ఇష్టం లేకున్నా ఆడుతున్నా!
ABN , Publish Date - Feb 15 , 2025 | 03:38 AM
రాజకీయాలు టీ ట్వంటీ మ్యాచుల్లా తయారయ్యాయని, ఇష్టం లేకున్నా టీ ట్వంటీ ఆడాల్సి వస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే పిల్లలు వినకూడదని తల్లిదండ్రులు ఛానల్ మార్చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

రాజకీయాలు టీ ట్వంటీ అయ్యాయి.. నేతల భాష పిల్లలు వినకూడదని తల్దిదండ్రులు చానల్ మార్చేస్తున్నారు
నిలవాలి గెలవాలి.. ఆడకపోతే ఓడినట్లే
దేవేందర్‌గౌడ్ పుస్తకావిష్కరణలో రేవంత్
పార్టీల మెడలు వంచిన ఉద్యమం:కిషన్‌రెడ్డి
పాఠ్యాంశంగా ఉద్యమ ఘట్టాలు: లక్ష్మణ్
హైదరాబాద్, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): రాజకీయాలు టీ ట్వంటీ మ్యాచుల్లా తయారయ్యాయని, ఇష్టం లేకున్నా టీ ట్వంటీ ఆడాల్సి వస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే పిల్లలు వినకూడదని తల్లిదండ్రులు ఛానల్ మార్చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మాజీ ఎంపీ దేవేందర్ గౌడ్ రచించిన ‘విజయ తెలంగాణ’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మాట్లాడారు. దేవేందర్ గౌడ్, దివంగత జైపాల్‌రెడ్డి లాంటి నేతల కాలంలో రాజకీయాలు టెస్టు మ్యాచుల్లా ఉండేవని ముఖ్యమంత్రి అన్నారు. తర్వాత వన్డే మ్యాచ్‌ల్లా మారిపోయాయని, ప్రస్తుతం టీ ట్వంటీ ఆడాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. ‘‘ఆడకపోతే ఓడిపోయినట్లే. పోటీలో ఉండాలి గెలవాలి కాబట్టి ఇష్టం లేకపోయినా టీ ట్వంటీ ఆడాల్సి వస్తోంది’’ అన్నారు. గౌరవప్రదమైన రాజకీయాలు దేవేందర్ గౌడ్ లాంటి వారితోనే మాయమయ్యాయని చెప్పారు. శాసనసభలో ఎవరైనా అబద్దం మాట్లాడినా దేవేందర్ గౌడ్ అదేమిటీ ఇలా మాట్లాడుతున్నారని ప్రశ్నించే వారని, సభకు ఆయన గౌరవం ఇచ్చేవారని గుర్తు చేసుకున్నారు.
దేవేందర్ గౌడ్ విలువలున్న రాజకీయ నాయకుడని, గంటల కొద్దీ అసెంబ్లీ లైబ్రరీలో కూర్చుని, సమాచారాన్ని సేకరించి, సభలో హుందాగా, చతురతతో నొప్పించకుండా మాట్లాడేవారని ప్రస్తావించారు. ‘‘మరి నీ సంగతేమిటన్న? అని మీరు అడగవచ్చు కానీ, ఆటే అలా ఉన్నపుడు తప్పదు’’ అన్నారు. ఈ పుస్తకం మరుగున పడిన తెలంగాణ పోరాట చరిత్రను బహిర్గతం చేసిందని సీఎం వ్యాఖ్యానించారు. ఇలాంటి పుస్తకాలు మరిన్ని రావాలన్నారు. నాటి ప్రభుత్వంలో నాయకుడికి సమానంగా వ్యవహరిస్తూ దేవేందర్‌గౌడ్ తెలంగాణ కోసం సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని రేవంత్‌రెడ్డి కొనియాడారు. ఈ క్రమంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. అయితే ఈ క్రమంలో ఆయన ఎక్కడా వెనక్కి తగ్గకుండా నమ్మిన లక్ష్యం కోసం పోరాటం చేశారన్నారు. గోదావరి జలాలతో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని భావించి దేవేందర్ గౌడ్ పాదయాత్ర చేపట్టిన తర్వాతే ప్రాణహిత చేవెళ్ల పథకం రూపుదిద్దుకుందని ప్రస్తావించారు. టీజీ అనే పదాన్ని తెలంగాణ గుండె చప్పుడుగా దేవేందర్ గౌడ్ తెర మీదకు తీసుకుని వచ్చారని, దాన్ని గత ప్రభుత్వం టీఎ్‌సగా మార్చిందని గుర్తు చేశారు. ప్రజల గుండె చప్పుడు గుర్తించి మళ్లీ టీజీగా మార్చామన్నారు. తెలంగాణ యువత బలిదానాలను పక్కన పెట్టి ఇదంతా ఒక కుటుంబం ఘనతగా చెప్పుకుంటూ, తెలంగాణ చరిత్రను వక్రీకరించారని సీఎం అన్నారు. తెలంగాణ కోసం పోరాడి సర్వం కోల్పోయిన కుటుంబాలు వేలు ఉన్నాయని చెప్పారు. గద్దరన్న లాంటి వాళ్ల ఇంటికి వెళ్లినపుడు వారి అర్ధిక పరిస్థితి చూసి చలించి పోయానని, అందుకే 9 మందికి కోటి నగదు, ఇంటి స్ధలం ఇచ్చి గౌరవించుకున్నామని వివరించారు.
ఉద్యమానికి దేవేందర్ దన్ను
పార్టీల మెడలు వంచిన ఉద్యమం తెలంగాణ ఉద్యమమని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. రాజకీయాలకు, సిద్ధాంతాలకు అతీతంగా దేవేందర్‌గౌడ్ తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారని ప్రశంసించారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల పాత్రను తెరపైకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. గోదావరి జలాల సద్వినియోగంతోనే తెలంగాణ సస్యశ్యామలమవుతుందని హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి చరిత్ర ఘట్టాలను పాఠ్యాంశంగా చేర్చాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ బిల్లును అడ్వాణీ వ్యతిరేకించినా సుషా స్వరాజ్ మద్దతు ఇచ్చారని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. అన్ని వర్గాలు కొట్లాడితేనే తెలంగాణ వచ్చిందన్నారు. తెలంగాణ చరిత్రకు సంబంధించి హైదరాబాదులో ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేయాలని దేవేందర్‌గౌడ్, సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుపతి జిల్లా: నారావారిపల్లెలో విషాదం
ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా..: హరీష్‌రావు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News