Share News

Phone Tapping: ఆ నంబరు అమిత్‌ షాదే!

ABN , Publish Date - Aug 09 , 2025 | 04:28 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ విచారణకు హాజరైన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌.. విచారణాధికారులు ఇచ్చిన ఫోన్‌ నంబర్లు చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిసింది.

Phone Tapping: ఆ నంబరు  అమిత్‌ షాదే!

  • కేంద్ర హోం మంత్రితో మాట్లాడిన మాటలూ వినేశారా?

  • నడ్డా, సంతోష్‌లతో జరిగిన సంభాషణలూ విన్నారు!

  • బండి సంజయ్‌ ముందు ముగ్గురి నంబర్లు ఉంచిన సిట్‌

  • అవాక్కయిన కేంద్ర మంత్రి.. ‘సిట్‌తో తేలదు.. సీబీఐకి

  • ఇస్తేనే కేసు కొలిక్కి’.. సంజయ్‌తో పోలీసు అధికారులు?

హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ విచారణకు హాజరైన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌.. విచారణాధికారులు ఇచ్చిన ఫోన్‌ నంబర్లు చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిసింది. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌.సంతోష్‌తో పలుమార్లు మాట్లాడారు. శుక్రవారం విచారణ సందర్భంగా ఈ ముగ్గురు అగ్రనేతల ఫోన్‌ నంబర్లను సిట్‌ అధికారులు సంజయ్‌ ముందుంచారు. ఆ నంబర్లు ఎవరివని అడగడంతో సంజయ్‌ అవాక్కయినట్లు తెలిసింది. కేంద్ర హోం మంత్రి, పార్టీ అగ్రనేతలతో తాను మాట్లాడిన మాటలు కూడా విన్నట్లు తెలియడంతో దిగ్ర్భాంతికి గురైనట్లు సమాచారం. అలాగే పార్టీకి విరాళాలు అందించినవారి నంబర్లు కూడా వెల్లడించిన సిట్‌ అధికారులు.. వారి ఫోన్లనూ ట్యాప్‌ చేసినట్లు సంజయ్‌కు తెలిపారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. ఫోన్‌ ట్యాపింగ్‌లో కీలకపాత్ర పోషించిన ప్రణీత్‌రావుకు ఒక కోడ్‌ ఇచ్చారని.. దాంతో ఆయన రోజూ సంజయ్‌తోపాటు వ్యక్తిగత సిబ్బంది ఫోన్‌లు ట్యాపింగ్‌ చేసి, ముఖ్యమైన సమాచారాన్ని నాటి ప్రభుత్వ పెద్దలకు తెలిపేవారని విచారణ సందర్భంగా సిట్‌ వెల్లడించినట్లు సమాచారం.

17.jpg


సంజయ్‌ వ్యక్తిగత సిబ్బందినీ..

సిట్‌ అధికారులు తొలుత సంజయ్‌ వ్యక్తిగత సిబ్బందిని కూడా విచారించారు. సుమారు 45 నిమిషాల పాటు వారిని ప్రశ్నించారు. పసునూరు మధు, బోయిన్‌పల్లి ప్రవీణ్‌రావు, పోగుల తిరుపతి కాల్‌ రికార్డింగ్‌ డేటాను వ్యక్తిగతంగా ముందుంచి, ఆయా ఫోన్‌ నంబర్లు కలిగిన నాయకులతో మాట్లాడింది వాస్తవమేనా? అని ప్రశ్నించి, నిర్ధారించుకున్నారు. 2022 ఆగస్టు నుంచి 2023 మే చివరి వరకూ సీడీఆర్‌ను వారి ముందు ఉంచారు. ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగినట్లు అనుమానం వచ్చిందా? అని ప్రశ్నించగా.. వచ్చిందని వారు సమాధానమిచ్చారు. కాగా, సంజయ్‌ వ్యక్తిగత సిబ్బంది కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాపింగ్‌ చేసినట్లు తాజాగా వెల్లడైంది.


సిట్‌తో తేలదు..!

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు సిట్‌తో తేలదని, సీబీఐకి ఇస్తేనే కొలిక్కి వస్తుందని కొంతమంది సీనియర్‌ పోలీసు అధికారులు, న్యాయ నిపుణులు కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి స్పష్టం చేసినట్లు సమాచారం. సిట్‌ విచారణ సందర్భంగా సంజయ్‌ కొందరు సీనియర్‌ పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో సిట్‌ పరిధి, ట్యాపింగ్‌ కేసు తీవ్రతపై చర్చించినట్లు తెలిసింది. ‘టెలికం రెగ్యులేటరీ అథారిటీ నిబంధనలను ఉల్లంఘించి కేసీఆర్‌ ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం నడిపింది. ఇందులో టెలికం రెగ్యులేటరీ అథారిటీని కూడా విచారణకు పిలవాలి. ఇది పూర్తిగా కేంద్రం పరిధిలోని అంశం. ఎస్‌ఐబీ చీఫ్‌గా ఐజీ స్థాయి అధికారి ఉండాలి. కానీ, అప్పటికే పదవీ విరమణ చేసిన ప్రభాకర్‌రావు ఐజీగా కొనసాగుతున్నారని కేంద్ర హోంశాఖకు తప్పుడు సమాచారమిచ్చి ఎస్‌ఐబీ చీఫ్‌గా నియమించారు. ఇది పూర్తిగా నిబంధనల ఉల్లంఘనే’ అని పోలీసు అధికారులు తెలిపినట్లు సమాచారం. మరోవైపు మావోయిస్టుల పేరు చెప్పి రాజకీయ ప్రముఖులు, సినీ తారలు, వ్యాపారుల ఫోన్‌ నంబర్లను ట్యాప్‌ చేసి.. అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని, ఆ లావాదేవీల వివరాలు తెలియాలంటే ఈడీతో విచారణ జరపాలని వారు పేర్కొన్నట్లు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

అవి చూసి షాక్ అయ్యా: బండి సంజయ్

‘బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు’

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 09 , 2025 | 04:28 AM