Bandi Sanjay: మహిళలకు రూ.2,500 హామీ ఏమైంది?
ABN , Publish Date - Mar 09 , 2025 | 04:07 AM
మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
తులం బంగారం, స్కూటీ ఎటు పోయాయి
కాంగ్రె్‌సకు కేంద్ర మంత్రి సంజయ్ సూటి ప్రశ్న
హైదరాబాద్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆడబిడ్డల పెళ్లికి రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్న వాగ్దానం ఎక్కడ పోయిందని, 18 ఏళ్లు నిండిన యువతులకు స్కూటీ ఇస్తామన్న హామీ ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. ‘‘మహిళా శక్తి అంటే మహిళా దినోత్సవం నాడే రూ.కోట్లు ఖర్చు చేసి ప్రచారం చేసుకోవడం కాదు. ఆచరణలో చూపాలి. వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి.
అధికారంలోకి వస్తే బెల్టు షాపులు లేకుండా చేస్తామని ఇచ్చిన హామీని గాలికొదిలేశారు. మద్యం ఏరులై పారి మహిళల జీవితాలు ఛిద్రమవుతున్నా పట్టించుకోవడం లేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా, మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా చేయకుండా మహిళా దినోత్సవం నాడు మాత్రమే ‘మహిళలను శక్తి’గా మారుస్తామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు, పెద్ద పెద్ద ప్రకటనలు, సభలు, సమావేశాలు పెడితే నమ్మేదెవరు..?’’ అని సంజయ్ ఒక ప్రకటనలో నిలదీశారు.