Share News

పైసా ఖర్చు లేకుండా హెచ్‌ఐసీసీ నిర్మాణం!

ABN , Publish Date - Jan 04 , 2025 | 05:12 AM

వినూత్న ఆలోచనలే పెట్టుబడిగా సంపదను సృష్టించవచ్చని ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. సంపద సృష్టించాలంటే డబ్బే ప్రధానం కాదన్నారు.

పైసా ఖర్చు లేకుండా హెచ్‌ఐసీసీ నిర్మాణం!

  • ఆలోచనలే పెట్టుబడిగా సంపద సృష్టించాలి

  • దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం తెలంగాణలోనే

  • ఏపీ అభివృద్ధిలో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలి

  • ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్య

  • ఘనంగా ప్రపంచ తెలుగు సమాఖ్య సభలు ప్రారంభం

హైదరాబాద్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): వినూత్న ఆలోచనలే పెట్టుబడిగా సంపదను సృష్టించవచ్చని ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. సంపద సృష్టించాలంటే డబ్బే ప్రధానం కాదన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధిలో తెలుగుదేశం పాత్ర కీలకమని.. ఒక్క ఆలోచనతో రూపాయి ఖర్చు పెట్టకుండా హెచ్‌ఐసీసీ నిర్మాణం జరిగిందని తెలిపారు. ఆంధ్ర, తెలంగాణలో ఉండే తెలుగువారి కంటే విదేశాల్లో ఉంటున్నవారే తెలుగు భాషను, సంప్రదాయాలను కాపాడుతున్నారని వ్యాఖ్యానించారు. శుక్రవారమిక్కడ ప్రారంభమైన ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలో చంద్రబాబు కీలకోపన్యాసం చేశారు. మహాసభల సావనీర్‌ను, తెలుగు ఏంజిల్స్‌ లోగోను ఆవిష్కరించారు. డబ్బుకన్నా ఆలోచనలే పెట్టుబడిగా పెట్టి సంపద సృష్టించవచ్చన్నారు. ‘‘1996లో నేను సీఎం అయ్యేనాటికి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఆ సమయంలో భారీ కన్వెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటు చే యాలన్న ఆలోచన వచ్చింది. దీనిపై దుబాయ్‌ ప్రభుత్వంతో సంప్రదించా. హైటెక్స్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిస్తే ఎమ్మార్‌ ప్రాపర్టీ్‌సలో విల్లాలకు స్థలం ఇస్తామని ప్రతిపాదించా. అంతే, ఒక్క పైసా ఖర్చుపెట్టకుండా హెచ్‌ఐసీసీ ఆవిర్భవించింది.


నాడు విజన్‌ 2020ను ప్రతిపాదిస్తే కొందరు ఎగతాళి చేశా రు. 20 ఏళ్ల కిందట ఈ ప్రాంత అభివృద్ధికి వేసిన పునాదుల ఫలితంగానే ఇప్పుడు తెలంగాణ దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయమున్న రాష్ట్రంగా ఎదిగింది. దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన పీవీ నరసింహారావు తెలుగు బిడ్డ కావడం మనకు గర్వకారణం. ఆయన చేపట్టిన సంస్కరణలను నేను అందిపుచ్చుకుని ఐటీ రంగానికి ప్రాధాన్యమిచ్చా. ఇప్పుడు అమెరికాలో అత్యధిక తలసరి ఆదా యం ఉన్నది తెలుగు వారికే. 2023-24లో మనదేశం నుంచి 3.30 లక్షల మంది విద్యార్థులు అమెరికా వెళి తే అందులో 50ు తెలుగువారే. నాలెడ్జ్‌ ఎకానమీ తెలుగువారి సొంతం’’ అని చంద్రబాబు చెప్పారు. ఉద్యోగాలు, వ్యాపారాల కోసం ఏ దేశానికి వెళ్లినా జన్మభూమిని మరచిపోవద్దని, సొంత ప్రాంతానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ విజన్‌-2047 ప్రతిపాదిస్తే తాను 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్‌ను ప్రతిపాదించినట్లు చెప్పారు. ఏపీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. తెలుగుజాతికి ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌దని, పొట్టి శ్రీరాములు దీక్ష వల్లే ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భవించిందని, అలాంటి మహనీయులను గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. తె లుగు సినీ పరిశ్రమ ప్రపంచ మార్కెట్‌లో భాగస్వామిగా ఎదిగే స్థాయికి చేరడం ప్రశంసనీయమని ఆయన అన్నారు.


దక్షిణాదిన జనాభా తగ్గుతోంది

దక్షిణాదిన జనాభా తగ్గుతోందని చంద్రబాబు అన్నారు. 2047 తర్వాత మనదేశంలో వృద్ధులే ఎక్కువగా ఉంటారని పేర్కొన్నారు. జపాన్‌, జర్మనీ వంటి దేశాలు మన దేశం నుంచి మనుషులను పంపించమని కోరుతున్నాయని.. అలాంటి దుస్థితి మనకు రాకూడదని అన్నారు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారని.. ‘నో కిడ్స్‌.. బెటర్‌ ఎంజాయ్‌’ అనే పాలసీతో వెళుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.


తెలుగురాష్ట్రాల అభివృద్ధిలో యువత కీలకం: ఇందిరా దత్‌

తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కీలకమని ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు వి.ఎల్‌.ఇందిరాదత్‌ అన్నారు. ఇందుకోసం రెండు ప్రభుత్వాలు సహకరించుకోవాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలను సంఘటితం చేయడమే సమాఖ్య లక్ష్యమని చెప్పారు.

Updated Date - Jan 04 , 2025 | 05:12 AM