Share News

Zoomcar: కంటైనర్‌లో జూమ్‌ కార్లు

ABN , Publish Date - Jan 31 , 2025 | 04:21 AM

జూమ్‌కార్‌ యాప్‌ ద్వారా హైదరాబాద్‌లో కారు అద్దెకు తీసుకుని... అపహరించి కంటైనర్‌లో చెన్నై తరలిస్తూ పట్టుబడ్డాడో వ్యక్తి. పోలీసులు జీపీఎస్‌ సాయంతో ప్రకాశం జిల్లాలో కంటైనర్‌ను, అందులోని మూడు కార్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

Zoomcar: కంటైనర్‌లో జూమ్‌ కార్లు

  • అద్దె పేరుతో హైదరాబాద్‌లో అపహరణ

  • కంటైనర్‌లో చైన్నెకు తరలింపు

  • జీపీఎ్‌సతో గుర్తించి ఏపీలోని బిట్రగుంట వద్ద పోలీసుల స్వాధీనం

సింగరాయకొండ, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): జూమ్‌కార్‌ యాప్‌ ద్వారా హైదరాబాద్‌లో కారు అద్దెకు తీసుకుని... అపహరించి కంటైనర్‌లో చెన్నై తరలిస్తూ పట్టుబడ్డాడో వ్యక్తి. పోలీసులు జీపీఎస్‌ సాయంతో ప్రకాశం జిల్లాలో కంటైనర్‌ను, అందులోని మూడు కార్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో చిట్టిప్రోలు ఉత్తేజ్‌ జూమ్‌ యాప్‌ ద్వారా కార్లను రోజువారీ అద్దెకు ఇస్తుంటాడు. గులాం మహమ్మద్‌ రావత్‌ అనే వ్యక్తి కారును రోజుకు రూ.2 వేల చొప్పున అద్దెకు తీసుకున్నాడు. తరువాత ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. అనుమానం రావడంతో ఉత్తేజ్‌ హైదరాబాద్‌లో స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో కారు ప్రకాశం జిల్లాలో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌కు సమాచారం ఇచ్చారు. జీపీఎస్‌ ఆధారంగా టంగుటూరు టోల్‌ప్లాజా సమీపంలో కారు ఉన్నట్టు గుర్తించారు.


ఆయన సింగరాయకొండ సీఐ చావా హజరత్తయ్యను, హైవే మొబైల్‌ పోలీసులను అప్రమత్తం చేయడంతో వారు వెంటనే టోల్‌ప్లాజా వద్ద వాహనాలను జల్లెడ పట్టారు. కానీ కారు మాత్రం కనపడలేదు. మరోసారి సాంకేతిక పరిజ్ఞానంతో లొకేషన్‌ గుర్తించిగా అప్పటికే టోల్‌ప్లాజా దాటినట్లు గుర్తించారు. పోలీసులు లొకేషన్‌ను ట్రాక్‌ చేస్తూ వాహనాల్లో వెంబడించారు. బిట్రగుంట ఫ్లైవోవర్‌ వద్దకు వెళ్లేసరికి కారు అక్కడే ఉన్నట్టు చూపుతున్నా రహదారిపై మాత్రం కనిపించలేదు. జీపీఎస్‌ చూపుతున్న లొకేషన్‌లో కంటైనర్‌ ఉండటంతో పోలీసులు దాన్ని ఆపారు. కంటైనర్‌ డోర్లు తీసి చూసి ఆశ్చర్యపోయారు. అందులో నంబర్‌ ప్లేట్లు మార్చిన థార్‌ వాహనంతో పాటు మరో రెండు కార్లు కూడా ఉన్నాయి. మూడు కార్లను, కంటైనర్‌ను సర్కిల్‌ కార్యాలయానికి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ హజరత్తయ్య తెలిపారు.

Updated Date - Jan 31 , 2025 | 04:21 AM