Share News

Top Ranks: ఎప్‌సెట్‌లో అబ్బాయిల హవా

ABN , Publish Date - May 12 , 2025 | 04:13 AM

ఇంజనీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ ఎప్‌సెట్‌-2025లో అబ్బాయిలు సత్తా చాటారు. ఇంజనీరింగ్‌లో టాప్‌-10 ర్యాంకుల్లో అంతా బాలురే నిలిచారు. అగ్రికల్చర్‌, ఫార్మసీలోనూ టాప్‌-10లో తొమ్మిది ర్యాంకులను వారు కైవసం చేసుకున్నారు.

Top Ranks: ఎప్‌సెట్‌లో అబ్బాయిల హవా

  • ఇంజనీరింగ్‌లో టాప్‌-10 ర్యాంకర్లంతా వారే

  • మొదటి మూడు ర్యాంకులూ ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకే

  • టాపర్‌గా భరత్‌చంద్ర.. రామచరణ్‌రెడ్డికి రెండో ర్యాంకు

  • అగ్రికల్చర్‌, ఫార్మసీలోనూ టాప్‌-10లో 9 మంది బాలురే

  • హైదరాబాద్‌ విద్యార్థి సాకేత్‌రెడ్డికి టాప్‌ర్యాంక్‌

  • తెలంగాణ ఎప్‌సెట్‌-2025 ఫలితాల విడుదల

హైదరాబాద్‌, మే 11 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ ఎప్‌సెట్‌-2025లో అబ్బాయిలు సత్తా చాటారు. ఇంజనీరింగ్‌లో టాప్‌-10 ర్యాంకుల్లో అంతా బాలురే నిలిచారు. అగ్రికల్చర్‌, ఫార్మసీలోనూ టాప్‌-10లో తొమ్మిది ర్యాంకులను వారు కైవసం చేసుకున్నారు. ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి తన నివాసం లో ఎప్‌సెట్‌ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షకు 2,07,190 మంది విద్యార్థులు హాజరు కాగా.. 1,51,779 మంది (73.26ు) ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్‌, ఫార్మసీలో 81,198 మంది హాజరు కాగా, 71,309 మంది విద్యార్థులు (87.82ు) అర్హత సాధించారు. ఇంజనీరింగ్‌ విభాగం లో టాప్‌-10 ర్యాంకుల్లో మొదటి మూడు ర్యాంకులూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులకే దక్కాయి. వీరిలో పార్మతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గుణానుపురం గ్రామానికి చెందిన పల్లా భరత్‌చంద్ర 150.05 మార్కులతో టాపర్‌గా నిలిచాడు. నంద్యాల జిల్లా కోనాపురం గ్రామానికి చెందిన ఉడగండ్ల రామచరణ్‌రెడ్డి 148.28 మార్కులతో రెండో ర్యాంకు సాధించాడు. ఇతడు రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండ లం మాదాపూర్‌లో ఇంటర్మీడియట్‌ చదివాడు. కాగా, విజయనగరం జిల్లాకు చెందిన పమ్మిన హేమసాయి సూర్య కార్తీక్‌ 147.08 మార్కులతో మూడోస్థానం పొందాడు. కాగా, ఫార్మసీ, అగ్రికల్చర్‌లో హైదరాబాద్‌కు చెందిన సాకేత్‌రెడ్డి 141.68 మార్కులతో టాపర్‌గా నిలవగా, కరీంనగర్‌ విద్యార్థి సబ్బాని లలిత్‌ వరేణ్య 140.47 మార్కులతో రెండో ర్యాంకు, వరంగల్‌కు చెందిన చాడ అక్షిత్‌ 140 మార్కులతో మూడో ర్యాంకు సాధించారు.


ఉత్తీర్ణత శాతంలో అమ్మాయిలదే పైచేయి

ఎప్‌సెట్‌లో రెండు విభాగాల్లోనూ అమ్మాయిల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా నమోదైంది. ఇంజనీరింగ్‌ విభాగంలో బాలురు 72.79%, బాలికలు 73.88% మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక అగ్రికల్చర్‌, ఫార్మసీలో బాలురు 86.29%, బాలికలు 88.32ు ఉత్తీర్ణత సాధించారు. కాగా, మొత్తం ఫలితాల్లో గత మూడేళ్లతో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం తగ్గింది. 2024లో ఇంజనీరింగ్‌లో ఉత్తీర్ణత 74.98 శాతం నమోదు కాగా, 2023లో 80.34%, 2022లో 80.42% ఉంది. అగ్రికల్చర్‌, ఫార్మసీలో 2024లో 89.67%, 2023లో 86.31%, 2022లో 88.34 శాతం నమోదైంది.

సత్తా చాటిన గురుకుల విద్యార్థులు

1 copy.jpg

ఎప్‌సెట్‌ ఫలితాల్లో గురుకుల విద్యాసంస్థల విద్యార్థులు సత్తా చాటారు. సాంఘిక సంక్షేమ గురుకులాల నుంచి ఇంజనీరింగ్‌ విభాగంలో 953 మంది విద్యార్థులు పరీక్షకు హాజరై అందరూ ఉత్తీర్ణత సాధించారని గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి ఒక ప్రకటనలో తెలిపారు. అగ్రికల్చర్‌, ఫార్మా విభాగంలో 859 మంది విద్యార్థులు హాజరు కాగా, 857 మంది ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. ఇంజనీరింగ్‌ విభాగంలో నార్సింగ్‌ కాలేజీకి చెందిన బి.ప్రవళిక రాష్ట్రస్థాయిలో 1091 ర్యాంకు, ఫలక్‌నుమా కాలేజీకి చెందిన చైతన్య 1769 ర్యాంకు సాధించారని వెల్లడించారు. ఐదువేల లోపు 13 మంది, 10 వేలలోపు ర్యాంకులు 45 మంది, 20 వేలలోపు ర్యాంకులు 136 మంది విద్యార్థులు సాధించారని పేర్కొన్నారు. అగ్రికల్చర్‌, ఫార్మా విభాగంలో 1000లోపు ర్యాంకులు 19 మంది, 5వేలలోపు 67 మంది, 10 వేలలోపు 183 మంది, 20 వేలలోపు ర్యాంకులు 387 మంది సాధించినట్లు వివరించారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు, అధ్యాపకులకు గురుకుల కార్యదర్శి అభినందనలు తెలిపారు. ఇక గిరిజన గురుకుల విద్యాసంస్థల నుంచి 750 మంది ఎప్‌సెట్‌కు హాజరుకాగా.. 24మంది విద్యార్థులకు 5వేల లోపు, 34మంది 10 వేల లోపు ర్యాంకులు సాధించారని ఎస్టీ గురుకుల సెక్రటరీ సీతాలక్ష్మి తెలిపారు. అగ్రికల్చర్‌ విభాగంలో విద్యావతి యషశ్విని 649 (వరంగల్‌), కేతావత్‌ అఖిల 901 (దేవరకొండ) ర్యాంకు సాధించినట్లు పేర్కొన్నారు.


టాపర్ల చూపంతా జాతీయ విద్యాసంస్థల వైపే!

హైదరాబాద్‌ సిటీ, మే 11 (ఆంధ్రజ్యోతి): ఎప్‌సెట్‌ ఫలితాల్లో టాప్‌ ర్యాంకులు సాధించిన వారిలో అత్యధిక మంది గ్రేటర్‌ హైదరాబాద్‌కు చెందినవారే ఉన్నారు. ఇంజనీరింగ్‌ విభాగంలో 8 మంది, అగ్రికల్చర్‌, ఫార్మసీలో ఏడుగురు నగరానికి చెందిన విద్యార్థులు టాప్‌-10 ర్యాంకుల్లో నిలిచారు. అయితే.. వీరిలో ఎవరూ రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ విద్యాసంస్థల్లో చదివేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇంజనీరింగ్‌ విభాగంలో టాపర్లంతా జాతీయ విద్యాసంస్థలైన ఐఐటీలు, ఐఐఐటీల వైపు చూస్తుండగా, అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగంలో టాపర్లుగా నిలిచినవారంతా డాక్టర్లుగా స్థిరపడాలనే అభిప్రాయాలతో మెడికల్‌ కాలేజీల వైపు చూస్తున్నారు.

విజయనగరం విద్యార్థికి మూడో ర్యాంకు

ఎప్‌సెట్‌లో ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన బి.హేమసాయి సూర్యకార్తీక్‌ మూడోర్యాంకు సాధించాడు. విజయనగరంలోని అయ్యన్నపేటకు చెందిన కార్తీక్‌ జేఈఈ మెయిన్స్‌లో ఆలిండియాలో 75 ర్యాంకు పొందాడు.


ఇంజనీరింగ్‌ టాప్‌-10 ర్యాంకర్లు, మార్కులు

1. పల్లా భరత్‌చంద్ర - 150.05

2. ఉడగండ్ల రామచరణ్‌రెడ్డి - 148.28

3. పమ్మిన హేమసాయి సూర్య కార్తీక్‌ - 147.08

4. లక్ష్మీభార్గవ్‌ మెండె - 146.15

5. మంత్రిరెడ్డి వెంకటగణేష్‌ రాయల్‌ - 144.05

6. సుంకర సాయిరిశాంత్‌ రెడ్డి - 143.72

7. రుష్మిత్‌ బండారి - 142.57

8. బనిబ్రత మాజీ - 141.08

9. కొత్త ధను్‌షరెడ్డి - 140.24

10. కొమ్మ శ్రీకార్తీక్‌ - 138.25

అగ్రి, ఫార్మసీ టాప్‌-10 ర్యాంకర్లు, మార్కులు

1. సాకేత్‌రెడ్డి పెద్దక్కగారి - 141.68

2. సబ్బాని లలిత్‌ వరెణ్య - 140.47

3. చాడ అక్షిత్‌ - 140

4. పెద్దింటి రాచల శాయినంద్‌ - 138.82

5. బ్రహ్మణి రెండ్ల - 138.71

6. గుమ్మడిదల తేజస్‌ - 137.82

7. కొలన్‌ అఖిరానంద్‌ రెడ్డి - 137.63

8. భానుప్రకా్‌షరెడ్డి సాధు - 136.70

9. అర్జా శామ్యూల్‌ సాత్విక్‌ - 136.67

10. శశికిరణ్‌రెడ్డి ఎద్దుల - 136.49


డాక్టర్‌ను అవుతా

ఎప్‌సెట్‌ ఫలితాల్లో మొదటి ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. అయితే.. నీట్‌ పరీక్షలో మంచి ర్యాంకుతో ఎంబీబీఎస్‌ చదివి డాక్టర్‌ను కావాలనేది నా కల. మా తల్లి దండ్రులు శ్రీకాంత్‌రెడ్డి, సుదీషణ.. ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు. - సాకేత్‌రెడ్డి, అగ్రికల్చర్‌, ఫార్మసీ టాప్‌ ర్యాంకర్‌

‘మన్యం’ విద్యారికి టాప్‌ ర్యాంక్‌

జియ్యమ్మవలస: తెలంగాణ ఎప్‌సెట్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో ఏపీలోనిపార్వతీపురం మన్యం జిల్లా విద్యార్థి సత్తా చాటాడు. కొమరాడ మండలం గుణానుపురం గ్రామానికి చెందిన పల్లా భరత్‌చంద్ర మొదటి ర్యాంకు సాధించాడు. మొత్తంగా 99.99 శాతం మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచాడు. జేఈఈ మెయిన్స్‌ 2025లో భరత్‌చంద్ర ఆలిండియా 121వ ర్యాంకు, ఆలిండియా ఓబీసీ కోటాలో 17వ ర్యాంకు సాధించాడు. భరత్‌చంద్ర తండ్రి రామకృష్ణ విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో ఉన్న మెరైన్‌ పోలీ్‌సస్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. తల్లి దమయంతి శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని బెలమం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. మదర్స్‌డే రోజున తన కుమారుడు మంచి బహుమతి ఇచ్చాడంటూ భరత్‌చంద్ర తల్లి దమయంతి ‘ఆంధ్రజ్యోతి’తో సంతోషాన్ని పంచుకున్నారు.


ముంబై ఐఐటీలో చదువుతా ఇంజనీరింగ్‌ రెండో ర్యాంకర్‌ రామచరణ్‌రెడ్డి

హైదరాబాద్‌ సిటీ: ఎప్‌సెట్‌లో రెండో ర్యాంకు సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని రామచరణ్‌రెడ్డి అన్నాడు. అయితే ముంబై ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చదవటమే తన తదుపరి లక్ష్యమని చెప్పాడు. జేఈఈ మెయిన్స్‌లో 51వ ర్యాంకు సాధించిన రామచరణ్‌ రెడ్డి ప్రస్తుతం అడ్వాన్స్‌ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నాడు. రామచరణ్‌రెడ్డి స్వస్థలం నంద్యాల జిల్లా కోనాపురం గ్రామం. కాగా, హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఇంటర్మీడియట్‌ చదివాడు. రామచరణ్‌ తండ్రి కృష్ణారెడ్డి నంద్యాలకు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో గణిత ఉపాధ్యాయడిగా పనిచేస్తుండగా, తల్లి సచివాలయం ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Drunk Driving Incident: మద్యం తాగుతూ ఫుల్ స్పీడ్‌తో రైడ్.. వీడియో వైరల్

Donald Trump: విదేశాల్లో నిర్మించిన చిత్రాలపై 100% సుంకం..ఆ జైలు తిరిగి ప్రారంభిస్తాం

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 12 , 2025 | 06:10 AM