Share News

CM Revanth Reddy: తీసుకున్నది ఎంత.. ఇచ్చింది ఎంత ?

ABN , Publish Date - Mar 11 , 2025 | 03:50 AM

‘‘తెలంగాణ రాష్ట్రం 2014 జూన్‌ 2 నుంచి ఇప్పటివరకు కేంద్రానికి చెల్లించిన పన్నులు ఎన్ని? అందులో కేంద్రం తిరిగి తెలంగాణకు ఇచ్చింది ఎంత? ఏ రూపంలో ఇచ్చిన నిధులైనా.. లెక్కల ప్రాతిపదికన మాట్లాడుకుందాం. అన్నింటిపైనా చిత్తశుద్ధితో చర్చ చేద్దాం’’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సవాల్‌ విసిరారు.

CM Revanth Reddy: తీసుకున్నది ఎంత.. ఇచ్చింది ఎంత ?

పదేళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధం

  • కేంద్రానికి చెల్లించిన పన్నుల కంటే ఎక్కువ నిధులిస్తే

  • కిషన్‌రెడ్డికి సన్మానం చేస్తా.. గండపెండేరం తొడుగుతా

  • కులగణన సర్వే వల్లే బడుగు నేతలకు ఎమ్మెల్సీ సీట్లు

  • పట్టభద్రుల ఓట్లను బీజేపీకి మళ్లించిన బీఆర్‌ఎస్‌

  • రాష్ట్ర ప్రయోజనాల కోసం 99 సార్లయినా ఢిల్లీకి వెళతా

  • జీతభత్యాలు తీసుకుంటూ పనిచేయనిది కేసీఆర్‌ ఒక్కరే

  • స్టేచర్‌ అంటే రోజూ మందు తాగితేనే వస్తుందా?

  • రైతు బాధపడుతుంటే పైశాచికానందం పొందుతారా?

  • గత నోటిఫికేషన్లకు వర్గీకరణ రిజర్వేషన్‌ వర్తించదు

  • మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

హైదరాబాద్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణ రాష్ట్రం 2014 జూన్‌ 2 నుంచి ఇప్పటివరకు కేంద్రానికి చెల్లించిన పన్నులు ఎన్ని? అందులో కేంద్రం తిరిగి తెలంగాణకు ఇచ్చింది ఎంత? ఏ రూపంలో ఇచ్చిన నిధులైనా.. లెక్కల ప్రాతిపదికన మాట్లాడుకుందాం. అన్నింటిపైనా చిత్తశుద్ధితో చర్చ చేద్దాం’’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. చర్చకు తాను, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కలిసి వస్తామని, తెలంగాణ చెల్లించిన పన్నుల కంటే కేంద్ర ప్రభుత్వం అదనంగా నిధులు ఇస్తే అక్కడికక్కడే కిషన్‌రెడ్డికి సన్మానం చేస్తామని అన్నారు. తెలంగాణకు కేంద్రం రూ.10 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందంటూ కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం ఈ మేరకు స్పందించారు. సోమవారం సీఎల్పీ కార్యాలయంలోని ముఖ్యమంత్రి చాంబర్‌లో రేవంత్‌ మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. రాష్ట్రాలు చెల్లించిన పన్నుల్లో 42 శాతం నిధులను తిరిగి రాష్ట్రాలకు ఇస్తున్నట్లు చెబుతున్నారని, కానీ.. తిరిగి ఇస్తున్నది కేవలం 30 శాతమేనని చెప్పారు. విద్యా సెస్సు 4 నుంచి 5 శాతం వసూలు చేస్తున్న కేంద్రం.. అందులో నుంచి ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి ఇవ్వడంలేదని తెలిపారు. వాస్తవాలు ప్రజలకు తెలియాల్సి ఉందని, దీనిపై చర్చించేందుకు కిషన్‌రెడ్డి రావాలని అన్నారు.

2.jpg


ధర్నా చేయాల్సింది మోదీ ఇంటిముందు కదా!

రీజినల్‌ రింగ్‌ రోడ్డును తామే ఇచ్చామంటూ ప్రధాని మోదీ పరేడ్‌ గ్రౌండ్‌లో ప్రకటించారని, అలాంటప్పుడు ఈ ప్రాజెక్టుకు భూ సేకరణ జరగొద్దంటూ బీజేపీ ఎంపీలు ఈటల, కె.లక్ష్మణ్‌ ధర్నా చేయాల్సింది ప్రధాని ఇంటి ముందు కదా! అని సీఎం రేవంత్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు అన్నప్పుడు పద్ధతిగా భూ సేకరణ జరిపించాల్సిన బాధ్యత కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, లక్ష్మణ్‌పై ఉందన్నారు. హైదరాబాద్‌లో జైపాల్‌రెడ్డి తెచ్చిన మెట్రో కనిపిస్తుందే తప్ప.. కిషన్‌రెడ్డి తెచ్చిన మెట్రో కనిపించడంలేదని ఎద్దేవా చేశారు. మెట్రో, మూసీ ప్రక్షాళన, రీజినల్‌ రింగ్‌రోడ్డు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి మెజారిటీ నిధులు తెస్తే కిషన్‌రెడ్డికి నెక్లెస్‌ రోడ్డులో సన్మానం చేసి.. చేతికి గండపెండేరం తొడుగుతానన్నారు. భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిది అయినప్పుడు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులపై భట్టివిక్రమార్క నేతృత్వంలో జరిగిన సమావేశంలో చర్చించేందుకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ హైదరాబాద్‌కు వచ్చి సమీక్ష నిర్వహించినప్పుడు సికింద్రాబాద్‌లోనే ఉన్న కిషన్‌రెడ్డి.. ఆ సమావేశానికి వెళితే కేసీఆర్‌ బాధపడతారని హాజరు కాలేదా?అని నిలదీశారు. రాష్ట్ర అభివృద్ధిపై కిషన్‌రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి ఇదీ అని ఎద్దేవా చేశారు.

కులగణన వల్లే బడుగులకు ఎమ్మెల్సీలు..

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, సీపీఐ పార్టీలు ఐదు ఎమ్మెల్సీ సీట్లను బీసీ, ఎస్టీ, ఎస్టీలకే కేటాయించడం సమాజంలో వచ్చిన విప్లవాత్మక మార్పునకు నిదర్శనమని సీఎం రేవంత్‌ అన్నారు. కులగణన సర్వేలో తాము కులాలవారీ లెక్కలు తీసినందునే ఆయా వర్గాలకు న్యాయం చేయాల్సిన పరిస్థితి అందరికీ వచ్చిందన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పార్టీ నిర్ణయమే తప్ప.. ప్రభుత్వ నిర్ణయం కాదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హరీశ్‌రావు బీజేపీకి లొంగిపోయి.. బీఆర్‌ఎస్‌ ఓట్లను ఆ పార్టీకి మళ్లించారని రేవంత్‌ ఆరోపించారు. ఆయన దొంగ దెబ్బ తీయడం వల్లే తమ అభ్యర్థి ఓటమిపాలయ్యారని తెలిపారు. కానీ, మోసం తాత్కాలిక విజయాన్నే అందిస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నాయకులందరూ సమన్వయంతోనే పని చేశారని తెలిపారు. ఇక రాష్ట్ర ప్రయోజనాల కోసం 99 సార్లయినా ఢిల్లీకి వెళతానన్నారు. గడిచిన 30 ఏళ్లలో సాధించుకురాలేని పనులను తాము ఈ 15 నెలల్లోనే సాధించుకొచ్చామన్నారు. కంటోన్మెంట్‌, రీజినల్‌ రింగ్‌రోడ్డు, రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ వంటివి తెచ్చామన్నారు. ప్రధాని మోదీ తనకు సూచించినవన్నీ పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న అంశాలేనని, వాటిని కచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పారు.


నేను సీఎంను.. కేసీఆర్‌ మాజీ సీఎం!

కేసీఆర్‌ స్టేచర్‌ ఏంటి, రేవంత్‌ స్టేచర్‌ ఏంటంటూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై సీఎం స్పందిస్తూ, ‘‘నేను ఈ రాష్ట్రానికి సీఎంను. కేసీఆర్‌ మాజీ సీఎం. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనొక పార్టీకి, నేనొక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నాం. ఆ ఎన్నికల్లో కేసీఆర్‌ను అధికారం నుంచి దించాను. లోక్‌సభ ఎన్నికల్లో గుండు సున్న చేశాను. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చేసరికి అభ్యర్థిని కూడా పెట్టలేకపోయారు. కేసీఆర్‌, కేటీఆర్‌కు బలుపు తప్ప ఏముంది? రోజూ ఇంత మందు తాగితే.. డ్రగ్స్‌ పార్టీల్లో పాల్గొంటే స్టేచర్‌ వస్తదా?’’అని ఫైర్‌ అయ్యారు. అడ్డగోలుగా మాట్లాడటంలో కేసీఆర్‌ను మించినోడు దేశంలోనే లేడన్నారు. ఇప్పటిదాకా అసెంబ్లీలో తాను అన్‌పార్లమెంటరీ వ్యాఖ్యలు చేసినట్లుగా రికార్డుల్లోనే లేదని తెలిపారు. ప్రతిపక్షం లేని రాజకీయం చేయాలని తాము కోరుకోవడంలేదని స్పష్టం చేశారు. ప్రజల నుంచి జీతభత్యాలు తీసుకుంటూ పనిచేయనివారు దేశంలో కేసీఆర్‌ ఒక్కరేనని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం అప్పులు రూ.3.75 లక్షల కోట్లేనని అబద్ధాలు చెప్పారని, తాము అధికారంలోకి వచ్చాక లెక్కలు చూస్తే రూ.7.11 లక్షల కోట్ల మేరకు అప్పులు ఉన్నాయని తెలిపారు. పదేళ్లలో అప్పులు, తప్పులు తప్ప కేసీఆర్‌, కేటీఆర్‌ చేసిందేమీ లేదని, వాటిని సరిదిద్దే ప్రయత్నం తాము చేస్తున్నామని చెప్పారు.


కేంద్రం స్పందన చూశాక నిర్ణయం

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీ తీర్మానంపై కేంద్ర ప్రభుత్వం స్పందన చూశాక ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని రేవంత్‌ చెప్పారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్న ప్రశ్నకు ఈ మేరకు స్పందించారు. కాగా, ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వకముందు విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్లకు.. ఆయా నోటిఫికేషన్లలో పేర్కొన్న రూల్‌ ఆఫ్‌ రిజర్వేషనే వర్తిస్తుందని సీఎం స్పష్టం చేశారు. అప్పటి నోటిఫికేషన్లలో కొత్త రిజర్వేషన్లు అమలు చేయాలంటే కోర్టు కొట్టేస్తుందన్నారు. ఇప్పుడు ఇచ్చే రిజర్వేషన్లు అప్పటి నోటిఫికేషన్లకు వర్తించవన్నారు.


55 లక్షల ఎకరాల్లో యాసంగి సాగు..

తెలంగాణలో ఏటా యాసంగిలో 30-35 లక్షల ఎకరాల మేర సాగవుతుందని, కానీ.. ఈ ఏడాది రైతులు 55 లక్షల ఎకరాలు సాగు చేశారని సీఎం రేవంత్‌ తెలిపారు. ప్రాజెక్టుల్లో ఉన్న నీళ్లను సర్దుబాటు చేసి.. ఏ ప్రాజెక్టు కింద ఏ మేరకు నీళ్లు యాసంగికి ఇస్తామన్న దానిపై సాగునీటి శాఖ ముందే షెడ్యూల్‌ విడుదల చేసిందని, కానీ అందుబాటులో ఉన్న నీటి కంటే ఎక్కువ పంటను రైతులు వేశారని పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో పంటలకు నీళ్లు అందకపోవడంపై ఈ మేరకు స్పందించారు. రాష్ట్రంలో రైతులు బాధపడుతుంటే, శవాలు లేస్తుంటే కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు తీన్మార్‌ డాన్సులు వేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ వస్తే కరువు వస్తదంటూ ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని, కరువొస్తే రికార్డు స్థాయిలో 1.56కోట్ల టన్నుల ధాన్యం ఎలా పండిందని ప్రశ్నించారు. గతంలో నాటి ఏపీ సీఎం జగన్‌రెడ్డిని ప్రగతి భవన్‌కు పిలిచి పంచభక్ష పరమాన్నాలు పెట్టి.. రాయలసీమ లిఫ్టుకు తెరలేపింది కేసీఆర్‌ కాదా? అని రేవంత్‌ ప్రశ్నించారు. పదేళ్లలో కృష్ణా ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే ఆంధ్రావాళ్లతో ఇప్పుడు మనకు ఈ తలనొప్పే ఉండేది కాదన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Mar 11 , 2025 | 03:50 AM