Bandi Sanjay: ముస్లింలను బీసీల్లో ఎలా చేర్చుతారు..?
ABN , Publish Date - Feb 10 , 2025 | 04:09 AM
‘‘ముస్లింలను బీసీల్లో ఎలా చేరుస్తారు..? బీసీల జాబితా ఏమైనా మీ అయ్య జాగీరా..? బీసీలను ఉద్ధరిస్తామని చెప్పుకునే బీసీ సంఘాలు ఏం చేస్తున్నాయి.?

ఓట్ల కోసం ఒవైసీతో రేవంత్ కుమ్మక్కు
బీసీల స్థానాల్లో ముస్లింల పోటీకి కుట్ర
బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దోస్తీ : సంజయ్
నల్లగొండ/బోయినపల్లి, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘‘ముస్లింలను బీసీల్లో ఎలా చేరుస్తారు..? బీసీల జాబితా ఏమైనా మీ అయ్య జాగీరా..? బీసీలను ఉద్ధరిస్తామని చెప్పుకునే బీసీ సంఘాలు ఏం చేస్తున్నాయి.? అధికారంలో ఎవరుంటే వారి అడుగులకు మడుగులొత్తుతున్నాయా..?’’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఆదివారం నల్లగొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికపై నిర్వహించిన వర్క్‌షా్‌పలో ఆయన మాట్లాడారు. ఒక జాతికి, మరో జాతికి మధ్య తేడాలు తెలుసుకోలేని మూర్ఖత్వపు పార్టీ కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు. ముస్లిం, మైనారిటీల ఓట్ల కోసం ఒవైసీ, రేవంత్ గ్యాంగ్ కలిసి ముస్లింలను బీసీలలో కలిపే కుట్రకు తెరలేపిందని దుయ్యబట్టారు. బీసీలకు జరిగిన అ న్యాయంపై బీసీ సంఘాలు ఎందుకు నోరు మూసుకున్నాయని నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల స్థానాల్లో ముస్లింలు పోటీ చేసి, బీసీలకు అన్యాయం చేసేందుకు రంగం సిద్ధమైందని హెచ్చరించారు. రాష్ట్రంలో బీజేపీని నిలువరించడమే లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. దీనివల్లే కాళేశ్వరం స్కామ్, కార్ రేస్, డ్రగ్స్ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసుల విచారణ ఆగిపోయాయన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌ను అరెస్టు చేయిస్తామన్న కాంగ్రెస్ నేతలు నోరుమూసుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ అర్బన్ నక్సలైట్ల చేతుల్లోకి వెళ్లిందని ఆయన ఆరోపించారు.
మున్నూరు కాపుల సత్తా చాటాలి..
రానున్న రోజుల్లో రాజ్యాధికార సాధనలో ము న్నూరు కాపులు కీలకంగా వ్యవహరిస్తారని బండి సంజయ్ అన్నారు. సికింద్రాబాద్‌లోని డైమండ్ పాయింట్ హోటల్ చౌరస్తా వద్ద ఉన్న వీహెచ్‌ఆర్ ఫంక్షన్ హాలులో ఆదివారం ‘కులగణన ఫలితాలలో కాపులకు జరిగిన తప్పిదాలు’ పేరిట మున్నూరు కాపుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే పూర్తిగా తప్పులు తడకగా ఉందన్నారు. మున్నూరుకాపుల సంఖ్యను పది లక్ష లు తక్కువగా చూపించడం దారుణమని మండిపడ్డారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో 10 లక్షల మందితో సభ నిర్వహించి మున్నూరు కాపుల సత్తా చాటాలని.. అప్పుడు అన్ని పార్టీలు టిక్కెట్లు ఇచ్చేందుకు ముందుకొస్తాయని అన్నారు. సభ నిర్వహణకు పూర్తి సహకారాన్ని అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మణ్, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, జోగు రామన్న, తీన్మార్ మల్లన్న, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.