Seed Certification Authority: విత్తన ధ్రువీకరణ సంస్థలో 20 కోట్లకు తేలని లెక్కలు
ABN , Publish Date - Aug 04 , 2025 | 05:25 AM
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్‌కేవీవై) పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ (సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ)కి మంజూరుచేసిన రూ.20 కోట్ల నిధుల వినియోగంపై లెక్కలు తేలటంలేదు.
ఏజీ ఆడిట్‌లో బయటపడ్డ లొసుగులపై వివరణ ఇవ్వని అథారిటీ
స్టార్ హోటళ్లలో ప్రైవేటు సంస్థల సదస్సులకు ప్రభుత్వ సొమ్ము
నిబంధనలకు విరుద్ధంగా ఈవెంట్ కంపెనీకి రూ. 2 కోట్లు బదిలీ
కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన భవనాలు, ల్యాబ్‌లు నిరుపయోగం
3 లక్షల నుంచి లక్ష ఎకరాలకు పడిపోయిన ధ్రువీకరణ విస్తీర్ణం
హైదరాబాద్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్‌కేవీవై) పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ (సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ)కి మంజూరుచేసిన రూ.20 కోట్ల నిధుల వినియోగంపై లెక్కలు తేలటంలేదు. విత్తన నాణ్యత తనిఖీ, ధ్రువీకరణకు వినియోగించాల్సిన నిఽధులను దారి మళ్లించినట్లు ‘ఏజీ ఆడిట్’తో వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ఏజీ కార్యాలయం నుంచి సంస్థ ఎండీ వివరణ కోరుతూ రెండుసార్లు లేఖలు రాయగా వాటిని బుట్టదాఖలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.13.74 కోట్లు, కేంద్ర ప్రభుత్వం రూ.6.54 కోట్లు కలిపి రూ.20.28 కోట్లు విత్తన ధ్రువీకరణ సంస్థకు మంజూరు చేస్తే.. వాటిని విచ్చలవిడిగా ఖర్చు చేసినట్లు ఏజీ ఆడిట్‌లో తేలింది. రైతు సమన్వయ సమితికి కోటి రూపాయలు అప్పనంగా ఇచ్చేశారు. వరంగల్‌లో ధ్రువీకరణ సంస్థ భవనం నిర్మించకముందే కాంట్రాక్టర్ ఖాతాకు రూ.95 లక్షల నగదు బదిలీ చేశారు. అధికారుల సొంత వాహనాల కోసం రూ.12 లక్షలు ఖర్చు చేశారు. రూ.28 లక్షలు పెట్టి కొన్న విత్తన రథం బస్సు (స్వరాజ్ మజ్దా) మూలనపడింది. ‘ఇస్టా కాంగ్రెస్’ (ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్) అనే ఒక ప్రైవేటు సంస్థ సదస్సుకు ప్రభుత్వ సొమ్ము ఖర్చు, ఎలాంటి టెండర్లు పిలవకుండా ‘ఎగ్జోటిక్ ఈవెంట్స్ కంపెనీ’కి రూ.2 కోట్లు బదిలీ చేసిన అంశాలపై ఏజీ ఆడిట్ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
గడిచిన పదేళ్లలో రాష్ట్ర రాజధానిలోని పేరెన్నిక గల స్టార్ హోటళ్లలో 14 సదస్సులు నిర్వహించారు. కాగా, విత్తన ధ్రువీకరణ విస్తీర్ణం 2014-15లో 2.80 లక్షల ఎకరాలు ఉంటే 2023-24కు వచ్చేసరికి లక్ష ఎకరాలకు పడిపోయింది. రోజు రోజుకు విత్తన ధ్రువీకరణ విస్తీర్ణం తగ్గిపోతుంటే అవసరంలేకపోయినా సూర్యాపేట, వనపర్తి, సిద్దిపేటలో రూ.5.20 కోట్లతో డివిజన్ కార్యాలయాల కోసం భవనాలు నిర్మించారు. ఇప్పుడవి నిరుపయోగంగా ఉన్నాయి. ఒక్క అధికారిని కేటాయించకపోగా ఒక్క ఎకరానికి కూడా ఇంతవరకు సీడ్ సర్టిఫికేషన్ ఇవ్వలేదని తనిఖీలో తేలింది. కరీంనగర్‌లో కోటి రూపాయలతో నిర్మించిన విత్తన పరీక్షల ల్యాబ్ మూతపడింది. రాజేంద్రనగర్‌లో రూ.10 కోట్లతో నెలకొల్పిన అంతర్జాతీయ ఇస్టా విత్తన పరీక్ష ల్యాబ్ కూడా సాధారణ పరీక్షలకే పరిమితమైనట్లు ఏజీ ఆడిట్‌లో తేటతెల్లమైంది. గతంలో ప్రైవేటు వ్యక్తులతో ఆడిట్ చేయించి కప్పి పెట్టిన విషయాలు... ఏజీ ఆడిట్‌లో బహిర్గతమయ్యాయి. సీడ్ కార్పొరేషన్‌తో పాటు ప్రైవేటు విత్తన కంపెనీలు ఉత్పత్తి చేసే విత్తనాల నాణ్యతను తనిఖీ చేసి, ధ్రువీకరించి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించటంలో కీలకపాత్ర పోషించాల్సిన విత్తన ధ్రువీకరణ సంస్థలో పలు అవకతవకలు వెలుగుచూడటం చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరం కమిషన్ నివేదికపై కీలక భేటీ.. ఎందుకంటే..
ధర్మస్థలలో మరో షాకింగ్ ఘటన.. దేశవ్యాప్తంగా ఆందోళన
Read latest Telangana News And Telugu News