Share News

CM Revanth Reddy: ఈసీతో బీజేపీ పొత్తు!

ABN , Publish Date - Aug 31 , 2025 | 04:08 AM

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తమ రాజకీయ పొత్తులో ఎన్నికల కమిషన్‌ను సైతం భాగం చేసుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

CM Revanth Reddy: ఈసీతో బీజేపీ పొత్తు!

  • అనుబంధ విభాగాలుగా ఈడీ, సీబీఐ, ఐటీ

  • ‘వన్‌ పర్సన్‌.. వన్‌ పార్టీ’ కోసమే ‘వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌’.. శాశ్వతంగా అధికారం కోసమే..

  • ప్రజాస్వామ్యాన్ని ఐక్యంగా పరిరక్షించుకోవాలి

  • రాహుల్‌గాంధీ పోరాటానికి మద్దతుగా నిలవాలి

  • సురవరం సంస్మరణ సభలో సీఎం రేవంత్‌

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తమ రాజకీయ పొత్తులో ఎన్నికల కమిషన్‌ను సైతం భాగం చేసుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. 75 ఏళ్లు నిండిన ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ప్రాథమిక హక్కు అయిన ఓటును తొలగిస్తున్న దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌’ అన్నది పూర్తిగా ‘వన్‌ పర్సన్‌.. వన్‌ పార్టీ’ ప్రయోజనాల కోసమేనని విమర్శించారు. సిద్ధాంతం ముసుగులో అధికారాన్ని శాశ్వతంగా పదిలపరుచుకోడానికి చేస్తున్న ప్రయత్నమన్నారు. ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు సాధారణంగా కలిసొచ్చే మిత్రులతో కూడి ప్రజల దగ్గరకు వెళతారని అన్నారు. అనుబంధ విద్యార్థి, యువజన సంఘాలను కూడా ముందు ఉంచుతారని తెలిపారు. కానీ, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు మాత్రం ఎన్నికలప్పుడు తొలుత తమ అనుబంధ విభాగాలైన ఈడీ, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌, సీబీఐలను ప్రయోగిస్తారని ఆరోపించారు. నచ్చని వ్యక్తులను అన్నివిధాలా అష్టదిగ్బంధనం చేసి మరీ వేధిస్తారని మండిపడ్డారు. ఆపై వ్యతిరేకుల ఓట్లు తొలగించడానికి ఎన్నికల కమిషన్‌నూ పంపిస్తారని అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని, రాజ్యాంగాన్ని మార్చాలనుకొనే శక్తుల నుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. శనివారం రవీంద్రభారతిలో జరిగిన సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణ సభకు సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాహుల్‌గాంధీ చేపట్టిన ‘ఓట్‌ చోర్‌.. గద్దీ చోఢ్‌’ పోరాటానికి కాంగ్రెస్‌, కమ్యూనిస్టులే కాకుండా.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనుకునే వారంతా మద్దతుగా నిలవాలని కోరారు. ఇలాంటి విపత్కర సమయంలో సురవరం సుధాకర్‌రెడ్డి లాంటి నేతలు జాతీయ స్థాయిలో ఉండి ఉంటే తప్పనిసరిగా ఇండియా కూటమి మరింత బలపడేదన్నారు.


నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించిన సురవరం

విద్యార్థి రాజకీయాల నుంచి జాతీయ స్థాయి వరకు సురవరం సుధాకర్‌రెడ్డి ఎంత ఎత్తుకు ఎదిగినా తుదివరకు నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించిన పాలమూరు బిడ్డ అని సీఎం రేవంత్‌ కొనియాడారు. సమాజంలో చాలామంది గొప్పగా సిద్ధాంతాలు చెబుతారని, కానీ.. వాటిని ఆచరించే వ్యక్తుల్లో సుధాకర్‌రెడ్డి లాంటి వారు చాలా అరుదుగా ఉంటారని అన్నారు. అంతకుముందు సురవరం సుధాకర్‌రెడ్డి జీవన సహచరి విజయలక్ష్మి మాట్లాడుతూ.. తమ స్వగ్రామం కంచుపాడులో ప్రాథమికోన్నత పాఠశాలను హైస్కూల్‌గా ఉన్నతీకరించడంతోపాటు రోడ్డు, బస్సు సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రిని కోరారు. యువతకు జీవన నైపుణ్యాల శిక్షణ కేంద్రం ఏర్పాటుకు 4.5 ఎకరాల భూమిని విరాళంగా ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇందుకు సీఎం స్పందిస్తూ.. సుధాకర్‌రెడ్డి నమ్మిన సిద్ధాంతం ప్రజలకు అర్థమయ్యేలా ఈ నేల చరిత్రలో ఎప్పటికి గుర్తుండేలా తగిన నిర్ణయం తీసుకొని త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. ‘‘కమ్యూనిజం అంటే లైబ్రరీలో చదివే పుస్తకం కాదు. పేద ప్రజల గుండెల్లో కొలువుదీరే ప్రగాఢమైన విశ్వాసం. ఎర్రజెండా ఇచ్చినంతగా మిగతా జెండాలు ప్రజలకు ఆ నమ్మకాన్ని ఇవ్వలేవు. అందుకే కమ్యూనిస్టులు మాకు సహజమిత్రులు’’ అని రేవంత్‌ వ్యాఖ్యానించారు.


కమ్యూనిస్టు ఐక్య ఉద్యమాలు బలపడాలి

దేశంలో కమ్యూనిస్టు ఐక్య ఉద్యమాలు బలపడాలని సుప్రీంకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ ఆకాంక్షించారు. సురవరం సుధాకర్‌రెడ్డిది ఆదర్శప్రాయమైన జీవితమని కొనియాడారు. కాగా, ఏపీలోని కర్నూలులో సురవరం స్మారకాన్ని ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారని ఆ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. సురవరం సుధాకర్‌రెడ్డిని గొప్ప పోరాట యోధుడిగా హరియాణా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కొనియాడారు. కాగా, సురవరంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా భావోద్వేగానికి లోనయ్యారు. సురవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణ సభకు బీజేపీ, బీఆర్‌ఎ్‌సతోపాటు అన్ని వామపక్ష పార్టీల ప్రతినిధులు, సామాజికవేత్తలు, మేధావులు, కవులు, రచయితలు హాజరయ్యారు. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, ఆ పార్టీ నేత తమ్మినేని వీరభద్రం, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌, పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, ప్రొఫెసర్‌ కోదండరాంతోపాటు పెద్దసంఖ్యలో ప్రముఖులు హాజరై సురవరం సుధాకర్‌రెడ్డికి నివాళులర్పించారు.


ఇవి కూడా చదవండి:

కాళేశ్వరం పీపీటీ ప్రజెంటేషన్‌‌పై మాటల యుద్ధం..

15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి.. కేటీఆర్ డిమాండ్

మరిన్ని తెలంగాణ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 31 , 2025 | 04:08 AM