Share News

Betting Apps Online Gambling: బెట్టింగ్‌ యాప్‌లలో వాటా కంపెనీలకు నష్టాల మూట!

ABN , Publish Date - Aug 21 , 2025 | 04:21 AM

బెట్టింగ్‌ యాప్‌లతో జనాలు భారీగా నష్టపోగా.. ఆ కంపెనీల్లో వాటాలు కొన్న సంస్థలూ రూ.వందల కోట్లు నష్టపోతున్నాయి. బెట్టింగ్‌ యాప్‌లపై నిషేధం విధి స్తూ కేంద్రం తీసుకొచ్చిన చట్టం..

Betting Apps Online Gambling: బెట్టింగ్‌ యాప్‌లలో వాటా కంపెనీలకు నష్టాల మూట!

  • వందల కోట్లు పెట్టి కొన్న సంస్థలకు షాక్‌

  • భారీగా పడిపోయిన షేర్లు కొన్నవారికి నష్టం..

  • అమ్ముకున్న వారికి లాభం

హైదరాబాద్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): బెట్టింగ్‌ యాప్‌లతో జనాలు భారీగా నష్టపోగా.. ఆ కంపెనీల్లో వాటాలు కొన్న సంస్థలూ రూ.వందల కోట్లు నష్టపోతున్నాయి. బెట్టింగ్‌ యాప్‌లపై నిషేధం విధి స్తూ కేంద్రం తీసుకొచ్చిన చట్టం.. కొన్ని కంపెనీలకు భారీ నష్టాన్ని మిగిల్చింది. రూ.వందల కోట్లు వెచ్చించి, గేమింగ్‌ కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో వాటాలను కొనుగోలు చేసిన కంపెనీలకు కేంద్రం తెచ్చిన చట్టం శరాఘాతమైంది. ఇటీవలి కాలంలో నజారా టెక్నాలజీస్‌ అనే సంస్థ ఒక గేమింగ్‌ కంపెనీ నుంచి 47.7ు వాటా కొనుగోలు చేసింది. ఆ కంపెనీ షేరు విలువ నిన్నమొన్నటి వరకు చాలా బాగా ఉండేది. తాజాగా బెట్టింగ్‌ యాప్‌లపై నిషేధ చట్టం తేగానే ఈ కంపెనీ షేర్లు భారీగా పడిపోయాయి. ఒక్క రోజులోనే ఏకంగా రూ.179 పడిపోయింది. రూ.832 కోట్లతో మూన్‌ షైన్‌ టెక్నాలజీస్‌ నుంచి వాటాను కొనుగోలు చేసిన నజారా టెక్నాలజీస్‌ పరిస్థితి ఇది. వాటా అమ్ముకున్న సంస్థకేమో మోదం.. కొనుక్కున్న సంస్థకేమో ఖేదం. బెట్టింగ్‌ యాప్‌లు పెట్టి ప్రజల సొమ్ములు కొల్లగొట్టిన కంపెనీలు.. అలాంటి కంపెనీల్లో వాటాలు కొనుగోలు చేసిన సంస్థల పరిస్థితి ఇక అయోమయమే! ఎప్పటినుంచో ఈ రంగంలో ఉండి భారీగా డబ్బులు దండుకున్న పాత కంపెనీలకు ఇకపై ఆదాయం ఉండకపోవచ్చు. ఇక కొత్తగా కొనుగోలు చేసిన కంపెనీల పరిస్థితి.. బెట్టింగ్‌ యాప్‌లో జూదం మాదిరిగా తయారైంది! సామాన్య ప్రజలతోపాటు బడావ్యాపారులనూ కొన్ని బెట్టింగ్‌ యాప్‌ సంస్థలు నిలువునా ముంచాయి. దుబాయ్‌ కేంద్రంగా ఏర్పాటైన కంపెనీలో లండన్‌, ఇతర దేశాల నుంచి పెట్టుబడులు పెట్టినవారి పరిస్థితి కూడా ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. వందల కోట్లతో బెట్టింగ్‌ యాప్‌ సంస్థలను కొనుగోలు చేసిన వ్యాపారులు కుదేలవుతున్నారు.


14కోట్ల మంది ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ యూజర్లు

దేశంలో 14 కోట్ల మంది క్రమం తప్పకుండా ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌లో పాల్గొంటున్నారు. ఐపీఎల్‌, ఇతర క్రీడలు, ప్రధాన కార్యక్రమాల సమయంలో ఆ సంఖ్య 37 కోట్ల దాకా ఉంటోంది. ఈ విషయం కన్జ్యూమర్‌ యూనిటీ అండ్‌ ట్రస్ట్‌ సొసైటీ (సీయూటీఎస్‌) సంస్థ తాజా నివేదికలో వెల్లడైంది. గత మార్చి, ఏప్రిల్‌లో టాప్‌ 15 గ్యాంబ్లింగ్‌ ప్లాట్‌ఫాంలకు 5.4 బిలియన్‌ విజిట్‌లు వచ్చినట్లు తెలిపింది. బెట్టింగ్‌ యాప్‌ల బారినపడి బలవుతున్నవారిలో 18-25 ఏళ్ల వయసున్నవారే ఎక్కువగా ఉన్నట్లు ప్రహార్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. 96ు మందికి బెట్టింగ్‌ చట్టవిరుద్ధమని తెలిసీ ఆడుతున్నారు. బెట్టింగ్‌ యాప్‌లు వాడుతున్న వారిలో 38ు మంది నెలకు రూ.15 వేలు, అంతకంటే తక్కువ సంపాదిస్తున్నవారే ఉన్నారు. బెట్టింగ్‌ యాప్‌ల్లో పెట్టుబడులు పెట్టిన వారిలో కనీసం 80ు మంది రూ.50 వేలకుపైగా నష్టపోయినట్లు వెల్లడైంది.


పూర్తిస్థాయి నిఘాతోనే కట్టడి..

బెట్టింగ్‌ యాప్‌లపై రాష్ట్రంలో నిషేధం అమల్లో ఉన్నా.. పంటర్లు (పందెం వేసేవాళ్లు) వ్యక్తిగత లింకులు పంపించి బెట్టిం గ్‌ పెట్టిస్తున్నారు. పంటర్ల నుంచి ఏజెంట్లకు, వారినుంచి ఆటగాళ్లకు ఈ లింకులు వెళ్తుంటాయి. ఆట ముగియగానే లింక్‌ ముగిసిపోతుంది. ఎప్పటికప్పుడు ఈ తరహాలో కొత్త లింకులు పంపించి నిఘాకు చిక్కకుండా ఆట ఆడిస్తుంటారు. ఈ పరిస్థితుల్లో బెట్టింగ్‌ యాప్‌లను పూర్తి స్థాయిలో నిషేధించడం కష్టమేనని సైబర్‌ క్రైం పోలీసులు చెబుతున్నారు. ఐపీ అడ్ర్‌సలను బ్లాక్‌ చేసినా, వ్యక్తిగత లింకులు, వాట్సాప్‌, టెలిగ్రామ్‌, డార్క్‌వెబ్‌.. ఇతరత్రా మార్గాల్లో బెట్టింగ్‌ యాప్‌ నిర్వాహకులు మార్కెట్‌లోకి వస్తుంటారు. తెలంగాణతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో బెట్టింగ్‌ యాప్‌లపై నిషేధం ఉన్నప్పటికీ నకిలీ జీపీఎస్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుని, లొకేషన్‌ మార్చుకుని ఇతర రాష్ట్రాల లొకేషన్‌తో ఇక్కడ బెట్టింగ్‌ యాప్‌ వాడుకుంటున్నారు. దేశవ్యాప్తంగా నిషేధం విధించినా.. నకిలీ జీపీఎ్‌సతో బెట్టింగ్‌ యాప్‌లకు అనుమతి ఉన్న దేశాల లొకేషన్ల తో ఇక్కడ బెట్టింగ్‌ యాప్‌లు వాడుకునే అవకాశం కల్పిస్తారని చెబుతున్నారు. ఇలా అయితే వాటిని గుర్తించడం దర్యాప్తు సంస్థలకూ కష్టంగా మారుతుంది.


నిరంతర నిఘాతోనే సాధ్యం

బెట్టింగ్‌ యాప్‌ల పూర్తిస్థాయి నిషేధం అంత సులువుగా అయ్యేపని కాదని సైబర్‌ ఇంటెలిజెన్స్‌ ఫోరెన్సిక్‌ నిపుణుడు ప్రసాద్‌ పాటిబండ్ల తెలిపారు. నిరంతర నిఘాతోనే అధి సాధ్యమవుతుందన్నారు. సింగపూర్‌ ఐపీ అడ్ర స్‌తో కొనసాగుతున్న బెట్టింగ్‌ యాప్‌ను బ్లాక్‌ చేస్తే క్షణాల్లో హాంకాంగ్‌ ఐపీ అడ్ర్‌సతో మనుగడలోకి వచ్చే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు.

బెట్టింగ్‌ యాప్‌లపై నిషేధం హర్షణీయం: సజ్జనార్‌

బెట్టింగ్‌ యాప్‌లను నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ స్వాగతించారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ల కట్టడికి తన వంతు కృషి చేస్తున్న సజ్జనార్‌.. కేంద్ర నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నిషేధం విధించినా.. వివిధ మార్గాల్లో బెట్టింగ్‌ యాప్‌లు మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. బెట్టింగ్‌ యాప్‌లు దేశంలోకి రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బతుకమ్మ కుంట అభివృద్ధి పనులపై హైడ్రా ఫోకస్

హైదరాబాద్‌పై ప్రపంచ దృష్టి.. అభివృద్ధిని అడ్డుకునే వారే శత్రువులు: సీఎం రేవంత్‌రెడ్డి

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 21 , 2025 | 09:39 AM