BC Reservation: జడ్పీల్లో బీసీలు డబుల్!
ABN , Publish Date - Aug 09 , 2025 | 03:39 AM
రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఎన్నికలు సెప్టెంబరు 30లోపు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైకోర్టు గడువు మేరకే ఈ విషయంలో ప్రభుత్వం ముందుకెళ్లే పరిస్థితి ఉంది.
42% రిజర్వేషన్‌తో దాదాపు సగం చైర్మన్లు బీసీలే?
ఉన్నత పదవుల్లో గణనీయంగా పెరగనున్న ప్రాతినిధ్యం.. ప్రస్తుతం 32 మందిలో ఏడుగురే..
పంచాయతీల్లో పెరిగేది కొద్ది శాతమేనా?.. స్థానిక సంస్థల్లో ఇప్పటికే 40ు ప్రాతినిధ్యం
జిల్లాల వారీగా చూస్తే 30 నుంచి 55ు.. చాలా చోట్ల జనరల్ స్థానాల్లోనూ బీసీల గెలుపు
పార్టీలే చొరవ చూపి 42ు అవకాశమిస్తే భవిష్యత్తులో చట్టసభలకూ భారీగా బీసీలు
(హైదరాబాద్, ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్): రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఎన్నికలు సెప్టెంబరు 30లోపు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైకోర్టు గడువు మేరకే ఈ విషయంలో ప్రభుత్వం ముందుకెళ్లే పరిస్థితి ఉంది. బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ చట్టం తేవాలని, ఆ తర్వాత ఆర్డినెన్స్‌కు అయినా ఆమోదం పొందాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రాజకీయంగా పోరాటం చేసినా కేంద్రం సహకరించలేదని, ఇక పార్టీల పరంగా రిజర్వేషన్లు ఇవ్వడమే తమ ముందున్న మార్గమని సీఎం రేవంత్‌రెడ్డి నర్మగర్బంగా చెప్పేశారు. ఈ నేపథ్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే జరిగేదేంటి? స్థానిక సంస్థల్లో బీసీల ప్రాతినిధ్యం ఎలా ఉంటోంది? కొన్ని జిల్లాల సమాచారాన్ని, రాష్ట్ర స్థాయి సమాచారాన్ని ఆంధ్రజ్యోతి పరిశీలించింది. అందులో రెండు విషయాలు ప్రస్ఫుటమయ్యాయి. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల్లో బీసీల ప్రాతినిధ్యం వారికిచ్చిన రిజర్వేషన్ల కంటే ఎక్కువగానే ఉంది. 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 23 శాతం రిజర్వేషన్లు కల్పించారు. చాలా జిల్లాల్లో ఇంతకంటే భారీగానే ఆ సామాజిక వర్గాల అభ్యర్థులు గెలుపొందారు. తమకు రిజర్వు చేసిన స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లోను బీసీలు గెలుపొందారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల్లో వీరి ప్రాతినిధ్యం ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా ఉంది. సగటున 30 శాతం నుంచి 55 శాతం వరకు ఉంది. రాష్ట్రస్థాయిలో చూస్తే ఇది సుమారు 40 శాతం వరకు ఉండొచ్చని లెక్కలు చెప్తున్నాయి. ఒకవేళ పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే ఇక్కడ మరో రెండు శాతం, లేకుంటే ఇంకొంత శాతం మాత్రం బీసీలకు అదనంగా అవకాశాలు దక్కుతాయి. వీటికితోడు బీసీలు గెలుచుకునే జనరల్ స్థానాలు ఉండనే ఉన్నాయి. జిల్లా పరిషత్ ఛైర్మన్‌ల విషయంలో ప్రస్తుతం బీసీల ప్రాతినిధ్యం బాగా తక్కువగా ఉంది. వారికున్న రిజర్వేషన్ల మేరకే వారి ప్రాతినిధ్యం ఉంది. ఉదాహరణకు గత స్థానిక సంస్థల ఎన్నికలు అంటే 2019లో 32 మంది జిల్లా పరిషత్ ఛైర్మన్‌లలో కేవలం ఏడుగురు బీసీ వర్గానికి చెందిన వారు. అంటే సరిగ్గా 23 శాతం మాత్రమే. వారికి కేటాయించిన జిల్లా పరిషత్‌లను మాత్రమే వారు గెలుచుకున్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ స్థానాల్లో జనరల్ సీట్లు గెలిచినట్లుగా జిల్లా పరిషత్ స్థానాల్లో గెలవలేకపోయారు. ఇప్పుడు పార్టీపరంగా 42 శాతం కేటాయిస్తే బీసీలకు రెట్టింపు జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాలు దక్కుతాయని అంచనా వేస్తున్నారు.
30 నుంచి 55 శాతం వరకు
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా గెలుపొందిన వారి శాతాన్ని జిల్లాల వారీగా పరిశీలిస్తే...30 నుంచి 55 శాతం మధ్య ఉంది. నాగర్ కర్నూల్‌లో బీసీ సర్పంచ్‌ల సంఖ్య 26 శాతం ఉండగా, పెద్దపల్లిలో 54.53 శాతంగా ఉంది. అయితే వరంగల్ జిల్లాలో ఈ సంఖ్య మరీ తక్కువుగా ఉంది. ఇక్కడ 19.38 శాతం మందే బీసీ సర్పంచులున్నారు. ఎస్టీ రిజర్వేషన్లు ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్‌లో 20.29 శాతమే బీసీ సర్పంచ్‌లున్నారు. ఇక ఎంపీటీసీల విషయంలో నాగర్ కర్నూల్‌లో 33.33 శాతం ప్రాతినిధ్యం ఉండగా...పెద్దపల్లిలో 55 శాతం ఉంది. కామారెడ్డిలో 47.45 శాతం, హన్మకొండలో 48.46 శాతం బీసీ ఎంపీటీసీలు గెలిచారు. అదే జడ్పీటీసీల విషయంలో ఆదిలాబాద్‌లో 35.2 శాతం, కరీంనగర్‌లో 40 శాతం, వరంగల్‌లో 45.45 శాతం, హన్మకొండలో 66.66 శాతం బీసీలు గెలిచారు. అయితే ఎస్సీలకు ఎక్కువ స్థానాలు రిజర్వు చేసి....బీసీలకు 15 శాతం జడ్పీటీసీ స్థానాలు మాత్రమే రిజర్వు చేసిన నాగర్‌కర్నూల్‌లో 20 శాతం వరకే బీసీ జడ్పీటీసీలున్నారు.
రిజర్వేషన్ల కంటే రెట్టింపు గెలుపు
మరోవైపు గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 23 శాతమే రిజర్వేషన్లు కల్పించినా....ఆయా వర్గాలు అంతకంటే భారీగానే గెలుపొందారు. చాలా జిల్లాల్లో రిజర్వు చేసిన స్థానాల కంటే రెట్టింపు సంఖ్యలో గెలిచారు. మంచిర్యాల జిల్లాలో 49 గ్రామ పంచాయతీలను బీసీలకు కేటాయించగా...అవి కాకుండా మరో 83 జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులు పోటీచేసి గెలిచారు. పెద్దపల్లి జిల్లాలో 70 గ్రామ పంచాయతీలను బీసీలకు కేటాయించగా, వాటితో పాటు మరో 77 చోట్ల జనరల్ స్థానాల్లో... ఆదిలాబాద్ జిల్లాలో 47 పంచాయతీలు కేటాయించగా...మరో 48 చోట్ల జనరల్ స్థానాల్లోను విజయం సాధించారు. ఇక హన్మకొండలాంటి జిల్లాలో జడ్పీటీసీలను తీసుకుంటే మొత్తం 12 మందిలో 8 మంది అంటే 66.66 శాతం బీసీలే గెలుపొందారు. ఈ జిల్లాలో ఆ వర్గాలకు కేటాయించిన సీట్లు మూడు కాగా, మరో ఐదు చోట్ల జనరల్ స్థానాల్లో విజయం సాధించారు.
జిల్లా పరిషత్‌లలో ఎంత రిజర్వేషన్లో అంతే
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ఎవరెంతో వారికంత అన్న నినాదం తీసుకుంది. బీసీలకు ఈ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్తోంది. పార్టీపరంగా రిజర్వేషన్లు కేటాయించినా...బీసీలకు భారీగా మేలు జరిగేది ఈ పై స్థాయిలోనే. 2019 ఎన్నికల్లో మొత్తం 32 జిల్లా పరిషత్ చైర్మన్ల బీసీలు కేవలం ఏడు మందే. కామారెడ్డి, జగిత్యాల, మెదక్, గద్వాల, నారాయణపేట, పెద్దపల్లి, ములుగు జిల్లాల్లో మాత్రమే జడ్పీ చైర్మన్ పదవులు బీసీలు కైవసం చేసుకున్నారు. దాదాపుగా రిజర్వేషన్ల మేరకే వారికి దక్కాయి. ములుగులో బీసీ జడ్పీ ఛైర్మన్‌గా ఉన్న కుసుమ జగదీష్ చనిపోవడంతో ఆ స్థానంలో ఎస్టీ వర్గానికి చెందిన బడే నాగజ్యోతికి చైర్‌పర్సన్‌గా అవకాశం దక్కింది. అంటే ఆ కాలంలో ఆరుగురు జిల్లా పరిషత్ ఛైర్మన్లు, చైర్‌పర్సన్లు మాత్రమే బీసీ వర్గాలకు చెందిన వారున్నారు. ఇప్పుడు 42ు రిజర్వేషన్లు పార్టీపరంగా ఇచ్చినా ఆయా వర్గాల ప్రాతినిధ్యం ఇక్కడ భారీగా పెరుగుతుంది. దాదాపుగా రెట్టింపు సంఖ్యలో జడ్పీ పీఠాల్లో బీసీలు ఉండే అవకాశాలున్నాయి. ఇలా ఉన్నత స్థానాల్లో బీసీల ప్రాతినిధ్యం పెరగడం వల్ల భవిష్యత్తులో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా బీసీలు ఎదిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. జడ్పీ చైర్మన్ పదవులు లాంచింగ్ ప్యాడ్‌లుగా మారతాయి.
స్థానికంలో బీసీల శాతం ఎంతెంత?
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల్లో బీసీల శాతం ఎంతెంత అని ఒక 10 జిల్లాల్లో ఆంధ్రజ్యోతి పరిశీలించింది. ఆయా వివరాలు ఇలా ఉన్నాయి.
ఎంపీటీసీలు.. బీసీల సంఖ్య, శాతం
జిల్లా ఎంపీటీసీ బీసీలకు జనరల్ స్థానాల్లో మొత్తం శాతం
మొత్తం కేటాయించిన బీసీలు బీసీలు పరంగా
స్థానాలు స్థానాల్లో గెలిచినవి గెలిచినవి గెలిచినవి
మంచిర్యాల 130 13 38 51 39.30
పెద్దపల్లి 138 37 39 76 55
సిరిసిల్ల 123 25 17 42 34
కామారెడ్డి 236 63 49 112 47.45
ఆదిలాబాద్ 158 04 52 56 35.44
కరీంనగర్ 178 46 17 63 35.39
వరంగల్ 134 35 18 53 39.55
హన్మకొండ 130 30 33 63 48.46
నాగర్‌కర్నూల్ 210 49 21 70 33.33
జడ్పీటీసీలు-బీసీల సంఖ్య, శాతం
జిల్లా జడ్పీటీసీ బీసీలకు జనరల్ మొత్తం శాతం
మొత్తం కేటాయించిన స్థానాల్లో బీసీలు బీసీలు పరంగా
స్థానాలు స్థానాల్లో గెలిచినవి గెలిచినవి గెలిచినవి
మంచిర్యాల 16 2 4 6 37.5
పెద్దపల్లి 13 4 2 6 46.15
సిరిసిల్ల 12 2 3 5 41.6
కామారెడ్డి 22 5 2 7 31.8
ఆదిలాబాద్ 17 0 6 6 35.2
కరీంనగర్ 15 4 2 6 40
వరంగల్ 11 1 4 5 45.45
హన్మకొండ 12 3 5 8 66.66
నాగర్‌కర్నూల్ 20 3 1 4 20
సర్పంచులు.. బీసీల సంఖ్య, శాతం
జిల్లా సర్పంచు బీసీలు జనరల్ మొత్తం శాతం
స్థానాలు స్థానాల్లో బీసీల గెలుపు
మంచిర్యాల 311 49 83 132 42.44
పెద్దపల్లి 263 70 74 144 54.75
సిరిసిల్ల 252 56 24 80 31.74
కామారెడ్డి 526 153 96 249 47.33
ఆదిలాబాద్ 468 47 48 95 20.29
కరీంనగర్ 313 74 46 120 38.33
వరంగల్ 325 48 15 63 19.38
హన్మకొండ 210 46 22 68 32.38
నాగర్‌కర్నూల్ 461 83 37 120 26
ఈ వార్తలు కూడా చదవండి..
అవి చూసి షాక్ అయ్యా: బండి సంజయ్
‘బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు’
For More AndhraPradesh News And Telugu News