Bhatti Vikramarka: రాష్ట్రాల రాబడిపై ప్రభావం పడకూడదు
ABN , Publish Date - Aug 21 , 2025 | 03:48 AM
వస్తు సేవల పన్ను(జీఎ్‌సటీ) శ్లాబుల్లో మార్పులతో రాష్ట్రాల రాబడులపై ప్రభావం పడకుండా చూడాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క జీఎస్టీ కౌన్సిల్‌ను కోరారు.
రాబడులు తగ్గుతాయనుకుంటే పరిహారం చెల్లించాలి
జీఎస్టీ శ్లాబుల్లో మార్పుల ప్రతిపాదనపై కౌన్సిల్ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి
12 శాతం శ్లాబ్ తొలగింపును స్వాగతిస్తున్నామని ప్రకటన
హైదరాబాద్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): వస్తు సేవల పన్ను(జీఎ్‌సటీ) శ్లాబుల్లో మార్పులతో రాష్ట్రాల రాబడులపై ప్రభావం పడకుండా చూడాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క జీఎస్టీ కౌన్సిల్‌ను కోరారు. రాష్ట్రాల ఆదాయాలు తగ్గుతాయనుకుంటే పరిహారం చెల్లించే అంశాన్ని పరిశీలించాలని అభిప్రాయపడ్డారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన న్యూఢిల్లీలో బుధవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రం తరఫున భట్టి విక్రమార్క మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలో ఉన్న 12శాతం జీఎస్టీ శ్లాబ్ తొలగింపును స్వాగతిస్తున్నామని ప్రకటించారు. కొన్ని వస్తువులు, సేవలపై పన్ను రేట్లను తగ్గించాలన్న ప్రతిపాదనను కూడా స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే, జీఎస్టీలోని నాలుగు శ్లాబులను రెండుకు కుదించడం ద్వారా అంతిమంగా వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నప్పటికీ... శ్లాబుల ఎత్తివేత, పన్ను రేట్ల తగ్గింపుతో రాష్ట్ర రాబడులు ప్రభావితం కాకుండా చూడాలని కోరారు. మరికొన్ని వస్తువులు, సేవలపై పన్ను రేట్లను పెంచే అంశంపై లోతైన అధ్యయనం చేయాలని సూచన చేశారు. రాష్ట్రాల ఆదాయాలు తగ్గుతాయనుకుంటే పరిహారం చెల్లింపు అంశాన్ని కౌన్సిల్ పరిశీలించాలని కోరారు. పన్ను రేట్ల హేతుబద్ధీకరణ కోసం జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసిన మంత్రుల బృందం(జీఓఎం)లో మరిన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించాలని, భట్టి అభిప్రాయపడ్డారు.
బీమా పాలసీలపై పన్ను మినహాయింపు లబ్ధి ప్రజలకు చేరాలి
జీవిత, ఆరోగ్య బీమా పాలసీపై పన్ను మినహాయింపు ప్రతిపాదనను స్వాగతిస్తున్నామని భట్టి ప్రకటించారు.అయితే, పన్ను మినహాయింపు ప్రయోజనం ప్రజలకు చేరేలా విధానాన్ని రూపొందించాలని అభిప్రాయపడ్డారు. జీవిత బీమా, ఆరోగ్య బీమాలకు జీఎస్టీ మినహాయింపు, తగ్గింపు పరిశీలన కోసం ఏర్పాటైన మంత్రుల బృందం(జీఓఎం) సమావేశంలో భట్టి ఈ వ్యాఖ్యలు చేశారు. పన్ను మినహాయింపు విధానం ప్రజలకు లబ్ధి చేకూర్చేలా లేకుంటే బీమా సంస్థల లాభాలను పెంచడానికి దారి తీస్తుందని భట్టి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బతుకమ్మ కుంట అభివృద్ధి పనులపై హైడ్రా ఫోకస్
హైదరాబాద్‌పై ప్రపంచ దృష్టి.. అభివృద్ధిని అడ్డుకునే వారే శత్రువులు: సీఎం రేవంత్‌రెడ్డి
Read latest Telangana News And Telugu News