Khazana Jewelry: ఎస్‌వోటీ పోలీసుల అదుపులో ‘ఖజానా’ దొంగలు..!
ABN , Publish Date - Aug 14 , 2025 | 05:30 AM
చందానగర్ ఖజానా జువెలరీ దుకాణంలో కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
బైక్‌లపై పారిపోతుండగా వెంటాడి అరెస్టు
రహస్యంగా విచారణ.. ఉత్తరాది ముఠాగా గుర్తింపు
హైదరాబాద్ సిటీ/చందానగర్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): చందానగర్ ఖజానా జువెలరీ దుకాణంలో కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దుకాణంలో అసిస్టెంట్ మేనేజర్‌పై కాల్పులు జరిపి 10 కేజీల వెండిని దోచుకొని బైక్‌లపై బీదర్ వైపు పారిపోతున్న దొంగల ముఠాను ఎస్‌వోటి పోలీసులు వెంటాడి గంటల వ్యవధిలోనే పట్టుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం. వీరిది ఉత్తరాది ముఠాగా గుర్తించారు. పథకం ప్రకారం హైదరాబాద్‌కు వచ్చిన ఈ ముఠా.. రెండు రోజులపాటు రెక్కీ నిర్వహించి దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
నగరంలో ఉంటున్న వారి సహకారంతోనే ఈ దోపిడీకి పథకం రచించినట్లు తెలుస్తోంది. దొంగలు వినియోగించిన బైక్‌లను కూడా ఎక్కడో చోరీ చేసినట్లుగా పోలీసులు గర్తించినట్లు తెలిసింది. దోపిడీకి పాల్పడిన ఏడుగురు దొంగలు మొత్తం మూడు బైక్‌లను వినియోగించినట్లు సమాచారం. మొత్తం మీద సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన సాంకేతిక ఆధారాల ద్వారా సైబరాబాద్ ఎస్‌వోటి పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి దొంగల ముఠాను పట్టుకున్నట్లు తెలిసింది. ఏడుగురు నిందితులను అరెస్టు చేసి, సొత్తు రికవరీ చేసినట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
బిహార్ ఓటరు సవరణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
రిమాండ్ పొడిగింపు.. కోర్టు వద్ద చెవిరెడ్డి హల్‌చల్
For More National News And Telugu News