Share News

Gachibowli: అటవీ ప్రాంతంగా కంచ గచ్చిబౌలి భూములు

ABN , Publish Date - May 16 , 2025 | 04:18 AM

కంచ గచ్చబౌలి భూములను అటవీ ప్రాంతంగా ప్రకటించాలని కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ) సిఫారసు చేసింది. ఆ భూముల నిర్వహణను అటవీ శాఖకు అప్పగించాలని కోరింది.

Gachibowli: అటవీ ప్రాంతంగా కంచ గచ్చిబౌలి భూములు

  • నిర్వహణను అటవీ శాఖకు అప్పగించాలి

  • వన్యప్రాణి రక్షణ చట్టం కిందకు తేవాలి

  • నిపుణుల కమిటీని పునర్వ్యవస్థీకరించాలి

  • సుప్రీంకోర్టుకు సీఈసీ తుది నివేదిక

హైదరాబాద్‌, మే 15 (ఆంధ్రజ్యోతి): కంచ గచ్చబౌలి భూములను అటవీ ప్రాంతంగా ప్రకటించాలని కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ) సిఫారసు చేసింది. ఆ భూముల నిర్వహణను అటవీ శాఖకు అప్పగించాలని కోరింది. అలాగే, అక్కడున్న జీవ వైవిధ్యం దృష్ట్యా ఆ భూములను వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 కిందకు తెచ్చే అంశాన్ని కూడా పరిశీలించాలని సూచించింది. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి సీఈసీ ఏప్రిల్‌లో మధ్యంతర నివేదిక ఇచ్చిన విషయ తెలిసిందే. తాజాగా తుది నివేదికను సుప్రీం కోర్టుకు తాజాగా సమర్పించింది. ఇందులో అనేక కీలకమైన సిఫారసులు చేసింది. ‘‘ఆ ప్రాంతంలో కొట్టేసిన చెట్ల స్థానంలో మళ్లీ మొక్కలు నాటి దట్టమైన పచ్చదనం పెంపొందించేలా చేయాలి. వచ్చే వర్షాకాలంలోనే ఈ పని చేపట్టాలి. భూసార, జల సంరక్షణ కార్యక్రమాలను కూడా చేపట్టాలి. అక్కడి జల వనరులన్నింటినీ వెట్‌ ల్యాండ్స్‌ సంరక్షణ, నిర్వహణ నిబంధనలు-2017 ప్రకారం సంరక్షించాలి. జీహెచ్‌ఎంసీ ఆ ప్రాంతంలో సరైన మురుగునీటి శుద్ధి ప్లాంట్లను వచ్చే ఏడాది కాలంలో ఏర్పాటు చేయాలి’’ అని సూచించింది. ఇక, రాష్ట్రంలోని అటవీ భూములను గుర్తించడానికి నిపుణుల కమిటీని రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించాలని, ఆ కమిటీలో క్షేత్రస్థాయి అటవీ అధికారులు, వన్యప్రాణి నిపుణులు, జీవావరణవేత్తలు, ఐటీ, రిమోట్‌ సెన్సింగ్‌ నిపుణులు, సర్వే ఏజెన్సీలు ఉండాలని పేర్కొంది.


కోర్టు ఆదేశాల ప్రకారం అటవీ ప్రాంతాల్లా ఉన్నవాటిని ఈ కమిటీ గుర్తించాలని, ప్రైవేటు భూముల కంటే ప్రభుత్వ భూములను అటవీ ప్రాంతాలుగా గుర్తించే విషయంలో కమిటీ మరింత కఠినంగా ఉండాలని సిఫారసు చేసింది. రాజ్యాంగంలోని 48ఎ, 21 ప్రకరణల ప్రకారం ప్రభుత్వంపై సదరు బాధ్యత ఉంటుందని తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో అటవీ భూముల్లాంటివి ఎక్కువగానే ఉంటాయని, పట్టణ ప్రాంతాల్లో అక్కడక్కడా మాత్రమే ఉంటాయని, డీమ్డ్‌ ఫారె్‌స్టగా ఏ భూమిని గుర్తించాలన్న విషయంపై నిపుణుల కమిటీ ఈ వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలని తెలిపింది. వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ఉన్నతస్థాయి కమిటీని వేయాలని సిఫారసు చేసింది. ఇందులో పీసీసీఎఫ్‌, సీసీఎల్‌ఏ, న్యాయ నిపుణులు, పర్యావరణవేత్తలు ఉండాలని సూచించింది. ప్రభుత్వ, సంస్థలకు చెందిన భూములను అటవీ ప్రాంతాలుగా గుర్తించేందుకు ఎలాంటి పద్ధతి అనుసరించాలన్న దానిపై ఈ కమిటీ పని చేయాలని సిఫారసు చేసింది. అలాగే, సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా నెరవేర్చేలా ఈ కమిటీ పర్యవేక్షించాలని సూచించింది. సీఈసీ సూచనల మేరకు కంచ గచ్చబౌలిలో తొలగించిన చెట్ల పరిమాణాన్ని నిర్ధారించేందుకు ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియాకు అయిన రూ.14.52 లక్షల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించాలని, ఆ మొత్తాన్ని ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియాకు చెల్లించాలని సూచించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

Rahul Gandhi: రాహుల్‌పై చర్యలకు రంగం సిద్ధం..

Abhinandan Vardhaman: అభినందన్ వర్థమాన్‌‌ను భారత్‌కి పాక్ ఆర్మీ అప్పగించిన తర్వాత ఏమైందంటే..

Supreme Court: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్‌కు చుక్కెదురు

For Telangana News And Telugu News

Updated Date - May 16 , 2025 | 04:18 AM