Share News

Bhatti Vikramarka: 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ నిర్మాణమే లక్ష్యం

ABN , Publish Date - Sep 06 , 2025 | 03:53 AM

తెలంగాణ రైజింగ్‌- 2047’ను సాధించడం, మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నిర్మించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు.

Bhatti Vikramarka: 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ నిర్మాణమే లక్ష్యం

విద్యారంగంలో భారీగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు.. ఐఎ్‌సబీ నిర్వాహకులు స్కిల్‌ వర్సిటీని సందర్శించాలి

  • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి

  • ఐఎ్‌సబీ ఎగ్జిక్యూటివ్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : ‘తెలంగాణ రైజింగ్‌- 2047’ను సాధించడం, మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నిర్మించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. ఆయన గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినె్‌స(ఐఎ్‌సబీ)లో మోతిలాల్‌ ఓస్వాల్‌ ఎగ్జిక్యూటివ్‌ సెంటర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శుక్రవారం పాల్గొని మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి ఐఎ్‌సబీ విద్యార్థులు సహకరించాలని కోరారు. విద్యా రంగంలో ఎవరు ఊహించని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు పెడుతోందని తెలిపారు. రాష్ట్ర విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను పూర్తి ఉచితంగా అందించడానికి ‘యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌’ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్ల పెట్టుబడితో ఒక్కో పాఠశాలను నిర్మిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 104 పాఠశాలల నిర్మాణాలను ప్రారంభించామని వివరించారు. విద్యార్థులు బయటికి వెళ్లగానే ఉద్యోగం పొందేలా ‘స్కిల్‌ యూనివర్సిటీ’లో సిలబ్‌సను అమలు చేస్తున్నామని తెలిపారు. ఆ యూనివర్సిటీ ఇప్పటికే ప్రారంభమై, తొలి సంవత్సరంలోనే వందలాది విద్యార్థులకు శిక్షణ ఇచ్చిందని, 2025 చివరి నాటికి దాని శాశ్వత క్యాంపస్‌ ‘ఫ్యూచర్‌ సిటీ’లో ఏర్పడుతుందని తెలిపారు. ఐఎ్‌సబీ నిర్వాహకులు స్కిల్‌ యూనివర్సిటీని, యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూళ్లను సందర్శించి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని డిప్యూటీ సీఎం కోరారు.


గురు పూజోత్సవం రోజు ఐఎ్‌సబీలో ఎగ్జిక్యూటివ్‌ సెంటర్‌ను ప్రారంభించడం తన అదృష్టమన్నారు. ఇందుకు మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫౌండేషన్‌ అందించిన సహకారం ఒక విరాళం మాత్రమే కాదని, అది జ్ఞానం, నాయకత్వం, సమష్టి భవిష్యత్తుపై ఉంచిన విశ్వాసానికి ప్రతీక అన్నారు. మోతీలాల్‌ ఓస్వాల్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఐఎ్‌సబీ వయస్సులో చిన్నదే అయినా, ఖ్యాతిలో విశిష్ట స్థానంలో నిలిచిందన్నారు. గతేడాది ఒక్క సంవత్సరంలోనే ఐఎ్‌సబీ దాదాపు 200 ప్రోగ్రాముల ద్వారా 6,000 మందికి పైగా ప్రొఫెషనల్స్‌కు శిక్షణ ఇవ్వడం గొప్ప విషయమన్నారు. ‘తెలంగాణ రైజింగ్‌ 2047’ విజన్‌ డాక్యుమెంట్‌ రూపకల్పనలో ఐఎ్‌సబీ భాగస్వామి అవుతోందని పేర్కొన్నారు. ఐఎ్‌సబీ ఎగ్జిక్యూటివ్‌ సెంటర్‌... దేశం గర్వపడేలా సమస్యలకు పరిష్కారాలు చూపాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఐఎ్‌సబీలో ఐదు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్వాహకులను కోరారు. కార్యక్రమంలో మోతిలాల్‌ ఓస్వాల్‌, ఐఎ్‌సబీ డీన్‌ మదన్‌ పిల్లుట్ల, ప్రభాత్‌ సిన్హా పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

 ఫలించిన ప్రభుత్వ ప్రయత్నం.. తెలంగాణకు యూరియా రాక..

మద్యం కుంభకోణం కేసులో కీలక పురోగతి

Read Latest TG News and National News

Updated Date - Sep 06 , 2025 | 03:53 AM