యమైన తాగునీరు, మెరుగైన సేవలను అందించాలని సూచించారు. తనకున్న వనరులను సద్వినియోగం చేసుకునే అంశంపై జల మండలి ప్రత్యేక ప్రణాళికలను తయారు చేసుకోవాలని తెలిపారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో మంగళవారం సీఎం సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌ నగరాన్ని కాలుష్యరహితంగా మార్చాలని, విపరీతమైన కాలుష్యంతో ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ పరిస్థితి హైదరాబాద్‌లో తలెత్తకూడదని నిర్దేశించారు. రానున్న 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాల్లో తలెత్తిన సమస్యలపై అధ్యయనం చేయాలని చెప్పారు. కోర్‌ సిటీలో ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను ఓఆర్‌ఆర్‌ బయటకు తరలించాలని ఆదేశించారు. ఓఆర్‌ఆర్‌ పరిధిలో వారసత్వ కట్టడాల సంరక్షణ, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి వీలుగా కులీకుతుబ్‌ షాహీ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ మార్గదర్శకాలను సవరించి మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు.


మూసీ పరీవాహకంలో ఓ ల్యాండ్‌ మార్క్‌ను నిర్మించండి

మూసీ రివర్‌ ఫ్రంట్‌కు సంబంధించి హిమాయత్‌ సాగర్‌ నుంచి గాంధీ సరోవర్‌ వరకు పనులు వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. ఓఆర్‌ఆర్‌ నుంచి మూసీ వైపు వచ్చే క్రమంలో కొత్వాల్‌గూడ జంక్షన్లో మూసీ రివర్‌ ఫ్రంట్‌కు ప్రతీకగా ఇండియా గేట్‌, గేట్‌ వే ఆఫ్‌ ఇండియా, చార్మినార్‌ వంటి ఓ ల్యాండ్‌ మార్క్‌ను నిర్మించాలని, మూసీపై బ్రిడ్జి కం బ్యారేజీలకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. నెహ్రూ జూపార్క్‌, మీరాలం ట్యాంక్‌ అభివృద్ధి పనుల పురోగతిపైనా సీఎం సమీక్షించారు. మీరాలం ట్యాంకు ఎదురుగా ఏర్పాటు చేసిన ఎస్టీపీలు వాటి సామర్థ్యానికి అనుగుణంగా పని చేసేలా చూడాలని నిర్దేశించారు. జూ పార్క్‌, మీరాలం ట్యాంకు సమీపంలో పర్యాటకులు బస చేసేందుకు వీలుగా అధునాతన వసతులతో హోటల్‌ నిర్మించాలని, నగరాన్ని వీక్షించేలా అది ఉండాలని అభిప్రాయపడ్డారు.


మెట్రో పనులు వేగవంతం చేయాలి

పాతబస్తీలో మెట్రో పనుల పరిస్థితిని సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్షించారు. మెట్రో రెండో దశ విస్తరణ పనుల్లో ఆలస్యం ఎందుకు జరుగుతోందని అధికారులను ప్రశ్నించారు. వాటికి నిధులు మంజూరు చేసినా జాప్యం జరగడమేంటని అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పనుల్లో జరుగుతున్న జాప్యంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. స్థలాలు ఇవ్వడానికి పలువురు ముందుకొచ్చిన ప్రాంతాల్లోనూ పనులు ముందుకు వెళ్లకపోవడంపై అసహనం వ్యక్తం చేశారని సమాచారం. అవసరమైన నిధులు ఇప్పటికే విడుదల చేసినందున పనులను వేగవంతం చేయాలని, జాప్యం జరగనివ్వవద్దని అధికారులను ఆదేశించారు. మెట్రో అనుమతుల విషయంలో జాప్యాన్ని సహించబోమని హెచ్చరించారు. కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ పనులు వేగంగా పూర్తి చేసేలా చూడాలని సూచించారు. ప్యారడైజ్‌ కూడలి నుంచి శామీర్‌పేట ఓఆర్‌ఆర్‌ వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్‌, కార్యదర్శులు ఇలంబర్తి, శ్రీదేవి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్నన్‌, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌, వాటర్‌ బోర్డు ఎండీ అశోక్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట

హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 30 , 2025 | 05:54 AM