Hyderabad: ‘గాలి’.. బాగలే.. నగరంలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం
ABN , Publish Date - Dec 18 , 2025 | 10:20 AM
హైదరాబాద్ మహానగరంలో వాయు కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతోంది. అలాగే గాలిలో నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తోంది. దీంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. దగ్గు, జలుబు, తుమ్ములతో నగర ప్రజలు అవస్థలు పడుతున్న పరిస్థితి నెలకొంది.
- రోజురోజుకూ క్షీణిస్తున్న గాలిలో నాణ్యత
- దగ్గు, జలుబు, తుమ్ములతో జనం అవస్థలు
- పారిశ్రామిక వాడల్లో తూతూ మంత్రంగా తనిఖీలు
హైదరాబాద్ సిటీ: నగరంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. తాజాగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 220కి చేరుకోవడంతో పర్యావరణ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. వివిధ ప్రాంతాల్లో గాలిలో ధూళికణాలు (పార్టికల్ మ్యాటర్) పీఎం 10, పీఎం 2.5 పరిమాణాలు అమాంతం పెరగడంతో ఆస్తమా రోగులు, వృద్ధులు, చిన్నారులు ఊపిరి తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి పీఎం 10 పరిమాణం 0-50 ఉంటే వాతావరణం మెరుగ్గా ఉన్నట్లు భావిస్తారు.
అయితే, ప్రస్తుతం నగరంలో పలు ప్రాంతాల్లో పీఎం 10 పరిమాణం క్యూబిక్ మీటర్‌కు 180 నుంచి 200 మైక్రోగ్రామ్స్ నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే, పీఎం 2.5 పరిమాణం 150 మైక్రోగ్రాముల వరకు చేరింది. పారిశ్రామిక వాడల్లో పరిశ్రమల నుంచి పెద్ద ఎత్తున పొగ రావడం, మురికివాడల్లో చెత్తచెదారం తగలేయడం వలన పీఎం 10 ధూళి కణాలు అధికంగా ఏర్పడతాయని, నగరంలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో పెట్రోలు, డీజిల్ వినియోగించే వాహనాల నుంచి వచ్చే పొగలో పీఎం 2.5 కణాలు ఎక్కువగా ఉంటాయని జేఎన్‌టీయూ పర్యావరణ విభాగం అధికారులు పేర్కొంటున్నారు.

కాలుష్య నియంత్రణకు ఇలా చేస్తే మేలు..
పారిశ్రామికవాడల్లో కాలుష్యాన్ని తెలిపే మెషీన్లు ఏర్పాటు చేయడం, రియల్ టైమ్‌లో కాలుష్య స్థాయిలను పీసీబీ నిరంతరం పర్యవేక్షించడం ముఖ్యమని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. పెట్రోలు, డీజిల్ వాహనాల నుంచి వచ్చే వ్యాక్యులర్ పొల్యూషన్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందంటున్నారు. చలి వాతావరణం వలన కాలుష్య తీవ్రత రానున్న రోజుల్లో మరింతగా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే, నగరంలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరినందున వృద్ధులు, చిన్నారులు, ఎక్కువ సమయం ఇళ్లలోనే గడపడం ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు. అత్యవసరమైతే మాస్కులు ధరించి బయటకు రావాలని సూచిస్తున్నారు. ఈ విషయమై పీసీబీ అధికారులు స్పందిస్తూ.. ప్రస్తుతం సంతృప్తికరమైన స్థాయిలోనే గాలిలో నాణ్యత సూచికలు ఉన్నాయని, కొన్ని థర్డ్‌పార్టీ యాప్‌లు మాత్రం కాలుష్య సూచికలను అధికంగా చూపుతున్నాయని కొట్టిపారేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి, వెండి.. మళ్లీ పెరిగాయిగా.. నేటి ధరలు ఇవీ
Read Latest Telangana News and National News