Share News

Grahanam Effect Temples Closed: చంద్ర గ్రహణం ఎఫెక్ట్.. ఆలయాలు మూసివేత..

ABN , Publish Date - Sep 07 , 2025 | 04:01 PM

తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు మూసివేశారు. ఈ మూసివేత సోమవారం తెల్లవారుజామున 3 గంటల వరకు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.

Grahanam Effect Temples Closed: చంద్ర గ్రహణం ఎఫెక్ట్.. ఆలయాలు మూసివేత..

హైదరాబాద్: సంపూర్ణ చంద్ర గ్రహణం కారణంగా ఇవాళ(ఆదివారం) తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన పలు దేవాలయాలను మూసివేశారు. ఈ రోజు రాత్రి 9.58 గంటల నుంచి చంద్రగ్రహణం ప్రారంభం కానుంది. రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 12.22 గంటల దాకా సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ 82 నిమిషాలపాటు చంద్రుడు పూర్తిగా భూమి నీడన ఉండనున్నాడు.తిరిగి రేపు(సోమవారం) తెల్లవారుజామున 2.25 గంటలకు గ్రహణం వీడనుంది. ఈ నేపథ్యంలో పలు ప్రముఖ ఆలయాలు మూతపడ్డాయి. గ్రహణం వీడిన తర్వాత ఆలయాలను తెరిచి సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.


తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు మూసివేశారు. ఈ మూసివేత సోమవారం తెల్లవారుజామున 3 గంటల వరకు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచి శుద్ధి చేసిన తర్వాత 3 గంటలకు సుప్రభాతంతో దర్శనాలు ప్రారంభిస్తామని చెప్పారు. అలాగే.. శ్రీశైలం ఆలయాన్ని మధ్యాహ్నం ఒంటి గంటకు మూసివేసి సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు తెరవనున్నారు. సోమవారం ఉదయం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ పూజలు చేసిన అనంతరం ఉదయం 7.30 గంటల నుంచి భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు.


వీటితో పాటు నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని చంద్రగ్రహణం కారణంగా ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు మూసివేశారు. సోమవారం ఉదయం 5 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్నీ మధ్యాహ్నం 3.30 గంటల నుంచి దుర్గగుడి కవాట బంధనంతో మూసివేశారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ ద్వారాలను తెరిచి సంప్రోక్షణ, స్నపనాభిషేకం చేపట్టనున్నారు. అమ్మవారికి హారతి అనంతరం సోమవారం ఉదయం 8.30 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్టుగా అధికారులు తెలిపారు. విశాఖపట్నంలోని సింహాచలం అప్పన్న ఆలయాన్ని కూడా ఉదయం 11:30 గంటలకు మూసివేసిన విషయం తెలిసిందే.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం రామాలయాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఇవాళ ఒంటి గంటకు మూసివేసినట్లు అధికారులు తెలిపారు. తిరిగి సోమవారం తెల్లవారుజామున మూడు గంటలకు తెరవనున్నట్లు ప్రకటించారు. ఉదయం 7:30 గంటల నుంచి స్వామి సేవలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. వీటితో పాటు.. యాదాద్రి జిల్లాలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాలు కూడా మూసివేయబడ్డాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

మహేశ్‌గౌడ్‌కు సీఎం రేవంత్‌ సన్మానం

నిమజ్జనోత్సవంలో రేవంత్‌

Updated Date - Sep 07 , 2025 | 04:39 PM