Share News

Chemotherapy Now Available: ఇక జిల్లాల్లోనే కీమోథెరపీ

ABN , Publish Date - Aug 24 , 2025 | 04:22 AM

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన క్యాన్సర్‌ రోగులు కీమోథెరపీ కోసం ఇకపై హైదరాబాద్‌ రానక్కర్లేదు. జిల్లా కేంద్రాల్లోనే కీమోథెరపీ చేసేలా సర్కారు ఏర్పాట్లు చేస్తోంది...

Chemotherapy Now Available: ఇక జిల్లాల్లోనే కీమోథెరపీ

  • చికిత్స కోసం హైదరాబాద్‌ రానక్కర్లేదు

  • బోధనాస్పత్రుల్లో డే కేర్‌ క్యాన్సర్‌ సెంటర్లు

  • ఒక్కో కేంద్రంలో 20 పడకలు

  • తొలుత ఎంఎన్‌జేలో.. తర్వాత జిల్లాల్లో..

  • క్యాన్సర్‌పై పోరుకు సర్కారు నిర్ణయం

హైదరాబాద్‌/సిటీ, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన క్యాన్సర్‌ రోగులు కీమోథెరపీ కోసం ఇకపై హైదరాబాద్‌ రానక్కర్లేదు. జిల్లా కేంద్రాల్లోనే కీమోథెరపీ చేసేలా సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా కేంద్రాల్లోని బోధనాస్పత్రుల్లో డే కేర్‌ క్యాన్సర్‌ సెంటర్లు(డీసీసీసీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కేంద్రాల ద్వారా క్యాన్సర్‌ రోగులకు కీమోథెరపీ కష్టాలు తీరనున్నాయి. క్యాన్సర్‌ నివారణ, చికిత్స విషయంలో ప్రముఖ క్యాన్సర్‌ నిపుణుడు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు ఇటీవల వైద్య శాఖకు పలు సూచనలు చేశారు. వాటిపై శనివారం వైద్యఆరోగ్యశాఖ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. ఇందులో పాల్గొన్న విభాగాధిపతులు.. తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా 34 బోధనాస్పత్రుల్లో డీసీసీసీలను ప్రారంభించాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే, నిమ్స్‌ మాదిరిగా డీసీసీసీలు పనిచేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. వీటిలో క్యాన్సర్‌ పరీక్షలు నిర్వహిస్తారు. లక్షణాలు కనిపిస్తే.. వారిని ఎంఎన్‌జేకు పంపుతారు. ఒకవేళ నిర్ధారణ అయితే చికిత్స ప్రారంభిస్తారు. తొలి కీమోథెరపీ ఎంఎన్‌జేలో ఇస్తా రు. అనంతరం ఆ రోగులను వారి జిల్లా కేంద్రాల్లోని డీసీసీసీలకు పంపుతారు. రోగికి అవసరమైన కీమోథెరపీలను అక్కడే ఇస్తారు. దీంతో రోగులకు వ్యయప్రయాసలు తగ్గుతాయని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. జిల్లాల్లో ప్రతి డీసీసీసీని 20 పడకలతో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపాయి. ఇందులో 10 పడకలను కీమోథెరపీ కోసం, మరో 10 పాలియేటివ్‌ కేర్‌ కోసం వినియోగించనున్నారు. కీమోథెరపీ బాధ్యతలను జనరల్‌ సర్జన్‌ వైద్యులకు అప్పగిస్తారు. పాలియేటివ్‌ కేర్‌ అంటే కొందరు రోగులు కీమోథెరపీ చేయించుకొని అదేరోజు ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి ఉండదు. వారిని ఇన్‌పేషెంట్‌గా ఉంచి, అవసరమైన చికిత్సలను అందిస్తామని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. క్యాన్సర్‌ పాలియేటివ్‌ కేర్‌ బాధ్యతలను అనస్థీషియా వైద్యులకు అప్పగించామని తెలిపారు. అలాగే, రోగి వయసు, వచ్చిన క్యాన్సర్‌, దశను బట్టి చికిత్స అందించనున్నారు. రాష్ట్రంలో క్యాన్సర్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఏటా కొత్తగా 55 వేల కేసులు నమోదవుతున్నాయి. ఫలితంగా ఎంఎన్‌జే, నిమ్స్‌ ఆంకాలజీ విభాగాలతో పాటు బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి లాంటివి రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే డీసీసీసీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 27 డీసీసీసీల ఏర్పాటుకు కేంద్రం రూ.40.23 కోట్లు విడుదల చేసింది. మిగిలిన 7 కేంద్రాలను రాష్ట్రనిధులతో ఏర్పాటు చేయనున్నారు.


ఎంఎన్‌జేలో పిల్లలకు ప్రత్యేక యూనిట్‌!

ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రిలో పిల్లల కోసం ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పీడియాట్రిక్‌ ఆంకాలజీ పేరుతో పిల్లలకు వైద్య సేవలను అందించాలని భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ వైద్య విభాగం సలహాదారుడు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు ఇటీవల ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రిని సందర్శించి, అక్కడి పరిస్థితులను పర్యవేక్షించారు. ఆస్పత్రి డైరెక్టర్‌ ఎం.శ్రీనివాసులుతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో పిల్లల విభాగాల అభివృద్ధిపై పలు సూచనలు చేశారు. పిల్లలకు పడకలను పెంచాలని ప్రతిపాదనలు చేశారు. పిల్లల క్యాన్సర్‌ చికిత్స కోసం సీఎ్‌సఆర్‌ నిధుల సేకరణలో తన వంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఎంఎన్‌జే ఆస్పత్రిలో పిల్లలకు చికిత్స అందించడానికి 120 పడకలున్నాయి. ఇవి ఎప్పుడూ రోగులతో రద్దీగా ఉం టున్నాయి. దీంతో పిల్లలకు మాత్రమే ప్రత్యేక యూనిట్‌ను పెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే ఆస్పత్రిలోనే పిల్లల ఇన్‌స్టిట్యూట్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు వైద్యాధికారులు సుముఖంగా ఉన్నారు. ఆస్పత్రి ఖాళీ స్థలం లో ప్రత్యేక బ్లాక్‌ నిర్మాణం చేయవచ్చని అంటున్నారు. అక్కడ 500 పడకలను ఏర్పాటు చేయొచ్చని అంటున్నారు. కాగా, పిల్లలకు బ్లడ్‌ క్యాన్సర్‌ను నయం చేయడానికి ప్రత్యేకంగా కీమోథెరపీ ఇస్తున్నట్లు ఎంఎన్‌జే డైరెక్టర్‌ ఎం.శ్రీనివాసులు తెలిపారు. బోన్‌ క్యాన్సర్‌తో వచ్చే రోగులకు కాలు తొలగించకుండా ప్రత్యేకంగా చికిత్స అందించి నయంచేస్తున్నట్లు చెప్పారు. ప్రభు త్వం ఆదేశిస్తే పిల్లల కోసం ప్రత్యేక యూనిట్‌ ఏర్పా టు చేస్తామన్నారు. తమ ఆస్పత్రిలో పిల్లలకు నెలకు 20-30 శస్త్రచికిత్సలు జరుగుతుంటాయని తెలిపారు.


ఇవి కూడా చదవండి..

నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు

అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్

For More National News And Telugu News

Updated Date - Aug 24 , 2025 | 07:56 AM