Share News

BJP: 22 మందితో బీజేపీ రాష్ట్ర కమిటీ

ABN , Publish Date - Sep 09 , 2025 | 04:26 AM

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీని ఎట్టకేలకు ప్రకటించారు. రాష్ట్ర బీజేపీలో కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించారు.

BJP: 22 మందితో బీజేపీ రాష్ట్ర కమిటీ

  • యువతకు, కొత్తవారికి పెద్దపీట

  • బీసీలు, మహిళలకు మూడోవంతు

  • వివరాలు ప్రకటించిన రాంచందర్‌రావు

హైదరాబాద్‌, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీని ఎట్టకేలకు ప్రకటించారు. రాష్ట్ర బీజేపీలో కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు సోమవారం 22 మందితో రాష్ట్ర కమిటీని ప్రకటించారు. ఈ కమిటీలో యువతకు పెద్దపీట వేశారు. పదవులు ఆశించిన పలువురు సీనియర్లకు షాక్‌ ఇచ్చారు. పైరవీలకు చెక్‌ పెట్టి, కొత్తవారికి అవకాశం ఇచ్చారు. కొత్త కమిటీలో ఓసీలు 11 మంది, బీసీలు ఏడుగురు, ఎస్సీలు ముగ్గురు, ఎస్టీ ఒకరు ఉన్నారు. (అధ్యక్షుడితో కలిపితే మొత్తం కమిటీ సభ్యుల సంఖ్య 23 కాగా, ఓసీల సంఖ్య 12 అవుతుంది). ఇక కమిటీ కూర్పులో బీసీలకు, మహిళలకు మూడో వంతు పదవులు దక్కాయి. గత కమిటీలో ఉన్నవారిలో ఐదుగురికి మాత్రమే మళ్లీ అవకాశం లభించింది. 8 మంది ఉపాధ్యక్షులు, 8 మంది కార్యదర్శులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, కోశాధికారి, సంయుక్త కోశాధికారి, ముఖ్య అధికార ప్రతినిధితో కలిపి కొత్త కమిటీని ప్రకటించారు. గత కమిటీలో పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న సీనియర్‌ నేత, దివంగత ప్రధాని పీవీ మనవడు ఎన్‌.వి.సుభా్‌షను ముఖ్య అధికార ప్రతినిధిగా నియమించారు. బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి తనయుడు బద్దం మహిపాల్‌రెడ్డిలకు తొలిసారిగా రాష్ట్ర కమిటీలో చోటు దక్కింది. మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్‌ తనయుడు వీరేందర్‌గౌడ్‌ను అనూహ్యంగా ప్రధాన కార్యదర్శి పదవి వరించింది. కాగా, ఐదు మోర్చాలకు కొత్తవారిని నియమించారు. బీజేపీ కొత్త కమిటీలో 10 మంది హైదరాబాద్‌లో స్థిరపడ్డవారే కావడం చర్చనీయాంశమైంది. వీరంతా సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనే నివాసం ఉంటున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. గ్రామీణ ప్రాంత శ్రేణులకు ఆశించిన మేర అవకాశం కల్పించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


బీజేపీ కొత్త కమిటీ ఇలా..

ఉపాధ్యక్షులు: బూర నర్సయ్యగౌడ్‌, కాసం వెంకటేశ్వర్లు యాదవ్‌, భండారి శాంతికుమార్‌, ఎం.జయశ్రీ, కొల్లి మాధవి, జరుప్లావత్‌ గోపి (కళ్యాణ్‌నాయక్‌), రఘునాథరావు, బండ కార్తీకరెడ్డి

ప్రధాన కార్యదర్శులు: ఎన్‌.గౌతంరావు, టి.వీరేందర్‌గౌడ్‌, వేముల అశోక్‌

కార్యదర్శులు: ఒ.శ్రీనివాసరెడ్డి, కొప్పు బాషా, భరత్‌ప్రసాద్‌, బండారు విజయలక్ష్మి, స్రవంతిరెడ్డి, కరణం పరిణీత, బద్దం మహిపాల్‌రెడ్డి, తూటుపల్లి రవికుమార్‌, కోశాధికారి: డి.వాసుదేవ్‌, సంయుక్త కోశాధికారి: విజయ్‌ జైన్‌, ముఖ్య అధికార ప్రతినిధి: ఎన్‌.వి.సుభాష్‌

ఏడు మోర్చాల అధ్యక్షులు..

మహిళా మోర్చా: మేకల శిల్పారెడ్డి, యువమోర్చా: గణేశ్‌ కుందె; కిసాన్‌మోర్చా: బస్వాపురం లక్ష్మీనర్సయ్య, ఎస్సీ మోర్చా: కాంతి కిరణ్‌, ఎస్టీ మోర్చా: నేనావత్‌ రవినాయక్‌, ఓబీసీ మోర్చా: గందమళ్ల ఆనంద్‌గౌడ్‌, మైనారిటీ మోర్చా: సర్దార్‌ జగ్మోహన్‌సింగ్‌


గోషామహల్‌ కార్యకర్తలకు చోటేదీ?

  • బీజేపీపై మండిపడ్డఎమ్మెల్యే రాజాసింగ్‌

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర కొత్త కమిటీపై గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర కమిటీలో గోషామహల్‌ నియోజకవర్గ కార్యకర్తలకు చోటు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ గౌరవాన్ని మూడు సార్లు కాపాడిన వ్యక్తి, గోషామహల్‌ అసెంబ్లీకి చెందిన బీజేపీ కార్యకర్తలకు రాష్ట్ర కమిటీలో పదవి ఇవ్వడానికి ఆసక్తి చూపలేదని విమర్శించారు. ఇంకెన్నాళ్లు అన్యాయం చేస్తారని ప్రశ్నించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఒకే ఒక అసెంబ్లీ సీటును గెలిపించిన గోషామహల్‌ కార్యకర్తలను ఎలా విస్మరిస్తారని నిలదీశారు. ఇది రాష్ట్ర కమిటీలా లేదని, సికింద్రాబాద్‌ పార్లమెంటు కమిటీలా ఉందని ఎద్దేవా చేశారు. కాగా, వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిపిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కుతుందని రాజాసింగ్‌ చెప్పారు. హుస్సేన్‌ సాగర్‌లోకి వచ్చే మురుగు నీటిని మళ్లించాల్సిన అవసరం ఉందని, ఈ విషయంపై సీఎం దృష్టి సారించాలని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వాస్తవాలు చెబితే.. తప్పు పట్టిన బీఆర్ఎస్

ఆలయాల అభివృ‌ద్ధిపై సమీక్ష.. సీఎం కీలక ఆదేశాలు

For More TG News And Telugu News

Updated Date - Sep 09 , 2025 | 04:26 AM