Hyderabad Cricket Association: హెచ్‌సీఏ కార్యాలయంలో సీఐడీ సోదాలు
ABN , Publish Date - Jul 19 , 2025 | 04:25 AM
నిధుల దుర్వినియోగం కేసులో సీఐడీ అధికారులు శుక్రవారం ఉప్పల్‌లోని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కార్యాలయంలో సోదాలు జరిపారు.
జగన్‌మోహన్‌రావును ఉప్పల్ తీసుకెళ్లిన సీఐడీ అధికారులు
హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఆయన హయాంలో చేసిన ఖర్చుపై ఆరా
టెండర్లు లేకుండానే పనులు అప్పగించడంపై ఈడీ దృష్టి
క్విడ్‌ప్రో కో కోణంలో విచారణ
హైదరాబాద్, జూలై 18 (ఆంధ్రజ్యోతి): నిధుల దుర్వినియోగం కేసులో సీఐడీ అధికారులు శుక్రవారం ఉప్పల్‌లోని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కార్యాలయంలో సోదాలు జరిపారు. ఈ కేసులో అరెస్టై.. సీఐడీ కస్టడీలో ఉన్న హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావును కూడా వెంట తీసుకువచ్చి, తనిఖీలను కొనసాగించారు. ఈ సందర్భంగా పలు రిజిస్టర్లను పరిశీలించారు. ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో వీవీఐపీ బాక్స్‌కు తాళం వేసిన వైనానికి సంబంధించి జగన్‌మోహన్‌రావును అక్కడికి తీసుకువెళ్లి.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. ఆ తర్వాత జగన్‌ను గౌలిపురలోని శ్రీచక్ర క్రికెట్ క్లబ్‌కు తీసుకుని వెళ్లారు. ఫోర్జరీ పత్రాల తయారీ తదితర అంశాలపై జగన్, ఇతర నిందితులను సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. తాజాగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఇచ్చిన మరో ఫిర్యాదు ఆధారంగా ఫొరెన్సిక్ ఆడిట్ రిపోర్టులను పరిశీలిస్తున్నారు. బీసీసీఐ నుంచి క్రికెట్ అభివృద్ధి కోసం అందిన నిధులను జగన్ బృందం తమ వారికి కాంట్రాక్టులు అప్పజెప్పి, అందినకాడికి దోచుకుందంటూ రాత పూర్వకంగా ఫిర్యాదు వచ్చిన క్రమంలో.. ఆ విషయాన్ని రికార్డుల పరంగా విశ్లేషిస్తున్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల కంపెనీకి ఇచ్చిన ఐపీఎల్ టికెట్ల కాంట్రాక్టులో నిబంధనలు పాటించారా? అనేఅంశాన్ని పరిశీలిస్తున్నారు. అదే సమయంలో జగన్ హెచ్‌సీఏ అధ్యక్షుడు అయినప్పటి నుంచి జరిగిన ఆర్థిక లావాదేవీలను తనిఖీ చేస్తున్నారు. టెండర్లు ఇవ్వకుండానే పనులు అప్పగించడం, డెలివరీ కాకుండానే బిల్లుల చెల్లింపునకు సంబంధించిన అంశాలపై దృష్టిసారించారు.
క్విడ్‌ప్రో కో కోణంలో ఈడీ విచారణ
సీఐడీతో సమాంతరంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ) అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో జగన్ బృందం ‘క్విడ్‌ప్రో కో’కు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. టెండర్లు లేకుండానే కాంట్రాక్టులను అప్పగించడం, క్రికెట్ బాల్స్ డెలివరీ కాకుండానే.. రూ.1.03 కోట్లను చెల్లించడం.. ఫుడ్ ,హోటల్ కాంట్రాక్టులు, సుందరీకరణ పనులు, పబ్లిసిటీ, టికెట్ల అమ్మకాలపై ఈడీ అధికారులు దృష్టి సారించారు. నిబంధనలను బేఖాతరు చేసి.. కాంట్రాక్టులను ఇవ్వడం ద్వారా జగన్‌కు భారీగానే ప్రతిఫలం ముట్టినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ కుటుంబ సభ్యులు, సన్నిహితుల బ్యాంకు లావాదేవీలను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. గతంలోనూ అజారుద్దీన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో హెచ్‌సీఏ కార్యదర్శి సురేందర్ అగర్వాల్ క్రికెట్ బాల్స్, జిమ్ సామగ్రి, స్టేడియం కుర్చీల విషయంలో కొన్ని కంపెనీలకు లబ్ధి చేకూర్చి.. ఆయా కంపెనీల ద్వారా ఆయన భార్య, కుమారుడి ఖాతాల్లోకి డబ్బు తెప్పించుకున్న విషయాన్ని ఇప్పటికే ఈడీ గుర్తించింది. దాదాపు రూ.90లక్షల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి