BJP Telangana President: రాష్ట్ర సర్కారు వైఫల్యాలను ఎండగట్టండి
ABN , Publish Date - Jul 23 , 2025 | 05:19 AM
తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని, నాయకులందరినీ ..
నాయకులందరినీ కలుపుకొని వెళ్లండి
కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
రాంచందర్‌రావుకు జేపీ నడ్డా దిశానిర్దేశం
న్యూఢిల్లీ, హైదరాబాద్, జూలై 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని, నాయకులందరినీ కలుపుకుని వెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎన్.రాంచందర్‌రావుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని, ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఢిల్లీకి వచ్చిన రాంచందర్‌రావు మంగళవారం జేపీ నడ్డాను పార్లమెంటులోని ఆయన కార్యాలయంలో కలుసుకున్నారు. ఆయన వెంట కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్ ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, కేంద్ర పథకాల అమలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయాలని, పార్టీ నేతలకు, కార్యకర్తలకు పార్టీ జాతీయ నాయకత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని జేపీ నడ్డా.. రాంచందర్‌రావుకు భరోసానిచ్చారు. కాగా, ఈ భేటీలో రాజాసింగ్ రాజీనామా అంశం, ఈటల రాజేందర్, బండి సంజయ్ పరస్పర విమర్శల అంశాలు చర్చకు వచ్చినట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. జేపీ నడ్డాతో భేటీ అనంతరం కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, బండి సంజయ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, జాతీయ సహ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాశ్, తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ బన్సల్, జాతీయ కార్యదర్శి అర్వింద్ మీనన్‌లతోనూ రాంచందర్‌రావు విడివిడిగా భేటీ అయ్యారు. అమిత్ షాతో రాంచందర్‌రావు భేటీ ఖరారైనా ఇతరత్రా కారణాల వల్ల భేటీ కాలేకపోయారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు
ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి