CM Revanth Reddy: ఇంజనీర్ల పని.. నేతలు చేయొద్దు
ABN , Publish Date - May 15 , 2025 | 03:13 AM
ఇంజనీర్లు తమ పని తాము చేయాలని, ప్రాజెక్టులు కట్టాలనే విధాన నిర్ణయం మాత్రమే ప్రజాప్రతినిధులు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇంజనీర్లు చేయాల్సిన పనిని.. ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రులు చేయకూడదన్నారు.
అలా చేసిన ఫలితమే కాళేశ్వరం ప్రాజెక్టు
ప్రపంచంలో మూడేళ్లలో కూలింది ఇదొక్కటే
రాజకీయ నాయకులు చెప్పినట్లు చేస్తే.. ఇంజనీర్లు ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుంది
ఉద్యోగ నియామకాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం
గ్రూప్-1పై రాజకీయ ప్రేరేపిత పిటిషన్
త్వరలో గ్రూప్-1, 2, 3 నియామకాలు: సీఎం
ఏఈ, జేటీవోలకు నియామక పత్రాలు
హైదరాబాద్, మే 14 (ఆంధ్రజ్యోతి): ఇంజనీర్లు తమ పని తాము చేయాలని, ప్రాజెక్టులు కట్టాలనే విధాన నిర్ణయం మాత్రమే ప్రజాప్రతినిధులు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇంజనీర్లు చేయాల్సిన పనిని.. ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రులు చేయకూడదన్నారు. అలా చేయడం వల్ల వచ్చిన ఫలితమే కాళేశ్వరం ప్రాజెక్టు అని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.వేల కోట్లు పెట్టిన ప్రాజెక్టులకు కనీసం భూభౌతిక పరీక్షలు కూడా చేయలేదని, పెద్దసారు హెలికాప్టర్‌లో పోతూ.. కిందికి చూసి, ఇక్కడొకటి, అక్కడొకటి కట్టమని చెబితే పేపర్‌లో రాసుకొని కాంట్రాక్టర్‌కు ఇచ్చి కట్టించారని ఆరోపించారు. బుధవారం.. కొత్తగా ఎంపికైన 224 మంది అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ)లు, 199 మంది జూనియర్ టెక్నికల్ అధికారుల (జేటీవోల)కు జలసౌధలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘శ్రీశైలం, శ్రీరాంసాగర్‌లు సాంకేతిక పరిజ్ఞానం లేనప్పుడే కట్టారు. ఎన్ని ఉపధ్రవాలు, వరదలు వచ్చినా ఆ ప్రాజెక్టులు నిటారుగా నిలబడ్డాయి. 22 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చిన సాగర్‌కుగానీ, 2009లో సామర్థ్యానికి మించి వరదలు వచ్చినా శ్రీశైలం ప్రాజెక్టుకుగానీ ఏమీ కాలేదు. చెక్కు చెదరకుండా నిలబడ్డాయి. సాగర్, శ్రీశైలం, శ్రీరాంసాగర్‌ల నిర్మాణానికి రూ.10 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. కానీ, కాళేశ్వరంపై సీఎంగా బాధ్యతలు చేపట్టేనాటికి రూ.1.02 లక్షల కోట్లు బిల్లులు చెల్లించగా.. మరో రూ.10 వేల కోట్ల బిల్లులు బకాయి ఉన్నాయి. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసినా.. 50 వేల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు. రూ.1.02 లక్షల కోట్లతో నిర్మించి.. మూడేళ్లలోపే కుప్పకూలిన ప్రాజెక్టు భూప్రపంచంలోనే లేదు’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇంజనీర్లు సాగర్, శ్రీశైలం, ఉస్మాన్‌సాగర్‌లను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఎలా కట్టకూడదో అనేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు ఉదాహరణ అని పేర్కొన్నారు.

భావోద్వేగంతో నడిపించారు..
నీళ్లు, నిధులు, నియామకాలను భావోద్వేగంగా మార్చి.. రాజకీయం చేసి, రెండుసార్లు ప్రభుత్వాన్ని నడిపించారని బీఆర్‌ఎ్‌సనుద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పదేళ్లలో కేవలం సాగునీటి ప్రాజెక్టులపై రూ.2 లక్షల కోట్లు ఖర్చుపెట్టారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో వాయిదా పడుతూ, నిర్లక్ష్యానికి గురైన సాగునీటి ప్రాజెక్టులు ఒక్కటి కూడా పూర్తి కాలేదంటే.. దీనికి కారణాలేంటో శాఖలో చేరే ఇంజనీర్లు ఆలోచన చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన పదేళ్లలో ఏ ప్రాజెక్టూ పూర్తికాలేదని, కానీ.. రూ.2 లక్షల కోట్లు ఖర్చయ్యాయని విమర్శించారు. నిధులు వరదలా పారాయని, అవి ఎవరి జేబుల్లోకి వెళ్లాయో ఆలోచన చేయాలని సూచించారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికే ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి నీటిపారుదల శాఖను కేటాయించామని, అందుకే ఈ శాఖలో నియామకాల వి షయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని తెలిపారు.
30 ఏళ్లు పనిచేస్తేనే ఈఎన్‌సీ..
‘‘కాలం కలిసివస్తే రెండు మూడేళ్లలో ఎమ్మెల్యే కావొచ్చు. కానీ, ఇంజనీర్ ఇన్ చీఫ్(ఈఎన్‌సీ) కావాలంటే మాత్రం 30 ఏళ్లు సర్వీసు చేయాల్సిందే. కాలిగోటితో వచ్చిన అవకాశంతో గాలి మోటార్‌లలో తిరుగుతూ.. ఇక్కడ బ్రిడ్జిలు, బ్యారేజీలు కట్టాలని చెబితే ఎలా జరుగుతుందో చెప్పేందుకు కళ్లముందు కాళేశ్వరం ఉంది. అందుకే ఎవరైనా అధికారులు, రాజకీయ నాయకులు పరిమిత జ్ఞానంతో చెప్పిన పని చేస్తే... తరువాత ఊచలు లెక్కబెట్టాల్సింది మీరే. ఏది పడితే అది కళ్లు మూసుకొని చేస్తే ఇబ్బందులు తప్పవు. మీరు కట్టే ప్రాజెక్టులు భవిష్యత్తు తరాలకు మేలు చేయాలి. సరైన అంచనాలు వేసుకొని, ఎవరిపని వారే చేయాలి. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు ఉంటుందో, ఏది పోతుందో తెలియడం లేదు. ఏ ప్రాజెక్టును చూసినా గాలిలో పేకమేడల్లాగా కూలుతున్నాయి. ప్రతి ప్రాజెక్టును సమగ్రంగా అధ్యయనం చేస్తున్నాం. 75ు పూర్తయిన ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నిధులు వెచ్చించడానికి ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, సమ్మక్క, దేవాదులను ప్రాధాన్య జాబితాలో పెట్టి, పూర్తిచేయాలని నిర్ణయం తీసుకున్నాం’’ అని రేవంత్ వివరించారు.
గ్రూప్-1పై రాజకీయ ప్రేరేపిత పిటిషన్..
ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూశారని, తాము అధికారంలోకి వచ్చి నోటిఫికేషన్ ఇస్తే.. అది వద్దంటూ ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందని సీఎం అన్నారు. ‘‘14 నెలల్లో 60 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టాం, ప్రైవేట్‌లో లక్ష ఉద్యోగాలు ఇచ్చాం. గ్రూప్-1 నియామక ప్రక్రియను కొందరు రాజకీయ ప్రేరేపిత పిటిషన్లు వేసి అడ్డుకున్నారు. లేకుంటే ఈ రోజు 563 మందికి ఉద్యోగాలు వచ్చేవి. అర్హత లేనివారు పిటిషన్లు వేశారు. దీని వెనక రాజకీయ నాయకులు, పార్టీలు ఉన్నాయి. త్వరలోనే గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 నియామకాలు పూర్తి చేస్తాం’’ అని సీఎం చెప్పారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రాజెక్టుల విషయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాధించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ముందుకెళుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
అనుమతుల ప్రక్రియను సులభతరం చేయండి
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని వివిధ రకాల నిర్మాణాలు, ఇతర సదుపాయాల కల్పనకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ సులభతరంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక అందించాలని ఆదేశించారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని పౌరసేవలు, అనుమతులపై సచివాలయంలో బుధవారం సీఎం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఔటర్ రింగురోడ్డు (ఓఆర్‌ఆర్) లోపల జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్‌లో వివిధ రకాల నిర్మాణాలకు ప్రజలు పలు విభాగాలకు దరఖాస్తు చేసుకుని ఆయా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. అవసరమైన సేవలన్నీ ఒకేచోట లభించేలా సింగింల్‌విండో విధానం ఉండాలని సూచించారు. ఇందుకోసం రెవె న్యూ, పురపాలక, జలవనరులు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల, పోలీసు, అగ్నిమాపక, విద్యుత్తు విభాగాలు సంయుక్తంగా పని చేయాలన్నారు. ఆయా శాఖలు వసూలు చేసే బిల్లులు సైతం సింగిల్ విండో విధానంలో ఒకే చోట చెల్లించే విధానం ఉండాలన్నారు. ఈ నేపథ్యంలో ఆస్తులు, వనరుల గుర్తింపునకు లైడార్ సర్వే చేయాలని, సులభతర విధానాల అధ్యయనానికి నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచించారు. మెరుగైన పౌర సేవలను అందించేందుకు శాఖల విభజనలో ఏకరూపత ఉండాలన్నారు. ఏ కారణం లేకుండా అనుమతులను నిరాకరించడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఏ కారణంతోనైనా అనుమతులు ఆలస్యమైతే ఆ విషయం దరఖాస్తుదారులకు తెలియజేయాలని, వాటి పరిష్కారానికి ఏం చర్యలు తీసుకోవాలో కూడా అధికారులే సూచించాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..
Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..
TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..
Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
Read Latest Telangana News And Telugu News