Share News

Bandi Sanjay: రేవంత్‌.. పౌరుషం చచ్చిపోయిందా..?

ABN , Publish Date - Feb 24 , 2025 | 03:49 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలో పౌరుషం, చీమూ నెత్తురు చచ్చిపోయిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘రేవంత్‌రెడ్డి గారూ.. బిడ్డ పెళ్లి నాడు కేసీఆర్‌ మిమ్మల్ని అరెస్టు చేసి జైల్లో వేయించినప్పుడు.. మిత్తితో చెల్లిస్తానని ప్రతిజ్ఞ చేశారు కదా..?

Bandi Sanjay: రేవంత్‌.. పౌరుషం చచ్చిపోయిందా..?

కేసీఆర్‌ను జైల్లో వేస్తానన్న ప్రతిజ్ఞ మరిచావా.. అవినీతి కేసుల్లో సాక్ష్యాలున్నా తాత్సారమేంటి?

  • వరి వేయొద్దన్న కాంగ్రెస్‌ సర్కారుకు ఉరే

  • 25 వేల కొలువులకు నోటిఫికేషన్‌ వేసి.. 50 వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారు..?

  • పైరవీల కోసం ప్రజా భవన్‌కు టీఎన్జీవోలు

  • పాలకులకు టీచర్‌ సంఘాల బాకా: బండి

హైదరాబాద్‌/మిల్స్‌కాలనీ(వరంగల్‌)/మందమర్రి రూరల్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలో పౌరుషం, చీమూ నెత్తురు చచ్చిపోయిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘రేవంత్‌రెడ్డి గారూ.. బిడ్డ పెళ్లి నాడు కేసీఆర్‌ మిమ్మల్ని అరెస్టు చేసి జైల్లో వేయించినప్పుడు.. మిత్తితో చెల్లిస్తానని ప్రతిజ్ఞ చేశారు కదా..? మరి ఇప్పుడు మీరే సీఎం. కాళేశ్వరం, డ్రగ్స్‌, కార్‌ రేస్‌, ఫోన్‌ట్యాపింగ్‌ కేసుల్లో కేసీఆర్‌ కుటుంబం పాత్ర ఉందని, ఆధారాలున్నాయని మీరే చెప్పారు. 14 నెలలైనా ఎందుకు అరెస్టు చేయలేదు..? మీలో పౌరుషం చచ్చిపోయిందా..? లేక ఢిల్లీలో మీ పార్టీ పెద్దలతో కేసీఆర్‌ డీల్‌ కుదుర్చుకున్నందుకు ఆయన కుటుంబాన్ని వదిలిపెడుతున్నారా?’’ అని నిలదీశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం వరంగల్‌, మంచిర్యాల జిల్లా మందమర్రిలో సంజయ్‌ మాట్లాడారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఉద్యోగ విరమణ చేయబోతున్న 10 వేల మందికి బెనిఫిట్స్‌ (రూ.11వేల కోట్లు) ఇచ్చే స్థితిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం లేదని.. అందుకే ఉద్యోగ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచబోతున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్‌ రాష్ట్రాన్ని సగం దోచుకున్నారని, మిగిలిన సగాన్ని కాంగ్రెస్‌ దోచుకుంటోందని విమర్శించారు.


నదుల్లో నీరున్నా.. వాడుకోలేదు..

రెండో పంటకు వరి వేయొద్దంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం, మరి ఏ పంట వేయాలో స్పష్టం చేయాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఏ పంట వేయాలో ప్రణాళిక లేకుండా వరి వేయొద్దంటే ఎలా అని ప్రశ్నించారు. రెండు పంటలకు నీళ్లు ఇవ్వాల్సింది పోయి, నీళ్లు లేవని చెప్పడమేంటని మండిపడ్డారు. వర్షాలు పుష్కలంగా పడి నదుల్లో నీరున్నా రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనం వల్ల వాడుకోలేకపోయారని విమర్శించారు. కృష్ణా జలాలను కేసీఆర్‌ ఏపీకి దోచిపెడితే.. ఇప్పుడు రేవంత్‌ కూడా అదే పనిచేస్తున్నారని మండిపడ్డారు. వరి వేయవద్దన్న కేసీఆర్‌కు పట్టిన గతే కాంగ్రె్‌సకు పడుతుందని హెచ్చరించారు. వరి వేస్తే రైతులకు ఉరేనన్న కేసీఆర్‌కు ప్రజలు ఓటుతో ఉరి వేశారని చెప్పారు. శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ సమాజం బీజేపీని మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మనకు ఓట్లు వేయని వారి కోసం మనమెందుకు పోరాడాలని కార్యకర్తలు అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నామన్నారు. 25 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. 50 వేల ఉద్యోగాలను ఎలా ఇచ్చిందో అర్థం కావట్లేదన్నారు. ఉపాధ్యాయ సంఘాలు పాలక పార్టీలకు కొమ్ము కాస్తూ.. టీచర్ల సమస్యలను గాలికొదిలేస్తున్నాయని ఆరోపించారు. టీఎన్జీవోలు పైరవీల కోసం ప్రజాభవన్‌కు వెళుతున్నారని విమర్శించారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలపై పోరాడేది బీజేపీయేనని.. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని సంజయ్‌ కోరారు.

Updated Date - Feb 24 , 2025 | 03:49 AM