CID: కిడ్నీ రాకెట్ కేసు.. సీఐడీకి అప్పగింత
ABN , Publish Date - Jan 25 , 2025 | 05:20 AM
హైదరాబాద్‌లోని అలకనంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో జరిగిన కిడ్నీ మార్పిడి దందాపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్యుల కమిటీ ఇచ్చిన ప్రాథమిక నివేదికను మంత్రి పరిశీలించారు.

ప్రభుత్వం కీలక నిర్ణయం.. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు
అవయవ మార్పిడి దందాలో ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్ల పాత్రపై దర్యాప్తు
ప్రైవేటు ఆస్పత్రుల్లో సర్జరీల వివరాలను నమోదు చేయాలి: దామోదర
చర్లపల్లి జైలుకు అలకనంద ఆస్పత్రి యజమాని, రిసెప్షనిస్ట్
హైదరాబాద్, దిల్‌సుఖ్‌నగర్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ వ్యవహారాన్ని క్రైౖమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ)కి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌లోని అలకనంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో జరిగిన కిడ్నీ మార్పిడి దందాపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్యుల కమిటీ ఇచ్చిన ప్రాథమిక నివేదికను మంత్రి పరిశీలించారు. అలకనంద హాస్పిటల్‌లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలకు ఎటువంటి అనుమతి లేదని, నిబంధనలకు విరుద్ధంగా సర్జరీలు జరిగాయని అధికారులు మంత్రికి వివరించారు. తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటకలకు చెందిన వ్యక్తులకు ఈ అక్రమ వ్యవహారంతో సంబంధం ఉందని తెలిపారు. అత్యంత నిరుపేదల ఆర్థిక పరిస్థితిని ఆసరాగా తీసుకుని, వారిని మభ్యపెట్టి కిడ్నీల డొనేషన్‌కు ఒప్పిస్తున్నారన్నారు. అలకనంద హాస్పిటల్‌ను సీజ్ చేశామని, ఆస్పత్రి యజమానిని పోలీసులు అరెస్టు చేశారని మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ.. కిడ్నీ మార్పిడి దందాను చాలా సీరియ్‌సగా పరిగణిస్తున్నామని.. కేసుతో సంబంధం ఉన్నవాళ్లందరికీ కఠినంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. పూర్తిస్థాయి విచారణ కోసం కేసును సీఐడీకి అప్పగించాలని, ఉత్తర్వులను వెంటనే విడుదల చేయాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా చొంగ్తును మంత్రి ఆదేశించారు.
నిందితుల రిమాండ్
అలకనంద ఆస్పత్రి యజమాని సుమంత్, రిసెప్షనిస్ట్ గోపీలను సరూర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి గురువారం అర్ధరాత్రి జడ్జి నివాసంలో హాజరుపరిచారు. తనను పోలీసులు కొడుతున్నారని సుమంత్ చెప్పటంతో అతడికి వైద్యపరీక్షలు నిర్వహించాలని జడ్జి పోలీసులను ఆదేశించారు. వనస్థలిపురంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సుమంత్‌కు వైద్యపరీక్షల్లో నిర్వహించగా ఎలాంటి గాయాలు లేవని తేలింది. అనంతరం శుక్రవారం ఉదయం నిందితులిద్దరినీ చర్లపల్లి జైలుకు రిమాండ్‌కు తరలించిన పోలీసులు మిగతా నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. వారిలో ముఖ్యంగా కర్ణాటకకు చెందిన బ్రోకర్లు, వైద్య సిబ్బంది ఉన్నట్లు తెలుస్తుంది. కిడ్నీ దందాలో కీలకంగా వ్యవహరించిన ఓ వైద్యుడు పోలీసులకు చిక్కకుండా కశ్మీర్‌కు పారిపోయినట్లుగా తెలిసింది. కాగా, సుమంత్ కనబడటం లేదంటూ అతని తరఫు న్యాయవాదులు గురువారం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసి, రిమాండ్ ప్రక్రియకు తెర తీశా రు. మరోవైపు, అలకనంద ఆస్పత్రిలో అధికారులు సోదా లు జరిపినప్పుడు అక్కడి నుంచి పారిపోయిన వారిలో డాక్టర్ పవన్ అనే నెఫ్రాలజిస్ట్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుంది.
పొరుగు రాష్ట్రాలకు సమాచారం ఇవ్వండి!
గతంలో కేరళలో కూడా కిడ్నీ రాకెట్ తరహా కేసు నమోదైన విషయాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష సమావేశంలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం రాష్ట్రంలో చోటుచేసుకున్న ఘటన గురించి కేరళతోపాటు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అవయవ మార్పిడి అక్రమాలలో ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్ల పాత్ర ఉన్నట్టు గతంలో వచ్చిన ఆరోపణలను గుర్తు చేస్తూ.. ఆ దిశగా కూడా విచారణ జరగాలన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో జరుగుతున్న శస్త్రచికిత్సలపై నిఘా ఉంచాలన్నారు. వివరాలనూ నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. హాస్పిటళ్లకు అనుమతులు, రిజిస్ట్రేషన్ రెన్యువల్ విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు.
బ్రెయిన్ డెడ్ కేసులపైనా సీఐడీ దర్యాప్తు
అలకనంద హాస్పిటల్ కిడ్నీ మార్పిడి రాకెట్ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించిన నేపథ్యంలో.. ఈ వ్యవహారానికి సంబంధించిన ఇతర అంశాలపైనా దర్యాప్తు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బ్రెయిన్ డెడ్ కేసుల్లో జరిగిన అవయవ మార్పిడి శస్త్రచికిత్సలపై సీఐడీ దృష్టి పెట్టే అవకాశం ఉంది. బ్రెయిన్ డెడ్ కేసుల్లో మృతుల కుటుంబీకులను ముఖ్యంగా పేదవారిని, అంతగా అవగాహన లేని వారిని లక్ష్యంగా చేసుకొని వారి నుంచి ఏదో విధంగా ఆమోదం పొంది.. అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరుపుతూ సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఈవ్యవహారంలో ప్రైవే టు అంబులెన్స్ వ్యవస్థ మీదా విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో జరిగిన బ్రెయిన్ డెడ్ కేసుల్లో జరిగిన అవయవ మార్పిడి ఆపరేషన్లు నిబంధనల ప్రకారమే జరిగాయా?అన్నది సీఐడీ పరిశీలించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. జీవన్‌దాన్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న గణాంకాల ప్రకారం బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించిన కేసులు అత్యధికం ప్రైవేటులోనే ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 1488 బ్రెయిన్‌డెడ్ కేసులు నమోదు కాగా.. వాటిలో 1445 ప్రైవేటు హాస్పిటళ్లలో, 43 ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదయ్యాయి.