Share News

Telangana Assembly: బీఆర్‌ఎస్‌ వల్లే ఆగిన బిల్లులు!

ABN , Publish Date - Sep 01 , 2025 | 04:13 AM

రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్‌ బిల్లులు గవర్నర్‌ ఆమోదం పొందకుండా వాటిని రాష్ట్రపతికి పంపడం వెనక బీఆర్‌ఎస్‌ పాత్ర ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

Telangana Assembly: బీఆర్‌ఎస్‌ వల్లే ఆగిన బిల్లులు!

  • బీసీ రిజర్వేషన్‌ బిల్లులను రాష్ట్రపతికి పంపడం వెనక బీఆర్‌ఎస్‌ పాత్ర

  • గత ప్రభుత్వం తెచ్చిన చట్టాలే నేడు గుదిబండలుగా మారాయి

  • వాటిని అధిగమించేందుకు ఆర్డినెన్స్‌ తెస్తే గవర్నర్‌ ఆమోదించకుండా చేశారు

  • కల్వకుంట్ల కుటుంబం కాదు.. ఎవరినీ కలవకుండా చేసే కుటుంబం

  • రిజర్వేషన్లపై ఆ పార్టీకి సంతోషం లేదు.. ఢిల్లీ ధర్నాలో ఎందుకు పాల్గొనలేదు?

  • శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

రిజర్వేషన్లపై.. నేడు గవర్నర్‌ వద్దకు కాంగ్రెస్‌

హైదరాబాద్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్‌ బిల్లులు గవర్నర్‌ ఆమోదం పొందకుండా వాటిని రాష్ట్రపతికి పంపడం వెనక బీఆర్‌ఎస్‌ పాత్ర ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బీసీలకు విద్య, ఉద్యోగ అవకాశాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42ు రిజర్వేషన్లు కల్పించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో రెండు బిల్లులను ఆమోదించి, గవర్నర్‌కు పంపితే.. వాటిని రాష్ట్రపతికి పంపారని తెలిపారు. ఐదు నెలలుగా అవి రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. ప్రస్తుత గవర్నర్‌ ఒకప్పుడు ఆర్థిక మంత్రిగా పనిచేశారని, గతంలో తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఓ వ్యక్తి.. బీసీ బిల్లులను రాష్ట్రపతికి పంపేలా గవర్నర్‌ వద్ద తెరవెనుక లాబీయింగ్‌ చేశారని చెప్పారు. ఆదివారం శాసనసభలో మునిసిపల్‌, పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లులపై సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2018లో తీసుకొచ్చిన పంచాయతీరాజ్‌ చట్టం, 2019లో తెచ్చిన మునిసిపల్‌ చట్టం.. స్థానిక సంస్థల్లో 50 శాతంలోపే రిజర్వేషన్లు ఉండాలని చెబుతున్నాయన్నారు. అవే ఇప్పుడు పెద్ద గుదిబండలుగా మారాయన్నారు. ఆ అడ్డంకులను అధిగమించి, స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిందని, దాన్ని మళ్లీ గవర్నర్‌కు పంపామని తెలిపారు. అయితే ఈ ఆర్డినెన్స్‌ను ఆమోదించే విషయంలో కూడా గవర్నర్‌ బీఆర్‌ఎస్‌ మాటలు నమ్మారని అన్నారు.


బీసీలను బీసీలే అవమానించుకోవద్దు..

స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమయ్యాయంటూ కొందరు కోర్టుకు వెళ్లారని సీఎం రేవంత్‌ తెలిపారు. దీంతో సెప్టెంబరు 30లోగా ఎన్నికలు నిర్వహించాలని, రిజర్వేషన్లు సైతం ఖరారు చేయాలని న్యాయస్థానం ఆదేశించిందన్నారు. ఉన్న చట్టాలను పరిశీలిస్తే 50 శాతం రిజర్వేషన్లకు లోబడి ఎన్నికలు నిర్వహించాలని చెబుతున్నాయని పేర్కొన్నారు. అందుకే తమ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకువచ్చి 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలని గవర్నర్‌కు పంపిందని అన్నారు. ఆర్డినెన్స్‌ ఆమోదం పొందనందున.. శాసనసభలో రిజర్వేషన్ల బిల్లు పెట్టి ఆమోదించుకుందామని పిలుపునిచ్చారు. సభా నాయకుడిగా చిత్తశుద్ధితో దీనిని అమలు చేసే బాధ్యత తనదన్నారు. దీనిని చిలువలు, పలువలు చేయవద్దని, బీసీలను బీసీలే అవమానించుకోవద్దని హితవు పలికారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌, మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ ఒకరినొకరు విమర్శించుకుంటే ఇతరుల ముందు పలుచన అవుతారని వ్యాఖ్యానించారు. మంచి జరిగేటప్పుడు కలిసికట్టుగా ఉండాలని సూచించారు. అలా కాకుండా యజమానులను ఒప్పించడానికి, సంతోషపెట్టడానికి మంత్రులపై పరుషమైన పదజాలం ప్రయోగించవద్దని గంగులకు హితవు పలికారు. సభను వేదికగా మార్చుకొని బలహీన వర్గాలకు అనుమానం కలిగించేలా, తెలంగాణ సమాజంలో అపోహలు సృష్టించేలా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దన్నారు.

వాళ్లకు సంతోషం లేదు..

బీసీలకు 42ు రిజర్వేషన్లు కల్పిస్తుంటే వారికి (బీఆర్‌ఎస్‌ నేతలకు) సంతోషం లేదని సీఎం రేవంత్‌ అన్నారు. వారి కడుపు నిండా దుఃఖం, బాధ, విషం ఉన్నాయని ఆరోపించారు. ఢిల్లీకి అఖిలపక్షాన్ని ఎందుకు తీసుకెళ్లలేదంటూ గంగుల ప్రశ్నిస్తున్నారని, అయితే ప్రధానికి తాను ఐదుసార్లు లేఖ రాసి.. అపాయింట్‌మెంట్‌ అడిగితే ఇవ్వలేదని తెలిపారు. దీంతో ప్రధానిపై, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న సమయంలో జంతర్‌మంతర్‌ వద్ద తాము ఆందోళన చేశామని గుర్తు చేశారు. అందులో వందమంది ఎంపీలు పాల్గొన్నారని, కానీ.. బీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీలు ఎందుకు పాల్గొనలేదని సీఎం ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ అబద్ధాల ప్రాతిపదికన మాూట్లాడుతోందని మండిపడ్డారు. బీఆర్‌ఎ్‌సకు కనువిప్పు కలిగించేందుకే ఫిబ్రవరి 4న సోషల్‌ జస్టిస్‌ డే జరుపుకోవాలని నిర్ణయించామన్నారు. బీఆర్‌ఎస్‌ తప్పులు చేసినందునే ప్రజలు శిక్ష విధించారని, ప్రజాతీర్పు మేరకు ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ప్రజలకిచ్చిన మాట ప్రకారం హామీలను అమలు చేస్తామని, ఇందుకు బీఆర్‌ఎస్‌ సహకరించాలని కోరారు. బుద్ది మారకపోతే ప్రజలు మళ్లీ ఇంకో తీర్పు ఇస్తారని, ఈసారి ప్రతిపక్ష హోదా కూడా ఉండదని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ తమకు సుద్దులు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ముందుగా వారి నాయకుణ్ని (కేసీఆర్‌) వచ్చి సభలో కూర్చోవాలని చెప్పాలన్నారు. బీసీలకు న్యాయం చేయాలని వందేళ్లుగా జరగని కులగణనను కాంగ్రెస్‌ సర్కారు చేసిందని రేవంత్‌ అన్నా రు. దానిని ప్రధానప్రతిపక్ష నేత అభినందిస్తే.. ఆయన పెద్దరికం పెరిగి ఉండేదన్నారు. ఆయన సభకు రారని, ఆయన పంపిన వారేమో అవాస్తవాలు మా ట్లాడుతున్నారని మండిపడ్డారు.


కర్రుకాల్చి వాత పెట్టాను

బీసీ రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్‌ ఒత్తిడికి లొంగవద్దని గంగులకు సీఎం రేవంత్‌ సూచించారు. బీఆర్‌ఎస్‌ పోకడలు ఎలా ఉంటాయో తనకు తెలుసునని, అందుకే వారికి కర్రుకాల్చి వాత పెట్టి సీఎంను అయ్యాయనన్నారు. బీసీ బిల్లుపై రాజకీయ వివాదాలకు తావు లేకుండా, ఆరోపణలు చేయకుండా సూచనలు చేయాలని కోరారు. ‘‘కల్వకుంట్ల కుటుంబం అంటే ఎవరినీ కలవకుండా ఉంచడం. బీసీలు, ఓసీలు కలవద్దని, ఎస్సీలు, ఎస్టీలు కలవద్దని, మైనారిటీలు, హిందువులు కలవద్దనే కుటుంబం’’అని సీఎం వ్యాఖ్యానించారు. బీసీ బిల్లుపై చర్చ లేకుండా సభ అంతా ఏకగ్రీవంగా ఆమోదిస్తే కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి అవకాశముంటుందన్నారు. ప్రధాని అపాయింట్‌మెంట్‌ను బీజేపీ మిత్రుడు పాయల శంకర్‌ ఇప్పించాలని కోరారు. అపాయింట్‌మెంట్‌ ఇప్పిేస్త అంతా కలిసివెళ్లి రాష్ట్రపతి వద్ద పెండింగ్‌ ఉన్న బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించుకుందామన్నారు.

బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం

రాష్ట్రంలోని బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు పంచాయతీరాజ్‌ చట్టం-2018 లోని సెక్షన్‌ 285(ఏ)ను సవరించి, 50 శాతం పరిమితిని తొలగించేందుకు ఆదివారం శాసనసభ లో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది. బిల్లును సభలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చ జరిగిన అనంతరం సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.


ఇవి కూడా చదవండి

లిక్కర్ కేసులో మాజీ సీఎం జైలుకు పోవటం ఖాయం.. గోనె ప్రకాష్ రావు సంచలన ప్రెస్‌‌మీట్

మహా గణపతి దర్శనం కోసం తరలివస్తున్న లక్షలాది మంది భక్తులు..

Updated Date - Sep 01 , 2025 | 04:13 AM