Share News

Khammam: ఇదీ మన రెవెన్యూ అధికారుల పనితీరు.. బర్త్‌ సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేస్తే..

ABN , Publish Date - Aug 07 , 2025 | 12:12 PM

బతికుండగానే డెత్‌ సర్టిఫికెట్‌ జారీ చేసిన ఘటన కూసుమంచి తహసీల్దార్‌ కార్యాలయంలో చోటుచేసుకుంది. చేసిన తప్పును సదరు సెక్షన్‌ అధికారి సరిదిద్దుకోకపోగా తమనే దబాయించి మందలించాడని బాధితులువాపోయారు.

Khammam: ఇదీ మన రెవెన్యూ అధికారుల పనితీరు.. బర్త్‌ సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేస్తే..

- మరణ ధ్రువీకరణ జారీ

- కూసుమంచి తహసీల్దార్‌ కార్యాలయంలో ఘటన

- ప్రశ్నించిన బాధితులపై దుర్భాషలాడిన సెక్షన్‌ అధికారి

కూసుమంచి(ఖమ్మం): బతికుండగానే డెత్‌ సర్టిఫికెట్‌ జారీ చేసిన ఘటన కూసుమంచి(Kusumanchi) తహసీల్దార్‌ కార్యాలయంలో చోటుచేసుకుంది. చేసిన తప్పును సదరు సెక్షన్‌ అధికారి సరిదిద్దుకోకపోగా తమనే దబాయించి మందలించాడని బాధితులువాపోయారు. బాధితుల కథనం ప్రకారం.. మండలంలోని గట్టుసింగారం గ్రామానికి చెందిన కడారి ఉపేందర్‌, మమత దంపతులు తమ కూతురు మాదవిద్య జనన సర్టిఫికెట్‌ కోసం పుట్టిన ఆరునెలల తర్వాత దరఖాస్తు చేశారు.


గ్రామపంచాయతీ కార్యాలయంలో రికార్డులు లేనందున తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కార్యదర్శి చెప్పారు. దీంతో బాలిక తల్లితండ్రులు గత ఏడాది డిసెంబరు 17న బాలిక జనన సర్టిఫికెట్‌ కోసం తహసీల్దార్‌ కార్యాలయంలో చలానా కట్టారు. అప్పటినుంచి అవి జతపర్చిన ధృవీకరణ పత్రాలు సరిగా లేవంటూ కాలాయాపన చేశారు. అనంతరం ఆగస్టు నాలుగోతేదీన సర్టిఫికెట్‌ చేతికందించారు.


బాలిక తల్లి పరిశీలించగా బర్త్‌ సర్టిఫికెట్‌ బదులు డెత్‌ సర్టిఫికెట్‌ జారీచేసినట్లు గమనించింది. ఇదేంటని ప్రశ్నించడంతో వెంటనే లాక్కొన్న సెక్షన్‌ ఆఫీసర్‌ దానిని చింపేశాడు. డెత్‌ బదులు మరల బర్త్‌ సర్టిఫికెట్‌ అందించారు. కానీ అందులో ఎక్కడ డెలివరీ అయిన వివరాలు లేకపోవడంతో.. సర్‌ హాస్పిటల్‌ వివరాలు నమోదు చేయాలని అడగ్గా దుర్భాషలాడాడు. దీంతో వారు తహసీల్దార్‌ను కలిసేందుకు వెళ్లగా అందుబాటులో లేకపోవడంతో ఇంటికి వెళ్లిపోయారు.


ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని కోరారు. తహసీల్దార్‌ రవికుమార్‌ను వివరణ కోరగా తాను బుధవారం కార్యాలయానికి రాలేదని, కోర్టు పనిమీద హైదరాబాద్‌ వెళ్లానని తెలిపారు. బాలిక తల్లితండ్రులు ఫోన్‌లో విషయం తన దృష్టికి తీసుకవచ్చారని తెలిపారు. పొరపాటు జరిగితే సరిచేసి బర్త్‌ సర్టిఫికెట్‌ తిరిగి జారీ చేస్తామని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

దొంగ డెత్‌ సర్టిఫికెట్‌తో ఎల్‌ఐసీకి టోకరా

Read Latest Telangana News and National News

Updated Date - Aug 07 , 2025 | 12:12 PM