Share News

Bhatti Vikramarka: ఎంపీలంతా ఏకం కావాలి

ABN , Publish Date - Mar 09 , 2025 | 03:46 AM

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల అనుమతు లు, నిధులు, విభజన సమస్యల పరిష్కారం కోసం రాజకీయాలకతీతంగా ఎంపీలంతా ఏకం కావాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు.

Bhatti Vikramarka: ఎంపీలంతా ఏకం కావాలి

  • రాష్ట్ర సమస్యలపై రాజకీయాలకతీతంగా పోరాడాలి

  • అవసరమైతే పార్లమెంట్‌లో వాయిదా తీర్మానం: భట్టి

  • అఖిలపక్ష భేటీకి హాజరుకాని బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఎంపీలు.. సీఎం, కేంద్ర మంత్రులూ గైర్హాజరు

హైదరాబాద్‌, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల అనుమతు లు, నిధులు, విభజన సమస్యల పరిష్కారం కోసం రాజకీయాలకతీతంగా ఎంపీలంతా ఏకం కావాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులు గత దశాబ్ద కాలంలో పెండింగ్‌లో ఉండిపోయాయని తెలిపారు. వీటిని రాబట్టడానికి గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్ల కాలంలో పెద్దగా ప్రయత్నాలు చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత గట్టిగా ప్రయత్నం చేసినా ఫలితం ఉండడం లేదన్నారు. వీటిని సాధించుకోవడానికి, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. శనివారం డిప్యూటీ సీఎం అధ్యక్షతన ప్రజా భవన్‌లో ఎంపీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరు కావాల్సి ఉండగా.. ఆయన రాలేకపోయారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ కూడా హాజరు కాలేదు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలకు చెందిన రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు కూడా హాజరు కాలేదు. ఎంపీల సమావేశం నిర్వహిస్తున్నట్లుగా తమకు చాలా తక్కువ సమయంలో చెప్పారని, తాము ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉన్నందున సమావేశానికి రాలేకపోతున్నామంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. కాంగ్రె్‌సకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతోపాటు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఈ భేటీకి హాజరయ్యారు. సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ విలేకరులతో మాట్లాడారు.


రాజకీయ ప్రయోజనాల కోసం కాదు..

రాష్ట్ర సమస్యలు, ప్రాజెక్టుల గురించి పార్లమెంటులో అన్ని పార్టీల ఎంపీలూ ప్రస్తావించాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని భట్టివిక్రమార్క తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం దీనిని ఏర్పాటు చేయలేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలమైనా.. కేంద్రం నుంచి, ఆంధ్రప్రదేశ్‌ నుంచి రావాల్సిన బకాయిలు రావడం లేదని చె ప్పారు. రాష్ట్ర ఎంపీలంతా కలిస్తేనే వీటిని సాధించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి ఏయే పథకాలకు నిధులడిగాం, ఏయే రాష్ట్రా లు ఎలాంటి ప్రయోజనాలు పొందుతున్నాయి, తెలంగాణ ఎందుకు పొందలేకపోతోందన్న వివరాలను ఎంపీలకు వివరించామని తెలిపారు. రెండు బుక్‌లెట్‌లలో మొత్తం 28 సమస్యలను పొందుపరిచి, ఎంపీలకు అందజేశామన్నారు. ప్రధానంగా రాష్ట్ర విభజన హామీలు, బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ, రీజినల్‌ రింగ్‌ రోడ్డు, వరంగల్‌ మెగా టెక్స్‌టైల్‌ పార్కు, నవోదయ స్కూళ్లు వంటి పలు సమస్యలకు ఇప్పటివరకు పరిష్కారం లభించలేదన్నారు. పార్లమెంటులో చేపట్టే ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్‌లో రాష్ట్ర అంశాలను మన ఎంపీలు ప్రస్తావించాలని కోరారు. రాష్ట్ర సమస్యలను కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లడానికి అవసరమైతే వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాలన్న ఆలోచన చేశామని తెలిపారు.


అందరినీ స్వయంగా ఆహ్వానించాను..

ఎంపీల సమావేశానికి రావాల్సిందిగా కాంగ్రెస్‌, ఎంఐఎం, బీఆర్‌ఎస్‌, బీజేపీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను తాను స్వయంగా ఆహ్వానించానని భట్టివిక్రమార్క తెలిపారు. అయితే కొన్ని కారణాల వల్ల రావడానికి వీలు కాలేదంటూ కొంత మంది తెలిపారని వెల్లడించారు. తక్కువ సమయంలో సమాచారమిచ్చారంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ ద్వారా తెలియజేశారని పేర్కొన్నారు. మరోసారి ప్రభుత్వం సమావేశం నిర్వహిస్తుందని, బీజేపీ, బీఆర్‌ఎస్‌ సభ్యులు ఆ సమావేశానికైనా కలిసి వస్తారని ఆశిస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో పార్లమెంటు సమావేశాలకు ముందు సభ్యులందరికీ తగిన సమయమిచ్చి, ముందస్తుగా తెలియజేసి ఎంపీల సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. రానున్న పార్లమెం టు సమావేశాల ప్రారంభానికి ఒకరోజు ముందు గానీ, సమావేశాల మధ్యలో గానీ ఢిల్లీలో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలున్నా ప్రాజెక్టులను సాధించుకురావడంలో విఫలమవుతున్నారన్నారు. తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందని, కొన్ని రాష్ట్రాలకే ప్రాధాన్యమిస్తోందని ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో..

Car Accident: అంతా చూస్తుండగానే అదుపుతప్పిన కారు.. క్షణాల్లోనే..

Updated Date - Mar 09 , 2025 | 03:46 AM