గోదావరిపై ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకోండి
ABN , Publish Date - Jun 20 , 2025 | 03:37 AM
ఏపీ, తెలంగాణ.. ఎవరి శక్తి మేరకు వాళ్లం గోదావరి నదిపై ప్రాజెక్టులు కట్టుకుందాం. దానిపై మీరూ ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకోండి. ఎవరు వద్దన్నారు. మిగిలిన నీటినే మేం వాడుకుంటామని చెబుతున్నా.
మనం మనం తిట్టుకుంటే దాన్ని రాజకీయం చేయాలని చూసేవాళ్లు చాలామంది ఉన్నారు. గోదావరిలో చాలా నీళ్లు ఉన్నాయి. ఎవరి ఓపికను బట్టి వారు వాడుకోవచ్చు. 3000 టీఎంసీల నీరు ఏటా సముద్రంలో కలుస్తోంది.
- ఏపీ సీఎం చంద్రబాబు
మిగిలిన నీటినే మేం వాడుకుంటాం.. సముద్రంలో కలిసే నీటితోనే ప్రాజెక్టుల నిర్మాణం
ఎవరికీ నష్టం లేదు.. రాద్ధాంతం ఎందుకు?.. సమస్యలు సృష్టించుకోవడం ఎందుకు?
ఎవరి శక్తి మేరకు వాళ్లం ప్రాజెక్టులు కట్టుకుందాం.. దీనిపై పోరాటాలు అనవసరం
తెలంగాణపై నేను ఎప్పుడైనా గొడవ పడ్డానా!?.. కాళేశ్వరం ప్రాజెక్టుకూ అడ్డు చెప్పలేదు
తెలుగు రాష్ట్రాలు నంబర్ వన్‌గా ఉండాలి.. బనకచర్ల వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు
ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా పరిష్కరించుకుందామని సూచన
అమరావతి, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): ‘‘ఏపీ, తెలంగాణ.. ఎవరి శక్తి మేరకు వాళ్లం గోదావరి నదిపై ప్రాజెక్టులు కట్టుకుందాం. దానిపై మీరూ ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకోండి. ఎవరు వద్దన్నారు. మిగిలిన నీటినే మేం వాడుకుంటామని చెబుతున్నా. ఎవరూ ఎవరిపైనా పోరాడాల్సిన అవసరం లేదు. కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయి’’ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దీనిపై పోరాటాలు అవసరం లేదని, తెలంగాణపై తాను ఎప్పుడైనా గొడవ పడ్డానా!? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కట్టుకున్నప్పుడు కూడా తాను అడ్డు చెప్పలేదని గుర్తు చేశారు. మనం గొడవ పడుతున్నామంటే ప్రజలను మభ్యపెట్టడమేనని, మోసం చేయడమేనని, దానివల్ల రెండు రాష్ట్రాల ప్రజలకు ఉపయోగం లేదని చెప్పారు. అమరావతిలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బనకచర్ల ప్రాజెక్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మనం మనం తిట్టుకుంటే దాన్ని రాజకీయం చేయాలని చూసేవాళ్లు చాలామంది ఉన్నారు. గోదావరిలో చాలా నీళ్లు ఉన్నాయి.
ఎవరి ఓపికను బట్టి వారు వాడుకోవచ్చు. 3000 టీఎంసీల నీరు ఏటా సముద్రంలో కలుస్తోంది. తెలంగాణ ఎంత వాడుకున్నా 100 టీఎంసీలు వాడుకుంటుంది. మనం ఎంత వాడుకున్నా మరో 100 టీఎంసీలు వాడుకోగలం. దీనిపై రాద్ధాంతం ఎందుకు?’’ అని ప్రశ్నించారు. గోదావరి నీటిని తెలంగాణ, ఏపీ రెండూ ఉపయోగించుకుంటున్నాయని చెప్పారు. ‘‘పైనుండే వారు నీటిని వాడుకుంటే నష్టమా? కింద ఉండేవారు నీటిని వాడుకుంటే నష్టమా!? మీరు నీరు వాడుకోకపోతేనే కదా ఆ నీరు కిందకు వచ్చి సముద్రంలో కలిసేది. దాన్నే మేం వాడుకుంటామని చెబుతున్నాం. దీనివల్ల ఎవరికీ నష్టం లేదు’’ అని స్పష్టం చేశారు. పోలవరం తప్ప మిగతావి అనుమతి రాని ప్రాజెక్టులేనని, విభజన చట్టంలో భాగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని గుర్తు చేశారు. గోదావరి ప్రవాహంలో చిట్టచివరి రాష్ట్రంగా.. వచ్చిన నీటిని మరో బేసిన్‌కు తరలిస్తున్నామని తెలిపారు. ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చాలా ప్రాజెక్టులు నేనే మొదలు పెట్టాను. దేవాదుల, కల్వకుర్తి ప్రాజెక్టులు నేనే మొదలు పెట్టాను. ఎల్లంపల్లి ప్రాజెక్టుపై వివాదం వస్తే అసెంబ్లీలో పోరాడాం. తెలంగాణ కానీ ఆంధ్రా కానీ అంతా తెలుగువారే. మనకు మనం ఎందుకు సమస్యలు సృష్టించుకుంటున్నాం? తెలుగు రాష్ట్రాలు వాడుకునే నీటిపై వివాదాలు ఎందుకు? ఇరు పక్షాలకు ఆమోదయోగ్యంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సమస్యను పరిష్కరించుకుందాం’’ అని స్పష్టం చేశారు.
సముద్రంలో కలిసే నీటి వాడకంపై చట్టబద్ధత కావాలంటే కేంద్రంతో చర్చిద్దామని అన్నారు. సముద్రంలో కలిసే నీటి వాడకంపై సమస్యలు సృష్టించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రెండు రాష్ట్రాలూ నంబర్ వన్‌గా ఉండాలన్నదే తన ఆశయమని, అందరం కలిసి తెలుగు జాతిని ప్రపంచమే హద్దుగా అభివృద్ధి పథంలో నడిపిద్దామని పిలుపునిచ్చారు. ‘‘హైదరాబాద్‌లో హైటెక్ సిటీ కట్టినా.. ఇక్కడ అమరావతి కడుతున్నా నా కోసం కడుతున్నానా!? భవిష్యత్తు తరాల కోసం కడుతున్నాం. తెలంగాణ ఎకో సిస్టమ్ చాలా మంచి సిస్టమ్. దాన్ని ఇక్కడకు తీసుకు రావాలంటే చాలా కష్టపడాలి’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గతంలో కృష్ణా బ్యారేజీపై ఇరు రాష్ట్రాల సిబ్బంది గొడవ పడ్డారని, గవర్నర్ వద్ద కూర్చుని సమస్య పరిష్కరించుకున్నామని గుర్తు చేశారు. ‘‘కృష్ణాలో తక్కువ ఉన్న నీటిపై గొడవ పడితే లాభం లేదు. ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపులను అలాగే కొనసాగనిద్దాం. కొత్త ట్రైబ్యునల్ తీర్పు వచ్చిన తర్వాత కేటాయింపుల మేరకు ముందుకు వెళదాం’’ అని ప్రతిపాదించారు.
ఇవి కూడా చదవండి:
కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయతో లోకేష్ భేటీ
యోగాలో ప్రపంచ రికార్డు సృష్టిస్తాం..: మంత్రి సవిత
ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి
For More AP News and Telugu News