Share News

మన సంస్కృతికి అందాల పోటీలు విరుద్ధం

ABN , Publish Date - May 13 , 2025 | 03:59 AM

మహిళల ఆత్మాభిమానాన్ని కించపరిచే అందాల పోటీలను రాష్ట్ర ప్రభుత్వం సగర్వంగా ప్రకటించడం సిగ్గుచేటు అని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన అరుణోదయ 50వసంతాల స్ఫూర్తి సభలో వక్తలు విమర్శించారు.

మన సంస్కృతికి అందాల పోటీలు విరుద్ధం

  • యువతకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు?

  • అరుణోదయ 50వసంతాల స్ఫూర్తి సభలో విమలక్క ప్రశ్న

  • ఆపరేషన్‌ కగార్‌, పహల్గాం దాడిని ఖండిస్తూ తీర్మానం

హైదరాబాద్‌ సిటీ, మే 12(ఆంధ్రజ్యోతి): మహిళల ఆత్మాభిమానాన్ని కించపరిచే అందాల పోటీలను రాష్ట్ర ప్రభుత్వం సగర్వంగా ప్రకటించడం సిగ్గుచేటు అని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన అరుణోదయ 50వసంతాల స్ఫూర్తి సభలో వక్తలు విమర్శించారు. తెలంగాణ పోరాట స్ఫూర్తికి, ప్రజా సంస్కృతికి అందాల పోటీలు పూర్తి విరుద్ధమని, వీటి ద్వారా యువతకు ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రజా గాయని విమలక్క ప్రశ్నించారు. ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే నిలిపివేసి, మావోయిస్టు పార్టీతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. సినీ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ సాంస్కృతిక వేదికలన్నీ ఒక్కటి కావాల్సిన అవసరం ఉందన్నారు. స్త్రీవాద రచయిత్రి కొల్హాపురం విమల మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా స్త్రీల నాయకత్వంలో సాగుతోన్న ఒకే ఒక్క సాంస్కృతిక ఉద్యమం అరుణోదయ మాత్రమే అని చెప్పారు. ఉస్మానియా ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య కాసీం మాట్లాడుతూ పల్లెల్లో మిగిలిన జానపద వాగ్మయాన్ని సేకరించి, భద్రపరిచే బాధ్యతను అరుణోదయ స్వీకరించాలని సూచించారు. అరుణోదయ గౌరవాధ్యక్షురాలు విమలక్క సారథ్యంలో అందాల పోటీలు, ఆపరేషన్‌ కగార్‌, ఉగ్రదాడులను ఖండిస్తూ పలు అంశాలు తీర్మానించారు. విడిగా ఉన్న అరుణోదయలతో పాటు భావసారూప్యత కలిగిన మిగతా విద్యార్థి, మహిళా సంఘాల ఐక్యతా ప్రయత్నాలను ముమ్మరం చేయడమే సభ ముఖ్య ఉద్దేశమని విమలక్క ప్రకటించారు. తద్వారా ఉమ్మడి వేదికగా ఏర్పడి, నవంబర్‌లో ఐక్యతా సభను నిర్వహించుకొనే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. అరుణోదయ, పీడీఎ్‌సయూ, పీఓడబ్ల్యూ విప్లవ సంఘాలు ఏర్పడి యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా అరుణోదయ రూపొందిన ఆడియో, వీడియో పాటను సామాజిక ఉద్యమకారిణి అంబిక ఆవిష్కరించారు. ప్రత్యేక సావనీర్‌ను ఎనిశెట్టి శంకర్‌ విడుదల చేశారు.


విమలక్క సారథ్యంలో కళా ప్రదర్శన

అరుణోదయ యాభై వసంతాల స్ఫూర్తి సభ సందర్భంగా ప్రజా కళాకారులు పెద్ద సంఖ్యలో సుందరయ్య పార్కు నుంచి వీఎ్‌సటీ వరకు డప్పు చప్పుళ్ళతో, పదం పాడుతూ... కదం తొక్కుతూ విమలక్క నేతృత్వంలో కళా ప్రదర్శన నిర్వహించారు. ఎర్ర జెండా చేతబట్టి నృత్యాలు చేస్తూ చైతన్య గీతాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తించారు. అనంతరం అరుణోదయ సీనీయర్‌ నాయకుడు రాములు జెండా ఆవిష్కరణ చేసి సదస్సు ప్రారంభించారు. ముందుగా పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి అరుణోదయ ప్రతినిధులు శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో జన సాహితి దివి కుమార్‌, ఆచార్య కొండా నాగేశ్వర్‌, మానవ హక్కుల వేదిక జీవన్‌ కుమార్‌, సాహిత్య విమర్శకుడు ఏకే ప్రభాకర్‌, విరసం వరలక్ష్మి, జిలుకర శ్రీనివాస్‌, కోలార్‌ శాంతమ్మ, బిస్మిల్లాఖాన్‌ అవార్డు గ్రహీత అందె భాస్కర్‌ తదితర ప్రజాకవులు, కళాకారులు సౌహార్ద సందేశం ఇచ్చారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ అధ్యక్ష, కార్యదర్శులు రమేష్‌ పోతుల, ఏపూరి మల్సూర్‌, ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్ష, కార్యదర్శులు కదీరయ్య, సుధాకర్‌, ప్రతినిధులు రాకేశ్‌, అనిత తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కౌలు రైతులకు శుభవార్త..

అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు..

భూ భారతి చట్టం రైతులకు రక్షణ కవచం..

For More AP News and Telugu News

Updated Date - May 13 , 2025 | 03:59 AM