CM Revanth Reddy: టీవీలు, పేపర్లు, వేల కోట్లు ఉన్నా.. ఉద్యమకారులేనట
ABN , Publish Date - Aug 17 , 2025 | 03:45 AM
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ద్వారా కొంతమందికి ఫామ్‌హౌ్‌సలు, టీవీలు, పేపర్లు, వేల కోట్ల ఆస్తులు వచ్చాయని, అయినా ఇంకా తాము ఉద్యమకారులమేనని వాళ్లు చెప్పుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు.
నిజమైన ఉద్యమకారులెవరూ చెప్పుకోరు
నేను ఎవరినీ శత్రువుగా చూడటం లేదు
నాకు శత్రువు కావాలన్నా ఓ స్థాయి ఉండాలి
నా కోపాన్ని ప్రదర్శించుకోవడానికి సీఎంని కాలేదు
అలా వినియోగిస్తే నాకంటే మూర్ఖుడు ఉండరు
వారి దుఃఖానికి నా గెలుపు చాలు
వాళ్లు చేసుకున్న పాపాలకు వాళ్లే పోతారు
109 దేశాల సుందరీమణులతో తెలంగాణ గేయం పాడించా.. సీఎంగా ఇది నేను సాధించిన విజయం
ధర్మ గంట మాదిరిగా అందుబాటులో ఉంటున్నాం
అందెశ్రీ ‘హసిత బాష్పాలు’ ఆవిష్కరణలో రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ద్వారా కొంతమందికి ఫామ్‌హౌ్‌సలు, టీవీలు, పేపర్లు, వేల కోట్ల ఆస్తులు వచ్చాయని, అయినా ఇంకా తాము ఉద్యమకారులమేనని వాళ్లు చెప్పుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. చాలా మంది తాము ఉద్యమకారులమని చెప్పుకొంటున్నారని, కానీ, నిజమైన ఉద్యమకారులెవరూ అలా చెప్పుకోరని, అందుకు ఉదాహరణ అందెశ్రీ అని వ్యాఖ్యానించారు. ప్రముఖ కవి అందెశ్రీ ప్రచురించిన ‘హసిత బాష్పాలు’ పుస్తకావిష్కరణ సభ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొని మాట్లాడారు. ‘‘గూడ అంజన్న, దాశరథి, కాళోజీ, గద్దరన్న, అందెశ్రీ, గోరటి వెంకన్న వంటివారు పోరాటానికి, తిరుగుబాటుకు, ధిక్కార స్వరానికి వేదికయ్యారు. ప్రజలకు స్ఫూర్తిని, స్వేచ్ఛను, సా మాజిక న్యాయాన్ని, సమాన అవకాశాలను కల్పించేందుకు వారు సర్వం కోల్పోయి.. అండగా నిలబడ్డారు. చేగువేరా నుంచి అందెశ్రీ వరకు ఉద్యమంలో ప్రజలకు స్ఫూర్తినిచ్చారు. లక్షలాదిమందిని ఉద్యమం వైపు నడిపించారు. ఆస్తులు, అంతస్తులు కోల్పోయారు. చివరికి వారి కుటుంబాలు కూడా నిర్లక్ష్యానికి గురయ్యాయి. మరి, వీరి కుటుంబాలు ఇలా ఎందుకు నిర్లక్ష్యానికి గురయ్యాయి!? కొంతమందికి వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయన్నది నాకు అర్ధం కావడం లేదు. ఈ విషయంపై అందెశ్రీనే స్పష్టత ఇవ్వాలి’’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమకారులమనే గొప్ప పదాన్ని రాజకీయ నేతలు ఆపాదించుకుంటే అది సరైనది కాదేమోనని రేవంత్ అభిప్రాయపడ్డారు. ఉద్యమమే నేపథ్యంగా రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి.. దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని, పేరు బంధం, పేగు బంధం తెంచుకుని దేశానికి నాయకుడిని కావాలనే దురాశతో బయలుదేరితే ఉన్నది పోయింది.. ఉంచుకున్నదీ పోయిందనే పరిస్థితి రాష్ట్రంలో వచ్చిందని పరోక్షంగా కేసీఆర్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. కానీ, అందెశ్రీ, గద్దర్ ఏమీ ఆశించలేదని, ప్రజల స్వేచ్ఛను మాత్రమే ఆశించారని తెలిపారు.
నాకు శత్రువు కావాలన్నా స్థాయి ఉండాలి
‘అధికారం వచ్చింది కదా, నిన్ను ఇబ్బంది పెట్టిన వారిని ఏమైనా చేయొచ్చు కదా’ అని చాలామంది చెబుతున్నారని, కానీ, తాను ఎవరినీ శత్రువుగా చూడలేదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను శత్రువుగా చూడాలన్నా వారికి ఒక స్థాయి ఉండాలని వ్యాఖ్యానించారు. తన కోపాన్ని ప్రదర్శించడానికిరాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాలేదన్నారు. గ్రామీణ ప్రాంతంలో మధ్య తరగతి కుటుంబంలో పుట్టి, పెరిగిన తనకు ప్రజలు గొప్ప అవకాశాన్ని ఇచ్చారని, దీనిని 4 కోట్ల ప్రజల సంక్షేమం, అభివృద్ధి.. ఈ ప్రాంత అభ్యున్నతి కోసం వినియోగించకుండా.. ఎవరిపైనో కోపంతోనో, ఎవరో నచ్చలేదనో వారిపై వినియోగిస్తే తనకంటే మూర్ఖుడు వేరొకరు ఉండరన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాను కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువగా నమ్ముతానని, అందుకే, ఈ 20 నెలలుగా వారు చేసుకున్న పాపాలకు వారే పోతారని భావిస్తున్నానని చెప్పారు. వారి దుఃఖానికి తన గెలుపు చాలని.. తాను సీఎం కుర్చీలో కూర్చొని సంతకం పెడుతుంటే.. అదే వారి గుండెలపై గీత గీసినట్టు ఉంటుందని వ్యాఖ్యానించారు. ‘‘నేను మీకంటే గొప్పవాడిని కాదు. పెద్దవాడిని కాదు. మీలో ఒకడిని. నాకొచ్చిన ఈ అవకాశం ఎంత కాలం నా దగ్గరుంటే అంతవరకూ పేదవారి కోసమే ఉపయోగిస్తాను. దేశం ఏర్పడి వందేళ్లు అయ్యే 2047 నాటికి దేశాన్ని 30ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీసుకెళ్లే దిశగా ప్రధాని మోదీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అప్పటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా ‘తెలంగాణ రైజింగ్-2047’ రూపొందించామని నీతి ఆయోగ్ సదస్సులో ప్రధాని మోదీకి తెలిపాను. అదే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. అప్పటి వరకు ప్రజా జీవితంలో క్రియాశీలంగా ఉండి.. నిరంతరం ప్రజల సమక్షంలో ఉంటూ పనిచేస్తాను’’ అని స్పష్టం చేశారు.
109 దేశాల సుందరీమణులతో తెలంగాణ గేయం పాడించా
‘‘ఇటీవల రాష్ట్రంలో భారత్ సమ్మిట్, మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించాం. ఆ సమయంలో వారికి బీఆర్‌ఎస్ హయాంలో నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్, సచివాలయాన్నే చూపించారు కదా అని కొంతమంది అన్నారు. కానీ, వారికి తెలియనిది ఏమిటంటే.. మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన 109 దేశాల సుందరీమణులతోపాటు ఆ దేశాల ప్రజలతో ఒక భవన నిర్మాణ మేస్ర్తి అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ’ గేయాన్ని పాడించాను. వారికి ఆ భావన, స్ఫూర్తిని ఇవ్వగలిగాను. తెలంగాణ, తెలంగాణ తల్లి ఇలా ఉంటుందని వారికి చెప్పగలిగాను. ఇది నేను సాధించిన విజయం కాదా!?’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో సీఎంను కలవాలంటే అదొక గొప్ప సన్నివేశమని.. కానీ తమ ప్రభుత్వంలో ధర్మ గంట మాదిరిగా తాము ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని చెప్పారు. ‘అంబేడ్కర్ చెప్పినట్టు అద్దాల మేడలు, రంగుల గోడలు అభివృద్ధి కాదు. సంక్షేమం, అభివృద్ధి చిట్టచివరి పేదవాడికి కూడా చేరినప్పుడే నిజమైన విజయం. కానీ, చాలామంది మాత్రం అద్దాల మేడలు, రంగుల గోడలూ చూపించి.. ఇదే తెలంగాణ అభివృద్ధి, నమూనా అంటున్నారు. దానికి నేను, అందెశ్రీ వ్యతిరేకం. అందుకే రాష్ట్రంలోని ప్రతి పేదవాడూ తలెత్తుకుని ఆత్మ గౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. 3.10 కోట్లమంది ఆత్మ గౌరవంతో సన్న బియ్యంతో తింటున్నారు. రాష్ట్రంలో పేదలు ఆత్మ గౌరవంతో బతికేలా మా ప్రభుత్వం చేస్తోంది’ అని రేవంత్ పేర్కొన్నారు.
రేవంత్.. అన్నీ తానై రాష్ట్రాన్ని నడుపుతున్నారు: అందెశ్రీ
సీఎం రేవంత్ రాష్ట్ర ప్రజల కలల సాకార దీప్తిగా, అన్నీ తానై రాష్ట్రాన్ని నడుపుతున్నారని, ఆయన తనపై ‘అన్న’ వాత్సల్యాన్ని అపారంగా కురిపిస్తున్నారని అందెశ్రీ వ్యాఖ్యానించారు. ‘హసిత బాష్పాలు’ పుస్తకాన్ని సీఎం రేవంత్ చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్‌ను గద్దె దించి ప్రపంచ విజేత అయ్యాడని రేవంత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
గిరిజన, అణగారిన వర్గాల గొంతుక శిబూసోరేన్
ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి
ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూసోరేన్ గిరిజన, అణగారిన వర్గాల పక్షాన బలమైన స్వరం వినిపించారని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. గిరిజన సమాజ ప్రయోజనాల కోసం శిబూసోరెన్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఝార్ఖండ్‌లోని శిబూసోరెన్ సొంతగ్రామం రామ్‌గఢ్ జిల్లాలోని నమ్రాలో సంప్రదాయ గిరిజన ఆచారాలతో శనివారం నిర్వహించిన దిషోం గురు శ్రద్ధాంజలి కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర ్భంగా శిబూసోరేన్ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం శిబూసోరెన్ కుమారుడు, ఝార్ఖండ్ ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో పాటు, ఆయన కుటుంబ సభ్యులను కలిసి సానుభూతిని తెలియజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తృటిలో తప్పిన ప్రమాదం.. విమాన ప్రయాణికులు సురక్షితం
రాహుల్ గాంధీ ఆరోపణలు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
మరిన్ని తెలంగాణ వార్తలు, తెలుగు వార్తలు చదవండి..