కులగణనపై ఏఐసీసీ సంతృప్తి
ABN , Publish Date - Feb 07 , 2025 | 03:37 AM
గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్న వెంటనే వీరు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా తాము జరిపించిన కులగణనను నిష్పాక్షిక ంగా జరిగిన తీరును రేవంత్ వివరించారు.

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శితో సీఎం రేవంత్, భట్టి, ఉత్తమ్, మహేశ్ కుమార్ గౌడ్ భేటీ
కులగణనపై వస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని వివరణ.. పీసీసీ కార్యవర్గంపైనా చర్చలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం నిర్వహించిన కులగణనపై ఏఐసీసీ సంతృప్తి వ్యక్తం చేసింది. కులగణనపై విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిలను అధిష్టానం ఢిల్లీకి పిలిపించింది. గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్న వెంటనే వీరు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా తాము జరిపించిన కులగణనను నిష్పాక్షిక ంగా జరిగిన తీరును రేవంత్ వివరించారు. ఎలాంటి ఎజెండా లేకుండా సమగ్రంగా ఈ కులగణన జరిగిందని, దానిపై వస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని వివరించారు. కాగా పీసీసీ అఽధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్‌ను నియమించి ఐదు నె లలు అయినప్పటికీ పార్టీ కార్యవ ర్గాన్ని నియమించలేదన్న విషయంపై కూడా చర్చ జరిగింది. పార్టీ కార్యవర్గంలోను, ఆఫీసు బేరర్లుగానూ ఎవరెవరెవరిని నియమించాలన్న విషయమ్మీద కూడా సుదీర్ఘంగా చర్చలు జరిగాయి.
పంచాయతీ ఎన్నికల నిర్వహణ కూడా చర్చకు వచ్చింది. దశలవారీగా స్థానిక ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలని కూడా పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది. అసంతృప్త ఎమ్మెల్యేలు సమావేశమవుతున్నారన్న వార్తలపైనా వేణుగోపాల్ ఆరా తీసినట్లు తెలిసింది. ఇందులో పెద్ద ఆందోళన పడాల్సిన అవసరం లేదని, కాంట్రాక్టర్ల బిల్లుల చె ల్లింపు జరగడం లేదని కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని వివరించినట్లు సమాచారం. కాగా శుక్రవారం ఉదయం రేవంత్, ఇతర పార్టీ నేతలు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా రెండు, మూడు రోజుల్లో పీసీసీ కార్యవర్గాన్ని అధిష్ఠానం ప్రకటిస్తుందని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కేసీ వేణుగోపాల్‌తో భేటీ ముగిశాక ఆయన మీడియాతో మాట్లాడారు. క్యాబినెట్ విస్తరణపైనా చర్చ జరిగిందని వెల్లడించారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ పూర్తయిన నేపథ్యంలో అధిష్ఠానం పెద్దల్ని ఆహ్వానించేందుకే తాము ఢిల్లీ వచ్చినట్లు చెప్పారు. త్వరలోనే రాష్ట్రానికి రాహుల్ గాంధీ వస్తానని వెల్లడించారు. కాగా కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలు ప్రజలు కోరుకున్నవేనని మంత్రి ఉత్తమ్ అన్నారు. ఈ రెండు అంశాలపై భారీ బహిరంగసభ ఏర్పాటు చేయాలని, దాని గురించి అధిష్ఠానం పెద్దలతో చర్చించడానికే ఢిల్లీ వచ్చినట్లు వెల్లడించారు.