Share News

Uttam Kumar Reddy: జీబీ లింక్‌పై న్యాయ పోరాటం

ABN , Publish Date - Jun 26 , 2025 | 03:57 AM

ఏపీ చేపట్టిన గోదావరి-బనకచర్ల అనుసంధాన (జీబీ లింక్‌) ప్రాజెక్టుకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్టును అడుకొంటామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు.

Uttam Kumar Reddy: జీబీ లింక్‌పై న్యాయ పోరాటం

  • ఆ ప్రాజెక్టును అడ్డుకొంటాం.. త్వరలో అపెక్స్‌ కౌన్సిల్‌

  • ఎన్‌డీఎ్‌సఏ నివేదికను అమలు చేయాలి: మంత్రి ఉత్తమ్‌

హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఏపీ చేపట్టిన గోదావరి-బనకచర్ల అనుసంధాన (జీబీ లింక్‌) ప్రాజెక్టుకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్టును అడుకొంటామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. జీబీ లింక్‌పై ఏపీ ప్రభుత్వం సమర్పించిన నివేదికను తిరస్కరించాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు. జలసౌధలో ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్‌ దాస్‌, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ఈఎన్‌సీ (జనరల్‌) మహ్మద్‌ అంజాద్‌ హుస్సేన్‌, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగానే జీబీ లింక్‌కు బీజం పడిందన్నారు. అప్పటి సీఎం కేసీఆర్‌ తొలి అపెక్స్‌ కౌన్సిల్‌లో చేసిన ప్రకటనకు అనుగుణంగానే ఏపీ ప్రభుత్వం 200 టీఎంసీలను తరలించడానికి జీబీ లింక్‌ను తెరమీదికి తీసుకొచ్చిందన్నారు. ఈ ప్రాజెక్టుపై చర్చించడానికి త్వరలోనే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి చైర్మన్‌గా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహిస్తామని కేంద్రం సమాచారం ఇచ్చిందని చెప్పారు.


ఈ ప్రాజెక్టుపై ఈ నెల 30న ఎమ్మెల్యేలకు వివరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌ తవ్వకాలు పర్యవేక్షించడానికి, ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి మేజర్‌ జనరల్‌ హర్పాల్‌సింగ్‌, కల్నల్‌ పరీక్షిత్‌ మెహ్రాను సలహాదారులుగా నియమించనున్నామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక అమలులో జాప్యం చేయరాదని మంత్రి స్పష్టం చేశారు. బ్యారేజీల పునరుద్ధరణ పనుల్లో జాప్యం జరిగితే ఉపేక్షించబోమన్నారు. కాగా, నీటి పారుదల శాఖలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. 18 ఏళ్లుగా అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లుగా పనిచేస్తున్నా పదోన్నతులు లేవని, ప్రస్తుతం 125 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సంఘాలు నివేదించాయి.

Updated Date - Jun 26 , 2025 | 03:57 AM