Share News

N Ramchander Rao: బీసీలకు అన్యాయమే.. కాంగ్రెస్‌ సామాజిక న్యాయమా?

ABN , Publish Date - Jul 05 , 2025 | 04:15 AM

ఏడాదిన్నర పాలనలో ఒక్క హామీని కూడా సమర్థంగా అమలు చేయలేకపోయిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘సామాజిక న్యాయ సమరభేరి’ అంటూ తెలంగాణ ప్రజలను మరోసారి మాయ చేయాలని చూస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు.

N Ramchander Rao: బీసీలకు అన్యాయమే.. కాంగ్రెస్‌ సామాజిక న్యాయమా?

  • ‘జై బాపు’ అంటూనే గ్రామ స్వరాజ్యం నిర్వీర్యం

  • ‘జై భీమ్‌’ అని పోడు భూముల్లోకి బుల్డోజర్లు

  • అప్పుడు ఎమర్జెన్సీ.. ఇప్పుడు ‘జై సంవిధాన్‌’

  • ఇదే కాంగ్రెస్‌ సామాజిక న్యాయం

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

  • రాష్ట్ర సారథిగా నేడు బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్‌/సిరిసిల్ల, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ఏడాదిన్నర పాలనలో ఒక్క హామీని కూడా సమర్థంగా అమలు చేయలేకపోయిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘సామాజిక న్యాయ సమరభేరి’ అంటూ తెలంగాణ ప్రజలను మరోసారి మాయ చేయాలని చూస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. ‘‘కులగణన పేరిట బీసీలకు అన్యాయం చేసి, ముస్లింలను బీసీ కోటాలో చేర్చడమే సామాజిక న్యాయమా..’’ అని నిలదీశారు. సామాజిక న్యాయానికి తూట్లు పొడిచేందుకే కాంగ్రెస్‌ పార్టీ ‘సామాజిక న్యాయ సమరభేరి’ సభను నిర్వహించిందన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘జై బాపు.. అని నినాదాలు చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ, గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని నిర్వీర్యం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించకపోగా, గ్రామాభివృద్ధి పనుల బిల్లులు రూ.1,200కోట్లు పెండింగ్‌లో పెట్టింది. ఇది గాంధీ స్ఫూర్తికి విరుద్ధం. జై భీమ్‌.. అని నినదిస్తున్న కాంగ్రెస్‌ లగచర్ల, కొడంగల్‌లో గిరిజనుల భూములను లాక్కొని, పోడు భూముల్లోకి బుల్డోజర్లు పంపింది. ఎస్టీ రైతులపై కేసులు బనాయించి, గురుకులాల మూసివేతతో దుర్మార్గంగా వ్యవహరించింది’’ అని ఆ ప్రకటనలో రాంచందర్‌రావు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘జై సంవిధాన్‌’’ అనే ముందు కాంగ్రెస్‌ పార్టీ తన చరిత్రను గుర్తు చేసుకోవాలని, 1975లో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన పార్టీకి రాజ్యాంగంపై బోధనలు చెప్పే అర్హత లేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు ఆ పార్టీ దోపిడీకి అక్షయపాత్రలుగా మారాయని ఆయన ఆరోపించారు.


బీసీలకు ఏం చేశారని సామాజిక న్యాయ సభ?

కాంగ్రెస్‌ సభపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ కూడా స్పందించారు. ఆ పార్టీది ‘‘సామాజిక అన్యాయ భేరి’’ అన్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా మరిమడ్లలో రూ.5 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘దేశాన్ని యాభై ఏళ్లకు పైగా పాలించిన కాంగ్రెస్‌ ఒక్కసారైనా బీసీని ప్రధానమంత్రిని చేసిందా.. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క బీసీనైనా సీఎం చేసిందా.. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వ క్యాబినెట్‌లో ఎంత మంది బీసీలకు అవకాశం ఇచ్చారు... మరి ఏ ముఖం పెట్టుకొని సామాజిక న్యాయ సమరభేరి సభ నిర్వహించారు’’ అని నిలదీశారు. బీజేపీ.. బీసీని ప్రధాని చేసిందని, దళిత, ఆదివాసీ, మైనారిటీ వర్గాలకు చెందినవారిని రాష్ట్రపతులను చేసిందని సంజయ్‌ అన్నారు. యూరియా కొరతపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కావాలనే కేంద్రాన్ని బదనాం చేస్తున్నాయని సంజయ్‌ ఆరోపించారు. తెలంగాణకు గత సీజన్‌లో 9 లక్షల టన్నుల యూరియా అవసరమైతే కేంద్రం 12 లక్షల టన్నులు ఇచ్చిందని, ఈ సీజన్‌లో కూడా కోరినంత యూరియా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, కానీ గత సీజన్‌లో అదనంగా కేటాయించిన యూరియా ఎటు పోయిందో చెప్పకుండా కేంద్రాన్ని బదనాం చేయడం సరికాదని అన్నారు. కాగా, తన పాపాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్‌ పార్టీ సామాజిక న్యాయ సభను నిర్వహించిందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ అన్నారు.


నేడు బీజేపీ రాష్ట్ర సారథిగా రాంచందర్‌రావు బాధ్యతలు

హైదరాబాద్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్‌.రాంచందర్‌రావు శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 9 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేస్తారు. 10 గంటలకు గన్‌పార్కు అమరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం 11 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు చేపడతారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పదాధికారులు, సీనియర్‌ నాయకులు హాజరుకానున్నారు.


ఇవి కూడా చదవండి

స్టాక్ మార్కెట్‌లో భారీ కుంభకోణం..జేన్ స్ట్రీట్‌పై సెబీ చర్యలు


రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 05 , 2025 | 04:15 AM