Share News

BLN Reddy: నేను నిమిత్తమాత్రుడినే!

ABN , Publish Date - Jan 09 , 2025 | 04:16 AM

ఫార్ములా-ఈ కారు రేసు కేసుకు సంబంధించి ఫార్ములా-ఈ ఆపరేషన్స్‌ (ఎఫ్‌ఈవో)కు నిధుల చెల్లింపు విషయంలో తాను నిమిత్తమాత్రుడినేనని హెచ్‌ఏండీఏ మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) అధికారులతో అన్నట్లు తెలిసింది.

BLN Reddy: నేను నిమిత్తమాత్రుడినే!

  • కేటీఆర్‌, అర్వింద్‌ కుమార్‌ చెప్పినట్లు చేశాను

  • ఈడీ విచారణలో బీఎల్‌ఎన్‌ రెడ్డి వెల్లడి

  • కేటీఆర్‌, అర్వింద్‌కుమార్‌ చెప్పినట్లు చేశాను

హైదరాబాద్‌, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా-ఈ కారు రేసు కేసుకు సంబంధించి ఫార్ములా-ఈ ఆపరేషన్స్‌ (ఎఫ్‌ఈవో)కు నిధుల చెల్లింపు విషయంలో తాను నిమిత్తమాత్రుడినేనని హెచ్‌ఏండీఏ మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) అధికారులతో అన్నట్లు తెలిసింది. ఈ విషయంలో అంతా నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌, ప్రత్యేక కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ చెప్పినట్లే నడచుకున్నానని చెప్పినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి బీఎల్‌ఎన్‌ రెడ్డి బుధవారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయనను సుదీర్ఘంగా ప్రశ్నించిన ఈడీ అధికారులు, ‘‘హెచ్‌ఏండీఏలో చెక్‌పవర్‌ ఉన్న మీరు.. ఎవరి ఆదేశాల మేరకు ఎఫ్‌ఈవోకు సంబంధించిన రెండు ఇన్వాయి్‌సలకు రూ.46 కోట్లు విదేశీ కరెన్సీలో క్లియర్‌ చేశారు? రూ.10 కోట్లు దాటితే ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉండగా.. ఎందుకు తీసుకోలేదు? విదేశీ కరెన్సీలో చెల్లింపులు జరిపే క్రమంలో రిజర్వ్‌ బ్యాంక్‌ అనుమతి తీసుకున్నారా?’’ అంటూ వరుస ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.


వీటికి బీఎల్‌ఎన్‌ రెడ్డి సమాధానమిస్తూ.. నాటి పురపాలకశాఖ ప్రత్యేక కార్యదర్శి, హెచ్‌ఎండీఏ చైర్మన్‌ ఆదేశాల మేరకే తాను క్లియర్‌ చేశానని చెప్పినట్లు సమాచారం. తనకు వచ్చిన రాతపూర్వక ఆదేశాలు, వాట్సాప్‌ మెసేజ్‌లకు సంబంధించిన వివరాలను ఈడీ అధికారులకు సమర్పించినట్లు తెలిసింది. దీంతో.. హెచ్‌ఎండీఏలో బిల్లుల చెల్లింపు విధానం ఎలా ఉంటుంది? గతంలో ఇంకెవరికైనా విదేశీ కరెన్సీలో చెల్లింపులు చేశారా? చేస్తే ఆ వివరాలేంటి? బ్యాంకు అధికారులకు మీరు ఏ విధమైన క్లియరెన్స్‌ మెసేజ్‌ ఇచ్చారు? అనే విషయాలపై కూడా ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కాగా, విచారణలో బీఎల్‌ఎన్‌ రెడ్డి చెప్పిన విషయాల ఆధారంగా.. గురువారం విచారణకు హాజరవుతున్న నాటి పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించవచ్చని సమాచారం.

Updated Date - Jan 09 , 2025 | 04:16 AM