Bhatti Vikramarka: రాష్ట్రాల రాబడి తగ్గకుండా చూడాలి
ABN , Publish Date - Aug 22 , 2025 | 04:00 AM
దేశ భవిష్యత్తుకు రాష్ట్రాలే పట్టుగొమ్మలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రాల ఆదాయాలు క్షీణించకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
వాటాకు తగినట్టు దక్షిణాది రాష్ట్రాలకు నిధులివ్వాలి
ఢిల్లీలో మంత్రుల బృందం భేటీలో ఉప ముఖ్యమంత్రి భట్టి
యంగ్ ఇండియా స్కూళ్లకు ఆర్థిక సాయం.. నిర్మలకు విజ్ఞప్తి
న్యూఢిల్లీ, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): దేశ భవిష్యత్తుకు రాష్ట్రాలే పట్టుగొమ్మలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రాల ఆదాయాలు క్షీణించకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జీఎస్టీ పన్ను శ్లాబుల సవరణ, పన్ను రేట్ల మార్పులపై సిఫారసుల కోసం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం గురువారం ఢిల్లీలో సమావేశమైంది. ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరైన భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. జీఎస్టీ ప్రవేశపెట్టిన సమయంలో రాష్ట్రాల వార్షిక వృద్ధి రేటు 14 శాతంగా ఉండడంతో, వార్షికంగా 14ు వృద్ధి కలుగుతుందని కేంద్రం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. వృద్ధి రేటులో లోటును పూరించడానికి, రాష్ట్రాలు స్థిరంగా 14ు వృద్ధిని సాధించేందుకు, మొదటి ఐదు సంవత్సరాలపాటు జీఎస్టీ పరిహారం అందించే విధానం అమలులోకి వచ్చిందని పేర్కొన్నారు. అయితే, ఇప్పటి వరకు 14ు వృద్ధి స్థిరపడలేదని, ప్రస్తుతం రాష్ట్రాల వార్షిక వృద్ధి కేవలం 8 నుంచి 9ు మధ్యలోనే ఉందని తెలిపారు. జీఎస్టీ రేట్ల సరళీకరణ, పన్ను భారం తగ్గించడం ఆహ్వానించతగినదే అయినప్పటికీ, రాష్ట్రాల ఆదాయాలు క్షీణించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో పేద, మధ్య తరగతి ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర ప్రజల కోసం చేపడుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టులు దెబ్బతింటాయని హెచ్చరించారు.
అలాగే, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు దేశ ఆదాయానికి గణనీయంగా సహకరిస్తున్నాయని, కానీ జాతీయ ఆదాయంలో వాటి వాటాకు తగిన విధంగా నిధుల పంపిణీ జరగడం లేదని పేర్కొన్నారు. వాటాకు తగిన విధంగా నిధులివ్వాలని కోరారు. పన్ను హేతుబద్ధీకరణ ప్రతిపాదనకు మద్దతు తెలిపితే.. దానికి సరైన పరిహారం ఉండాలన్నారు. అందుకు, ప్రస్తుతం అమలులో ఉన్న పరిహార సెస్సు విధానాన్ని కొనసాగించి, దానివల్ల సమకూరే మొత్తాన్ని పూర్తిగా ఆయా రాష్ట్రాలకు ఇవ్వాలని ప్రతిపాదించారు. లేకపోతే, పరిహార సెస్సును రద్దు చేసి, సిగరెట్లు, మద్యం, విలాస వస్తువుల వంటి ‘సిన్’ లేదా లగ్జరీ ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లను ప్రస్తుత స్థాయికి పెంచి, అదనంగా లభించే ఆదాయాన్ని రాష్ట్రాలకు కేటాయించాలని సూచించారు.తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు ఆర్థికసాయం అందించాలని నిర్మలా సీతారామన్‌కు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. గురువారం పార్లమెంట్‌లో కేంద్రమంత్రిని ఆమె కార్యాలయంలో భట్టి కలిశారు.
486 మందికి నేడు నియామక పత్రాలు
హైదరాబాద్: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ భూసేకరణలో నిర్వాసితులైన కుటుంబాల్లోని 335 మందితోపాటు కారుణ్య నియామకాల కింద 151 మందికి జెన్‌కోలో ఉద్యోగాలు ఇవ్వనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి శుక్రవారం వారికి నియామక పత్రాలు అందించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎమ్మెల్యేలు ఇలా చేస్తే ఎలా.. సీఎం చంద్రబాబు ఫైర్
టీటీడీపై వైసీపీ బురద జల్లుతోంది.. జ్యోతుల నెహ్రూ ధ్వజం
Read Latest AP News and National News