Share News

Road Development: ‘హ్యామ్‌’లో మార్పులు.. ఫైల్‌ మళ్లీ క్యాబినెట్‌కు!

ABN , Publish Date - Aug 13 , 2025 | 04:50 AM

హైబ్రిడ్‌ యాన్యుయిటీ మోడ్‌ (హ్యామ్‌) విధానంలో రోడ్ల అభివృద్ధి అంశంలో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ ఫైలు మళ్లీ క్యాబినెట్‌కు వెళ్లనుంది.

Road Development: ‘హ్యామ్‌’లో మార్పులు.. ఫైల్‌ మళ్లీ క్యాబినెట్‌కు!

  • చిన్న కాంట్రాక్టర్లు రూ.కోట్ల పనులు ఎలా చేయగలరు?

  • సకాలంలో ప్రభుత్వం బిల్లులు చెల్లించకుంటే తంటాలే

  • బ్యాంకులు రేటింగ్‌ తగ్గిస్తామంటే ఒప్పుకోం:కాంట్రాక్టర్లు

  • ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లు, బ్యాంకర్ల సమావేశం

హైదరాబాద్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): హైబ్రిడ్‌ యాన్యుయిటీ మోడ్‌ (హ్యామ్‌) విధానంలో రోడ్ల అభివృద్ధి అంశంలో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ ఫైలు మళ్లీ క్యాబినెట్‌కు వెళ్లనుంది. మంగళవారం ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (న్యాక్‌) కార్యాలయంలో కాంట్రాక్టర్లు, బ్యాంకర్లు, వర్క్‌ ఏజెన్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హ్యామ్‌పై కాంట్రాక్టర్లు పలు సలహాలు, సూచనలు చేశారు. ఆర్‌ అండ్‌ బీలో 350 కి.మీ. మేర మాత్రమే రోడ్ల విస్తరణ పనులు ఉన్నాయని, మిగిలిన 4,840 కి.మీ. మేర అభివృద్ధి చేయాల్సిన రోడ్లేనన్నారు. ఈ పనులను హ్యామ్‌లో తీసుకుని, 15 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు చేపట్టాలంటే ఆమోదయోగ్యం కాదని తెలిపారు. ఈ పనులు కోట్ల రూపాయల్లో ఉన్నాయని, చిన్న కాంట్రాక్టర్లు అంతపెద్ద మొత్తంలో ఎలా చేయగలరని ప్రశ్నించారు.


ఓ కాంట్రాక్టర్‌ మాట్లాడుతూ 2015లో రాష్ట్రవ్యాప్తంగా రూ.3 వేల కోట్లతో 6-7వేల కిలోమీటర్ల మేర రోడ్ల మరమ్మతులు, కొత్తవి నిర్మించామని, ఇప్పటికీ అవి ఎక్కడా పెద్దగా దెబ్బతినలేదన్నారు. మళ్లీ ఇప్పుడు అవే రోడ్ల అభివృద్ధికి హ్యామ్‌ను అనుసరించడంపై పునరాలోచన చేయాలని సూచించారు. ఒక రోడ్డు విస్తరణకు, దాని నిర్వహణకు కాంట్రాక్టరు వెచ్చించే సొమ్మును ప్రభుత్వం 15 ఏళ్లలో ఎలా, ఎంత చెల్లిస్తుందనే విషయంపై స్పష్టత ఇవ్వాలని కాంట్రాక్టర్లు అడిగారు. హ్యామ్‌లో కాంట్రాక్టర్లు 60 శాతం నిధులను బ్యాంకుల నుంచి తీసుకున్న తర్వాత ప్రభుత్వం సమయానికి బ్యాంకులకు చెల్లించకపోతే తమ రేటింగ్‌లు తగ్గిస్తామంటే ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. చాలాచోట్ల సింగిల్‌ లేన్లనే అభివృద్ధి చేయాల్సి వస్తోందని, భవిష్యత్‌ అవసరాలకు దృష్టిలో ఉంచుకుని వాటిని విస్తరించాలని కొంతమంది కాంట్రాక్టర్లు సూచించారు. దీనికి తగు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అధికారులకు సూచించారు. హ్యామ్‌లో మార్పులు చేర్పుల అంశాన్ని వచ్చే క్యాబినెట్‌ సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 13 , 2025 | 04:50 AM