Share News

Amit Shah: చట్ట సభలు ప్రతిష్ఠను కోల్పోయినప్పుడల్లా విపరిణామాలు

ABN , Publish Date - Aug 25 , 2025 | 04:50 AM

ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లే చోదక శక్తి పార్లమెంటేనని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. చట్ట సభలో రూపుదిద్దుకునే సరైన విధానాలే మన దేశాన్ని సన్మార్గంలో నడిపిస్తాయని తెలిపారు.

Amit Shah: చట్ట సభలు ప్రతిష్ఠను కోల్పోయినప్పుడల్లా విపరిణామాలు

  • ప్రజాస్వామ్య చోదక శక్తి పార్లమెంటు

  • అక్కడ రూపుదిద్దుకునే సరైన విధానాలే దేశాన్ని సన్మార్గంలో నడిపిస్తాయి

  • స్పీకర్ల సమావేశంలో అమిత్‌ షా

న్యూఢిల్లీ, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లే చోదక శక్తి పార్లమెంటేనని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. చట్ట సభలో రూపుదిద్దుకునే సరైన విధానాలే మన దేశాన్ని సన్మార్గంలో నడిపిస్తాయని తెలిపారు. చట్టసభలు రాజకీయ ప్రయోజనాల కోసం కాదని, ప్రజల సమస్యలను లేవనెత్తడానికి సభ నిష్పక్షపాత వేదిక కావాలని అన్నారు. కేంద్ర శాసన సభ మొదటి స్పీకర్‌గా విఠల్‌భాయ్‌ పటేల్‌ ఎన్నికై వందేళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఢిల్లీ అసెంబ్లీలో రెండు రోజులపాటు జరిగే అఖిల భారత స్పీకర్ల సమావేశాన్ని ఆదివారం అమిత్‌ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సభతో పాటు స్పీకర్‌ గౌరవాన్ని పెంపొందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. నిబంధనల ప్రకారం సభ జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత స్పీకర్లు, చైర్మన్లతోపాటు ప్రతి సభ్యుడిపై ఉందన్నారు. 13 వేల ఏళ్ల భారత దేశ చరిత్రలో చట్ట సభలు గౌరవాన్ని కోల్పోయినప్పుడల్లా మనం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వచ్చిందని అమిత్‌ షా అన్నారు. శాసన సభలు సరిగా పనిచేయకపోతే ప్రజాస్వామ్య విలువలపై ప్రశ్నలు ఉత్పన్నమవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్‌ రిజిజు తెలిపారు. ఈ స్పీకర్ల సమావేశం ఉత్తమ పద్ధతులను నేర్చుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.


ఈ సమావేశంలో ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వి.కె. సక్సేనా, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, దేశంలోని 29 రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు, 17 మంది డిప్యూటీ స్పీకర్లు, ఆరు రాష్ట్రాల శాసన మండలి చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు.. కేంద్ర, ఢిల్లీ మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, మండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాశ్‌, ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్‌ షాను గడ్డం ప్రసాద్‌ శాలువాతో సత్కరించారు. కాగా, శాసన సభల పనిదినాలు పెరగాల్సిన అవసరం ఉందని ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణరాజు అభిప్రాయ పడ్డారు. ‘‘అసెంబ్లీల్లో నిజమైన ప్రజాస్వామ్యం ఉందా..? అన్న కీలక ప్రశ్నను మనం ఎదుర్కొంటున్నాం. తొలి పార్లమెంట్‌ సుమారు 135 రోజులు నడిచింది. నేను 17వ లోక్‌సభ సభ్యుడిగా ఉన్నాను. ఈ సభ పని దినాలు ఏడాదికి 55 రోజులకు పడిపోయాయి. ఇక్కడ కొంతమందితో మాట్లాడినప్పుడు తమ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు 30 నుంచి 40 రోజులు నడుస్తున్నాయని చెప్పారు. దీనిపై మనం ఎంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. సభలు ఇలాగే నడిస్తే ప్రజా సమస్యలపై చర్చించడం కష్టమే కదా..? అందుకే.. పనిదినాలు పెరగాల్సిన అవసరం ఉంది. 180 రోజులకు తక్కువ కాకుండా సభ నడవాలని రాజ్యాంగం చెబుతోంది. తొలి పార్లమెంట్‌ను సభాపతి 180 రోజులు నిర్వహించిన తీరును మనమంతా స్ఫూర్తిగా తీసుకోవాలి’’ అని రఘురామ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..

For More Telangana News And Telugu News

Updated Date - Aug 25 , 2025 | 04:50 AM