Bandi Sanjay: వార్డు సభ్యుడిగా కూడా గెలవని మహేశ్‌గౌడ్‌కు ఏం తెలుసు?
ABN , Publish Date - Aug 27 , 2025 | 05:37 AM
దొంగ ఓట్లు ఉన్నాయని ఆరోపిస్తున్న టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ వాటిని తొలగించాలని ఈసీకి లేఖ రాయాలి. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు వెళ్దాం.
దొంగ ఓట్లు ఉంటే ఈసీకి లేఖ రాయండి: బండి సంజయ్
కరీంనగర్/హైదరాబాద్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘‘దొంగ ఓట్లు ఉన్నాయని ఆరోపిస్తున్న టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ వాటిని తొలగించాలని ఈసీకి లేఖ రాయాలి. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు వెళ్దాం. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా’’ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. మంగళవారం కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో 2.25 లక్షల భారీ మెజారిటీతో బీజేపీని గెలిపించిన కరీంనగర్ ప్రజలను కాంగ్రెస్ అవమానిస్తోందని మండిపడ్డారు. ఒక్కసారైనా కనీసం వార్డు సభ్యుడిగా కూడా గెలవలేని మహేశ్ గౌడ్‌కు దొంగ ఓట్ల గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. దొంగ ఓట్లతో గెలవాలనుకుంటే 8 ఎంపీ సీట్లు మాత్రమే బీజేపీ ఎందుకు గెలుస్తుందని, మొత్తం ఎంపీ స్థానాలను గెలుచుకునే వాళ్లం కాదా అని పేర్కొన్నారు. మహేశ్‌గౌడ్‌ను చూస్తే గజిని సినిమా గుర్తుకొస్తోందని.. తనను బీసీ అన్నది ఆయనేనని, ఇప్పుడు దేశ్‌ముఖ్ అని అంటున్నదీ ఆయనేనని చెప్పారు. ఎన్నికలొస్తే టోపీలు పెట్టుకుని మసీదుల్లో ప్రార్థనలు చేస్తూ ఓట్లడిగే బిచ్చగాళ్లు కాంగ్రెస్ వాళ్లు అని వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్లు అని చెప్పి ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలున్నా, లేకున్నా హిందూ సమాజం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం పోరాడే పార్టీ బీజేపీ మాత్రమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు వెళితే రాళ్లతో కొట్టేంత కోపంతో ప్రజలు ఉన్నారన్నారు.
దమ్ముంటే రాజీనామా చేయండి: రఘునందన్‌రావు
బీజేపీ ఓటు చోరీ చేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 8 మంది ఎంపీలు ఎలా గెలిచారని టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌ను ఎంపీ రఘునందన్‌రావు ప్రశ్నించారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ధైర్యముంటే మీ ఎంపీలను రాజీనామా చేయించండి. మేమూ రాజీనామా చేస్తాం. కొత్త ఓటరు జాబితాతో ఎన్నికలకు వెళదాం. ఎవరి సత్తా ఏమిటో తేలిపోతుంది’’ అని సవాల్ చేశారు. రాష్ట్రంలో వంద అసెంబ్లీ సీట్లు గెలుస్తామన్న నమ్మకముంటే తక్షణమే శాసనసభను రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్‌కు రఘునందన్ సవాల్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
లిక్కర్ స్కామ్‌లో నిందితులకు మళ్లీ రిమాండ్ పొడిగింపు
ఈ రాశుల వారు.. ఈ మంత్రాలు చదివితే దశ..
For More Telangana News and Telugu News..