CM Revanth Reddy KCR: ఎర్రవల్లే చర్లపల్లి!
ABN , Publish Date - Aug 08 , 2025 | 03:36 AM
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కొత్తగా జైల్లో పెట్టాల్సిన పని లేదని, ఆయనకు ఎర్రవల్లి ఫాంహౌసే చర్లపల్లి జైలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన తనను తాను జైల్లో పెట్టుకున్నారని చెప్పారు.
కేసీఆర్ ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు
ఫాంహౌ్‌సలో తనను బంధించుకున్నారు
ఎన్నికల్లో ఓడించడమే ఆయనకు పెద్ద శిక్ష
కేసీఆర్ ఆరోగ్యం జాగ్రత్తని అధికార్లకు చెప్పా
ఫిరాయింపు తప్పని సుప్రీం తీర్పిస్తే మేం సేఫ్
65 మంది ఎమ్మెల్యేలు మాతో ఉంటారుగా?
ఎన్నికల ప్రక్రియలో మోసాలు జరిగేది నిజం
కొడంగల్‌లోనే 15 వేల ఓట్లు మాయం
మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్‌రెడ్డి
న్యూఢిల్లీ, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కొత్తగా జైల్లో పెట్టాల్సిన పని లేదని, ఆయనకు ఎర్రవల్లి ఫాంహౌసే చర్లపల్లి జైలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన తనను తాను జైల్లో పెట్టుకున్నారని చెప్పారు. గురువారం ఢిల్లీలోని తన అధికార నివాసంలో రేవంత్ మీడియాతో ఇష్ఠాగోష్ఠిగా మాట్లాడారు. ‘‘కేసీఆర్ ఫాంహౌ్‌సకు, చర్లపల్లి జైలుకు తేడా ఏముంది? అక్కడా పోలీసులు ఉంటారు, ఇక్కడా ఉన్నారు. మధ్య మధ్యలో విజిటర్స్ వచ్చి మాట్లాడి వెళ్తారు. కేసీఆర్‌ను ఓడించడమే పెద్ద శిక్ష. కేసీఆరే కాదు. ఏ రాజకీయ నాయకుడికైనా ఎన్నికల్లో ఓడించడమే అతిపెద్ద శిక్ష. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నాకు తెలియదు. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నారు కాబట్టి ఆయనకు అనారోగ్య సమస్య తలెత్తితే మంచి వైద్యం అందించాలని ఆరోగ్య సెక్రటరీకి చెప్పా. కాకపోతే మా ఆరోగ్యం గురించి ఎవరికీ చెప్పేది లేదని అంటున్నారు. గతంలో జైపాల్ రెడ్డి ఆరోగ్యం విషయంలో అప్పటి ప్రభుత్వం ఇలానే స్పందించింది. వాజ్‌పేయి విషయంలోనూ ఆనాటి ప్రధాని రాజీవ్‌గాంధీ శ్రద్ధ తీసుకున్నారు. నేను విద్వేష రాజకీయాలు చేయను. నాకా అవసరం లేదు. కేసీఆర్ లాగా బిట్టర్ పాలిటిక్స్ నాకు రావు’’ అన్నారు. ఈవీఎంల్లో అవకవతకలు, ఓట్ల గల్లంతు అంశాలపైనా రేవంత్ రెడ్డి స్పందించారు. తాను కొడంగల్‌లో పోటీ చేసినప్పుడూ 15 వేల ఓట్లు మాయం చేశారని ఆరోపించారు. ఓటరు లిస్టులో ఓట్లు ఉన్నాయని, బూత్‌లోకి వెళితే మాయమయ్యాయని చెప్పారు. పోలింగ్ బూత్‌కు వెళితే, మరోచోటికి వెళ్లాలని చెబుతారని, అక్కడికి వెళితే మరో చోటికి వెళ్లమని అంటారని, ఇలా తిప్పడం ద్వారా ఓట్లు వేయకుండా చూస్తారని తెలిపారు. కుటుంబంలో ఐదు ఓట్లు ఉంటే రెండు మాయం చేయడం మరో పద్దతి అన్నారు.
దుప్పటి కప్పుకొని పడుకొన్నా మాదే అధికారం
రాష్ట్ర ప్రజలు తమ పరిపాలన పట్ల ఎంతో సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకొన్నా మళ్లీ తమదే అధికారం అని తేల్చిచెప్పారు. ఏ ఎన్నికలు వచ్చినా సునాయసనంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఒకసారి గెలిచిన తర్వాత అందరి ఇళ్లల్లోకి తొంగి చూడాలని, ప్రతి విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తే మళ్లీ గెలవడం కష్టమేనని బీఆర్‌ఎ్‌సను ఉద్దేశించి అన్నారు. వరుసగా రెండు, మూడు సార్లు గెలిచిన వాళ్లు తమ పని తాము చేసుకుంటూ వెళ్లే రకమని, అందుకే వాళ్లు మళ్లీ మళ్లీ విజయం సాధిస్తున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ నేతలకు నైతికత గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. వాళ్లు నైతికత పేరెత్తితే అది కూడా ఆత్మహత్య చేసుకుంటుందని చెప్పారు. పార్టీ ఫిరాయిస్తే వేటు పడుతుందని సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే తమకే మంచిదని రేవంత్ రెడ్డి తెలిపారు. తమకున్న 65 మంది ఎమ్మెల్యేలు తమతోనే ఉంటారని అన్నారు. బిహార్ ఎన్నికలతోపాటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గువ్వల రాజీనామా.. స్పందించిన బీఆర్ఎస్
తురకా కిషోర్‌ను తక్షణమే విడుదల చేయండి: హైకోర్టు