CM Revanth Reddy: విద్యార్థి రాజకీయాలు చారిత్రక అవసరం
ABN , Publish Date - Jan 13 , 2025 | 04:14 AM
విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘాల రాజకీయాలు చారిత్రక అవసరమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో సైద్ధాంతిక భావజాలం ఉన్నవారు లేకపోవడం వల్లే పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయని తెలిపారు.
సైద్ధాంతిక భావజాలం లేనందునే ఫిరాయింపులు
యూనివర్సిటీలకు పూర్వ వైభవం తీసుకొస్తున్నాం
ఎవరు సలహాలిచ్చినా స్వీకరించేందుకు సిద్ధం
విద్యాసాగర్‌రావు సహకారం రాష్ట్రానికి అవసరం
కేంద్ర మంత్రులు సహకరించాలి: సీఎం రేవంత్
హైడ్రా.. అభినందనీయం: విద్యాసాగర్‌రావు
విద్యాసాగర్‌రావు స్వీయచరిత్ర ‘ఉనిక’ ఆవిష్కరణ
హైదరాబాద్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘాల రాజకీయాలు చారిత్రక అవసరమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో సైద్ధాంతిక భావజాలం ఉన్నవారు లేకపోవడం వల్లే పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయని తెలిపారు. విద్యార్థి రాజకీయాల్లో సిద్ధాంతపరంగా రాణించిన వారుంటే.. ప్రజాప్రతినిధులుగా అధికారంలో ఉన్నా, లేకపోయినా.. నమ్మిన సిద్ధాంతం కోసం దశాబ్దాలపాటు జీవితాలను త్యాగం చేస్తారని తెలిపారు. ప్రజా సమస్యలపై విద్యార్థి సంఘాలు పోరాటాలు చేయడం వల్లనే చైతన్యం వస్తుందని, ఆయా సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల పోరాటం కంటే.. ఓయూ, కేయూ విద్యార్థులు ముం దుండి ఉద్యమించడం వల్లనే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని అన్నారు. అలాంటి విద్యార్థి రాజకీయాలను తెలంగాణలో పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని పార్టీలూ విద్యార్థి రాజకీయాలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
ఆదివారం తాజ్‌కృష్ణాలో జరిగిన ఓ కార్యక్రమంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్‌రావు స్వీయచరిత్ర ‘ఉనిక’ పుస్తకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాల్లో ఓవైపు జార్జిరెడ్డి, మరోవైపు సాగర్‌జీ (విద్యాసాగర్‌రావు) వంటివారు నమ్మిన సిద్ధాంతం కోసం గట్టిగా నిలబడ్డారని తెలిపారు. విద్యార్థి దశలో సిద్ధాంతపరమైన భావజాలం ఉన్నవారు తక్కువగా ఉండడం, విద్యార్థి రాజకీయాల్లో చైతన్యం కోల్పోవడం వల్లనే ప్రజాప్రతినిధులు కావాలనుకుంటున్న వారు ఏ పార్టీ అయినా ఫరవాలేదని, తమకు పదవి ఉంటే చాలునని అనుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయని రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ‘పార్టీ ఫిరాయింపులపై నేను మాట్లాడితే బాగోదేమో’ అంటూ నే.. తనదైన శైలిలో పై వ్యాఖ్యలు చేశారు.
మూడో తరం కనిపించడంలేదు..
విద్యార్థి రాజకీయాల్లో మొదటి తరంలో బూర్గుల రామకృష్ణారావు, పీవీ నర్సింహారావు, మర్రి చెన్నారెడ్డి, రెండో తరంలో జైపాల్‌రెడ్డి, విద్యాసాగర్‌రావు, దత్తాత్రేయ వంటివారు రాణిస్తే.. మూడో తరంలో ఎవరూ కనిపించడం లేదని సీఎం రేవంత్ అన్నారు. యూనివర్సిటీలు ఉనికి కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి పూర్వవైభవం కల్పించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపా రు. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా బాధ్యతలను సమర్థంగా నిర్వహించిన విద్యాసాగర్‌రావు.. తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టారని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశంసించారు. ఐదు దశాబ్దాలపాటు ప్రజా జీవితంలో ఎలాంటి ఆరోపణలు ఎదుర్కొనకపోవడం విద్యాసాగర్‌రావు గొప్పతనమని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరు సలహాలిచ్చినా తీసుకోవడానికి తనకు ఎలాంటి భేషజాలు లేవని, ముఖ్యంగా సాగర్‌జీ వంటి అనుభవజ్ఞుల సహకారం ఎంతో అవసరమని అన్నారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్‌తోపాటు బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్ వంటివారు సహకరించాలని కోరారు. జల్లికట్టు సమస్య వస్తే.. తమిళనాడులో అన్ని పార్టీలూ కేంద్రంతో పోరాటం చేసి సాధించుకున్నాయని, తెలంగాణ అభివృద్ధి విషయంలో కూడా అన్ని పార్టీలు ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. సీహెచ్.విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేయడం, మూసీ పునరుజ్జీవం కోసం చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. ప్రపంచదేశాల్లోని ముఖ్యనగరాలకు దీటుగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడం ప్రశంసనీయమని పేర్కొన్నా రు.
ఉన్నత పదవులకు వన్నె తెచ్చిన విద్యాసాగర్‌రావు: దత్తాత్రేయ
విద్యాసాగర్‌రావు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసినప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయనకు తానే బీ ఫాం ఇచ్చానని అన్నారు. ఎన్నో ఉన్నత పదవులకు ఆయన వన్నె తెచ్చారని ప్రశంసించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరుకావడం మంచి పరిణామమన్నారు. ఒడిసా గవర్నర్ హరిబాబు మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణా జలాల సద్వినియోగం కోసం విద్యాసాగర్‌రావు విశేష కృషి చేశారన్నారు. రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. నమ్మిన సిద్ధాంతం కోసం విద్యాసాగర్‌రావు రాజీ పడకుండా నిలిచారన్నారు. ఈ కారక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, బీజేపీ ఎంపీలు కె.లక్ష్మణ్, డీకే అరుణ, కేంద్ర మాజీ మంత్రి టి.సుబ్బిరామిరెడ్డి, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.
స్వామి వివేకానందకు సీఎం నివాళి
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం తన నివాసంలో నివాళి అర్పించారు.