Share News

Women in Telangana Police: పోలీసుల్లో మహిళల సంఖ్య చాలా తక్కువ

ABN , Publish Date - Aug 24 , 2025 | 03:39 AM

పోలీసు శాఖలో పని చేసే మహిళలు జాతీయ స్థాయిలో 12.32 శాతం ఉంటే, తెలంగాణలో 8.6 శాతం మాత్రమే ఉన్నారని ఇటీవల జరిగిన మహిళా పోలీసుల సదస్సు పేర్కొంది...

Women in Telangana Police: పోలీసుల్లో మహిళల సంఖ్య చాలా తక్కువ

  • నియామకాల్లో 33 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలి

  • మహిళా పోలీసు సదస్సులో కీలక తీర్మానాలు

హైదరాబాద్‌, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): పోలీసు శాఖలో పని చేసే మహిళలు జాతీయ స్థాయిలో 12.32 శాతం ఉంటే, తెలంగాణలో 8.6 శాతం మాత్రమే ఉన్నారని ఇటీవల జరిగిన మహిళా పోలీసుల సదస్సు పేర్కొంది. పోలీసు నియామకాల్లో కనీసం 33 శాతం పోస్టులను మహిళలతో భర్తీ చేయాలని ప్రభుత్వానికి సూచించింది. తెలంగాణలో తొలిసారి కానిస్టేబుల్‌ నుంచి సీనియర్‌ ఐపీఎస్‌ వరకు పని చేస్తున్న 400 మంది మహిళలు తెలంగాణ పోలీసు అకాడమీలో ఈ నెల 21, 22 తేదీల్లో జరిగిన సదస్సులో పాల్గొన్నారు. ఇందులో ఐదు అంశాలపై సమీక్ష నిర్వహించి, ఆ తీర్మానాలను ప్రభుత్వానికి పంపడానికి ఉన్నతాధికారులు సన్నద్ధమయ్యారు. ‘‘పోలీసు శాఖలోని పని భారం మహిళలపై ప్రభావం చూపుతోంది. అందువల్ల షిఫ్టు పద్ధతి అమలు చేయాలి. చాలా పోలీసు స్టేషన్లలో మహిళలకు తగిన రెస్ట్‌ రూంలు, దుస్తులు మార్చుకునే వసతి, విశ్రాంతి గదులు లేవు. పదోన్నతులు, పోస్టింగ్‌ల విషయంలో మహిళలు లింగ వివక్షకు గురవుతున్నారు. ప్రతి యూనిట్‌ లేదా జోన్‌లో కనీసం ఒక మహిళను స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌గా నియమించాలి. మహిళా పోలీసు స్టేషన్లలో నిర్దిష్ట శాతం మహిళా ఎస్‌హెచ్‌వోలు ఉండాలి. మహిళా సిబ్బందికి అన్ని రకాల కేసుల దర్యాప్తు అప్పగించాలి. సైబర్‌ క్రైం, నార్కోటిక్స్‌ విభాగాల్లో శిక్షణ ఇప్పించాలి. మహిళా సబ్‌ ఇన్స్‌పెక్టర్‌, మహిళా కానిస్టేబుల్‌ అని పిలవడం ఆపేసి అందరినీ సమానంగా చూడాలి’’ అని సదస్సులో తీర్మానించారు. లింగ వివక్ష, పని ప్రదేశంలో వేధింపులు, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై సదస్సులో సుదీర్ఘ చర్చ జరిగిందని అకాడమీ డైరెక్టర్‌ అభిలాష బిస్త్‌ ఒక ప్రకటనలో తెలిపారు.


ఇవి కూడా చదవండి..

నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు

అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్

For More National News And Telugu News

Updated Date - Aug 24 , 2025 | 03:39 AM