TG Cabinet: బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందే
ABN , Publish Date - Aug 05 , 2025 | 03:44 AM
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు సంబంఽధించి ఘోష్ కమిషన్ సిఫారసుల మేరకు బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందేనని క్యాబినెట్ సమావేశంలో మంత్రులు పట్టుబట్టారు.
ఈ విషయంలో అస్సలు వెనక్కి వెళ్లొద్దు
క్యాబినెట్ భేటీలో మంత్రుల స్పష్టీకరణ
హైదరాబాద్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు సంబంధించి ఘోష్ కమిషన్ సిఫారసుల మేరకు బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందేనని క్యాబినెట్ సమావేశంలో మంత్రులు పట్టుబట్టారు. దీనిపై ఏమాత్రం వెనక్కి వెళ్లొద్దని సీఎం రేవంత్ రెడ్డికి స్పష్టం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చించేందుకు సోమవారం రాష్ట్ర మంత్రివర్గం సచివాలయంలో సమావేశమైంది. కమిషన్ నివేదిక, సిఫారసులపై ఎలా ముందుకెళ్దామనే అంశంపై సుదీర్ఘంగా చర్చించింది. ఈ సందర్భంగా మంత్రుల అభిప్రాయాలను సీఎం రేవంత్ అడిగారు. దాంతో, కాళేశ్వరం వ్యవహారంపై కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని మంత్రులు చెప్పినట్టు సమాచారం. అయితే, ఈ విషయంలో రాజకీయంగా ఎటువంటి కక్షసాధింపు చర్యలకు వెళ్లకూడదని క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలని మంత్రిమండలిలో అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలని, అక్కడే మరింత చర్చ పెట్టాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ 665 పేజీల నివేదికను అందించి, అనంతరం చర్చ పెట్టాలని, వారి నుంచి అభిప్రాయాలను తీసుకోవాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మరోసారి క్యాబినెట్ సమావేశం నిర్వహించి బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.
ప్రజలకు వాస్తవాలు తెలియాలనే..
కాళేశ్వరం విషయంపై అసెంబ్లీలో చర్చ పెట్టడం ద్వారా ప్రజలకు కూడా అన్ని వివరాలూ తెలుస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. అసెంబ్లీలో చర్చ ద్వారా బీఆర్‌ఎ్‌సతోపాటు బీజేపీ, ఎంఐఎం, సీపీఐ పార్టీల అభిప్రాయం ఏమిటన్నది తెలుస్తుందనే భావన క్యాబినెట్‌లో వ్యక్తమైనట్టు సమాచారం. నివేదికను సభలో పెట్టడం ద్వారా ప్రజలకు అన్ని విషయాలూ తెలుస్తాయని, ప్రజాస్వామ్యంలో వారే న్యాయ నిర్ణేతలు కాబట్టి.. సభ తర్వాత తీసుకోబోయే నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందనే అభిప్రాయం క్యాబినెట్‌లో వ్యక్తమైనట్టు సమాచారం.
క్యాబినెట్‌లో ‘ఏఐ’ వీడియో
కాళేశ్వరంపై జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కూడా పాలుపంచుకుంది. ఈ మేరకు ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో ఉన్న వివరాలను ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నట్టుగా ఏఐ ఆధారంగా వీడియో రూపొందించారు. దానిని క్యాబినెట్‌లో ప్రదర్శించారు. ఒక మహిళ, ఒక పురుషుడు ఎదురెదురుగా ఉండి మాట్లాడుకున్న విధంగానే దీనిని రూపొందించారు. కాగా, నివేదికను మంత్రి ఉత్తమ్ ఇంగ్లి్‌షలో, సీఎస్ రామకృష్ణారావు తెలుగులో వివరించినట్టు తెలిసింది.
15 తర్వాత 3-4 రోజులు సభాపర్వం
జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక, దాని ఆధారంగా బాధ్యులపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఆగస్టు 15 తర్వాత అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది. మూడు, నాలుగు రోజులు సభను నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. నివేదికను సభలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో సభ్యులకు వివరించే అవకాశం ఉందని తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరం నివేదికపై ఆరోపణలు.. బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం
Read latest Telangana News And Telugu News