Share News

Telangana: సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు..

ABN , Publish Date - Jan 07 , 2025 | 09:14 PM

సీఎం రేవంత్ రెడ్డి‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి మగాడైతే.. తన జూబ్లీహిల్స్‌ ప్యాలెస్‌లో లైవ్ డిబేట్‌కు సిద్ధమవ్వాలని కేటీఆర్ సవాల్ విసిరారు.

Telangana: సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు..
KTR vs CM Revanth Reddy

హైదరాబాద్, జనవరి 07: సీఎం రేవంత్ రెడ్డి‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి మగాడైతే.. తన జూబ్లీహిల్స్‌ ప్యాలెస్‌లో లైవ్ డిబేట్‌కు సిద్ధమవ్వాలని కేటీఆర్ సవాల్ విసిరారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఒక్క పైసా కూడా అవినీతి జరుగలేదని కేటీఆర్ మరోసారి ఉద్ఘాటించారు. ఏ విచారణను ఎదుర్కోవటానికైనా తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఇది ఆరంభం మాత్రమేనని.. అసలు సినిమా ముందుందని అన్నారు. కాంట్రాక్టర్ మంత్రి పొంగులేటి.. బ్రోకర్ ముఖ్యమంత్రి రేవంత్.. అంటూ పరుష వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు కేటీఆర్. కొత్తగా మంత్రి అయిన పొంగులేటి ఎగిరెగిరి పడుతున్నాడంటూ చురకలంటించారు. మంత్రి పొంగులేటి ఎవరెవరి భూములు గుంజుకుంటున్నాడో అన్నీ బయటకు వస్తాయని హెచ్చరించారు. సీఎం రేవంత్ బ్రోమర్ కాబట్టే.. ఆయనకు అందరూ అవినీతి పరులుగా కన్పిస్తున్నారంటూ విమర్శించారు. సీఎం రేవంత్ పుట్టుకతో వచ్చిన బుద్ది పోవట్లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


న్యాయవాదుల సమక్షంలో విచారణ జరపాలని హైకోర్టును ఆశ్రయిస్తానని కేటీఆర్ తెలిపారు. రాజ్యాంగపరంగా చట్టపరంగా రక్షణ కల్పించాలని కోరితే తప్పేంటి? అని మాజీ మంత్రి ప్రశ్నించారు. జనవరి 9న ఏసీబీ, 16న ఈడీ విచారణకు సహకరిస్తానని అన్నారు. రేవంత్ ప్రాధాన్యత ఫార్ములా అయితే.. మా ప్రాధాన్యత ఫార్మర్స్ అని వ్యాఖ్యానించారు. రైతుభరోసా డైవర్షన్ కోసమే అక్రమ కేసులు పెట్టారని కేటీఆర్ ఆరోపించారు. ఆరు గ్యారంటీలు అమలు చేసేవరకు రేవంత్‌ను వదలిపెట్టేదే లేదన్నారు. మంత్రులు న్యాయమూర్తులు అయిపోయి తీర్పులు చెప్తున్నారని విమర్శించారు. ఈ కార్ రేసులో అరపైసా కూడా అవినీతి జరగలేదని మరోసారి ఉద్ఘాటించారు కేటీఆర్. ప్రపంచంలో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దానని అన్నారు. తనపై పెట్టిన కేసు అక్రమమని.. రాజకీయ కక్ష సాధింపు కేసు అని ఆరోపించారాయన.


ఆ రెండు పార్టీలు ఒక్కటే..

బీజేపీ, కాంగ్రెస్ వేర్వేరు కాదని.. కాంగ్రెస్‌కు రక్షణ కవచంగా బీజేపీ పనిచేస్తుందని కేటీఆర్ విమర్శించారు. తనపై నమోదైన కేసుపై కాంగ్రెస్ కంటే బీజేపీ వాళ్లకే తొందర ఎక్కువ కనిపిస్తోందన్నారు. ఎలక్ట్రోరల్ బాండ్స్ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైసీపీకి కూడా ఇచ్చారని కేటీఆర్ చెప్పారు. మంత్రి‌ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి క్విడ్ ప్రోకో అర్థం కూడా తెల్వదని విమర్శించారు. కొండగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రాఘవా ఇంజనీరింగ్, మెగా ఇంజనీరింగ్ పంచుకున్నారని కేటీఆర్ చెప్పారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రేవంత్ సునకానందం పొందుతున్నారని విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన హక్కును ఉపయోగించుకుంటే తప్పేంటి? అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని గౌరవించి ఏసీబీ విచారణకు వెళితే.. విచారణ చేయలేదన్నారు. హైకోర్టు క్వాష్‌ను మాత్రమే కొట్టేసిందని.. తాను తప్పు చేసినట్లు చెప్పలేదన్నారు. కాంగ్రెస్ నేతలు సన్నాసులు.. దొంగలు.. అంటూ ఘాటైన వ్యాఖ్యలతో కేటీఆర్ విరుచుకుపడ్డారు. కేసులను న్యాయస్థానాల్లోనే ఎదుర్కొంటానని స్పష్టం చేశారాయన. ఫార్ములా ఈ రేసుపై అసెంబ్లీలో చర్చ పెట్టమంటే సీఎం రేవంత్ పారిపోయాడన్నారు. అంతిమంగా న్యాయమే గెలుస్తుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Updated Date - Jan 07 , 2025 | 09:45 PM