We Havent Changed Party: మేం పార్టీ మారలేదు
ABN , Publish Date - Aug 24 , 2025 | 02:52 AM
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అనుసరించి స్పీకర్ ప్రసాద్‌కుమార్ జారీ చేసిన నోటీసులకు ఎమ్మెల్యేలు ఏమని సమాధానం ఇస్తారు..
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నాం
అసెంబ్లీ రికార్డుల్లోనూ అలాగే ఉంది
నోటీసులకు వివరణ ఇవ్వనున్న ఎమ్మెల్యేలు!
స్పీకర్ ఢిల్లీ నుంచి వచ్చాక మిగిలిన వారికి నోటీస్
పార్టీ మారలేదని కృష్ణమోహన్‌రెడ్డి పునరుద్ఘాటన
హైదరాబాద్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అనుసరించి స్పీకర్ ప్రసాద్‌కుమార్ జారీ చేసిన నోటీసులకు ఎమ్మెల్యేలు ఏమని సమాధానం ఇస్తారు? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ప్రధానంగా ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది. బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రె్‌సలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి ఉపక్రమించిన స్పీకర్ ప్రసాద్‌కుమార్.. ఐదుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆలిండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లిన స్పీకర్.. మంగళవారం తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన వచ్చాక మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలకూ నోటీసులు జారీ చేయనున్నట్లు అసెంబ్లీ వర్గాల సమాచారం. దీంతో నోటీసులు అందుకున్న, అందుకోనున్న ఎమ్మెల్యేలు ఈ గండం నుంచి ఎలా గట్టెక్కుతారన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. తాము పార్టీ మారలేదని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్‌రెడ్డిని కలిశామని పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఆయా ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న నేపథ్యంలో స్పీకర్ వద్ద జరిగే విచారణలో ఏమని సమాధానం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తాము పార్టీ మారలేదని, అసెంబ్లీ రికార్డుల్లోనూ బీఆర్‌ఎస్ సభ్యులుగానే కొనసాగుతున్నామని వివరణ ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. కానీ, బీఆర్‌ఎస్ నాయకత్వం ఏ విషయంలోనూ తమను కలుపుకొనిపోవడంలేదని, ఈ నేపథ్యంలో తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని విచారణ సందర్భంగా స్పీకర్‌కు విజ్ఞప్తి చేసే ఆలోచన కొందరు ఎమ్మెల్యేలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు స్పీకర్‌ను కోరే అవకాశం ఉందా.. అన్నదానిపై వారు న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసిన దానం నాగేందర్.. దీనికి ఏం సమాధానం ఇస్తారన్నదీ ఆసక్తికరంగా మారింది.
బీఆర్‌ఎ్‌సలోనే ఉన్నా: బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
మహబూబ్‌నగర్: తాను పార్టీ మారలేదని, బీఆర్‌ఎ్‌సలోనే కొనసాగుతున్నానని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం మాత్రమే సీఎం రేవంత్‌రెడ్డిని కలిశానని చెప్పారు. శనివారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. స్పీకర్‌ను కలిసి నోటీసులు తీసుకుంటానని, ఆయన నిర్దేశించిన సమయంలోపు న్యాయనిపుణులను సంప్రదించి సమాధానం ఇస్తానన్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు మినహా ఇటు కాంగ్రెస్ కార్యక్రమాల్లో గానీ, అటు బీఆర్‌ఎస్ కార్యక్రమాల్లో గానీ ఆయన పాల్గొనడంలేదు. కాంగ్రెస్ నేతలు తన ఫొటోలను తన అనుమతి లేకుండా ఫ్లెక్సీల్లో వాడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
ఇవి కూడా చదవండి..
నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు
అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్
For More National News And Telugu News